గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో హైకోర్టు కీలక తీర్పు..
ABN , Publish Date - Jul 07 , 2026 | 07:46 PM
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. నిందితుడు, సస్పెండెడ్ సీఐ నాగరాజును విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో విచారించేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్)కు కోర్టు అనుమతి ఇచ్చింది.
అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. నిందితుడు, సస్పెండెడ్ సీఐ నాగరాజును విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో విచారించేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్)కు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవరించింది. అలాగే విచారణ ప్రక్రియ మొత్తాన్ని వీడియోగ్రఫీ చేసి సంబంధిత కోర్టు ముందు ఉంచాలని హైకోర్టు పేర్కొంది.
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీఐ నాగరాజు కస్టడీపై దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాలను మార్చాలని కోరుతూ ఏపీ హైకోర్టులో ఇటీవల సిట్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై నిన్న (సోమవారం) విచారణ జరగగా.. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును మంగళవారానికి రిజర్వ్ చేసింది. ఈ మేరకు నేడు తీర్పు వెలువరించింది. సోమవారం నాడు కేసు విచారణ సందర్భంగా ఇరువర్గాల న్యాయవాదులు పోటాపోటీగా తమ వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ కీలక విషయాలను కోర్టు దృష్టికి తెచ్చారు. విజయవాడ కోర్టు విధించిన కొన్ని షరతుల కారణంగా దర్యాప్తునకు ఆటంకం కలుగుతోందని హైకోర్టుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. నిందితుడిని ప్రశ్నించేందుకు పరిమితులు ఉండటంతో దర్యాప్తు సక్రమంగా జరిగే అవకాశం లేదని పేర్కొన్నారు.
నాగరాజును విచారించే సమయంలో వీడియో రికార్డింగ్‌కు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని.. అయితే ఆడియో రికార్డింగ్ వల్ల దర్యాప్తు గోప్యత దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో విచారణ వల్ల నిందితుడి హక్కులకు ఎలాంటి భంగం కలగదని ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదించారు. మరోవైపు నాగరాజు తరఫు న్యాయవాది కూడా హైకోర్టులో తన వాదనలు వినిపించారు. తన క్లయింట్‌కు ప్రాణహాని ఉందని, భద్రతా కారణాల దృష్ట్యా కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో విచారణకు అనుమతి ఇవ్వొద్దని హైకోర్టును కోరారు. అన్ని రకాల సౌకర్యాలు, భద్రత ఉన్న రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలోనే విచారణ చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ మేరకు నేడు తీర్పు వెలువరించింది.
ఈ వార్తలు కూడా చదవండి
సంప్రదాయ హస్తకళా వారసత్వానికి ఏపీ పుట్టినిల్లు: పవన్ కల్యాణ్
ముగిసిన సీఆర్డీయే 63వ అథారిటీ సమావేశం.. కీలక నిర్ణయాలు ఇవే..