Share News

ఏపీలో జనగణనకు ప్రతి ఒక్కరూ సహకరించాలి: జె.నివాస్

ABN , Publish Date - Apr 15 , 2026 | 04:44 PM

ఆంధ్రప్రదేశ్‌లో జనగణనకు ప్రజలు సహకరించాలని ఏపీ జనగణన అధికారి జె.నివాస్ కోరారు. ఎన్యూమరేటర్లకు అవసరమైన వివరాలు తప్పకుండా అందించి సెన్సస్ ప్రక్రియకు పూర్తి సహకారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

ఏపీలో జనగణనకు ప్రతి ఒక్కరూ సహకరించాలి: జె.నివాస్
AP Census Director J.Nivas

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జనగణనకు ప్రజలు సహకరించాలని ఏపీ జనగణన డైరెక్టర్ జె.నివాస్ కోరారు. ఎన్యూమరేటర్లకు అవసరమైన వివరాలు తప్పకుండా అందించి సెన్సస్ ప్రక్రియకు పూర్తి సహకారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇంటి నంబర్ల నమోదు ప్రక్రియకు ఎలాంటి అడ్డంకుటూ కల్పించవద్దని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుకు సెన్సస్ డేటా ఎంతో కీలకమని జె.నివాస్ పేర్కొన్నారు. జనగణనకు ఎవరైనా అడ్డంకులు సృష్టిస్తే క్రిమినల్ చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇది దేశంలో 16వ సెన్సస్ అని, స్వాతంత్య్రం తర్వాత ఎనిమిదవది అని ఆయన వెల్లడించారు.


కేంద్ర హోమ్ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ జరుగుతోందని జె.నివాస్ తెలిపారు. దీనికి రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ మార్గదర్శకాలు ఇస్తారని, ఏపీ చీఫ్ సెక్రటరీ పర్యవేక్షిస్తారని వివరించారు. రాష్ట్ర నోడల్ ఆఫీసర్‌గా చీఫ్ సెక్రటరీ బాధ్యతలు నిర్వర్తిస్తారని చెప్పుకొచ్చారు జె.నివాస్. ప్రిన్సిపల్ సెన్సస్ అధికారులుగా జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు ఉంటారని తెలిపారు. చార్జ్ ఆఫీసర్లుగా తహసీల్దార్లు, మున్సిపల్ అధికారులు వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లకు డేటా సేకరణ బాధ్యతలు అప్పగిస్తారని తెలిపారు. ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తారని, ప్రజలు సహకరించాలని ఆయన సూచించారు.


ఈ ప్రక్రియలో ప్రతి బిల్డింగ్‌కు ప్రత్యేక సెన్సస్ హౌస్ నంబర్ ఇస్తామని.. కాలేజీలు, ఫ్యాక్టరీలు, కమర్షియల్ బిల్డింగ్స్‌కూ నంబర్ కేటాయిస్తారన్నారు. మూడు ప్రధాన గుర్తింపులతో నంబర్ కేటాయింపు ఉంటుందని జె.నివాస్ తెలిపారు. బిల్డింగ్ నంబర్, సెన్సస్ హౌస్ నంబర్, హౌస్‌హోల్డ్‌కు స్థానిక సంస్థల నంబర్ల ఆధారంగా నంబర్ కేటాయిస్తారన్నారు. నంబర్ లేకపోతే ఎన్యూమరేటర్ కొత్తగా నంబర్ ఇస్తారని తెలిపారు. ఇంట్లో నివాసంగా ఉపయోగిస్తున్న భాగాన్నే హౌస్‌హోల్డ్‌గా పరిగణిస్తారని.. కమర్షియల్, నివాసం రెండూ కలిసి ఉంటే వేర్వేరుగా నమోదు చేస్తారని చెప్పారు.


ఇంటి పరిస్థితిపైనా పలు ప్రశ్నలు సంధిస్తారన్నారు. ఇంటి నిర్మాణం, గోడలు, మెటీరియల్ వంటి వివరాలూ సేకరిస్తారని ఏపీ జనగణన డైరెక్టర్ తెలిపారు. భవనాన్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నారనే (రెసిడెన్షియల్, కమర్షియల్, మిక్స్‌డ్) అంశాలనూ నమోదు చేస్తారన్నారు. ఈసారి పూర్తిగా డిజిటల్ సెన్సస్ ఉంటుందని.. ఇదంతా హౌస్‌హోల్డ్ నంబర్ యాప్‌లో ఆటో జనరేషన్ అవుతుందని తెలిపారు.


కుటుంబ వివరాలపై ప్రశ్నలు..

  • కుటుంబ పెద్ద పేరు

  • సభ్యుల సంఖ్య

  • ఇల్లు సొంతమా?, అద్దెదా?

  • ఎన్ని గదులు ఉన్నాయి?

  • వివాహిత జంటల సంఖ్య

  • మౌలిక సదుపాయాల వివరాలు

  • తాగునీటి వనరు

  • విద్యుత్, లైటింగ్ సౌకర్యం

  • మరుగుదొడ్లు, డ్రైనేజీ వివరాలు

  • బాత్రూమ్, కిచెన్, ఎల్పీజీ కనెక్షన్, వాహనాలు

  • టీవీ, డీటీహెచ్, ఇంటర్నెట్

  • ల్యాప్టాప్/కంప్యూటర్

  • మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్

  • టూ వీలర్/కారు వివరాలు

  • కుటుంబం ప్రధానంగా తీసుకునే ఆహారం వంటి అంశాలపై పశ్నలు ఉండనున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు జగన్ యత్నం: మంత్రి వీరాంజనేయ స్వామి

కదిరి ప్రమాద ఘటనపై స్పందించిన హోం మంత్రి

Updated Date - Apr 15 , 2026 | 05:02 PM