Share News

జయహో బీసీ.. స్థానిక సంస్థల బలోపేతానికి మరో ముందడుగు: మంత్రి నారా లోకేశ్

ABN , Publish Date - Aug 18 , 2026 | 08:30 PM

గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33⅓ శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాలు చారిత్రాత్మకమైనవని మంత్రి నారా లోకేశ్‌ పేర్కొన్నారు.

జయహో బీసీ.. స్థానిక సంస్థల బలోపేతానికి మరో ముందడుగు: మంత్రి నారా లోకేశ్
Nara Lokesh On BC Reservation

అమరావతి: బీసీలకు రాజకీయ సాధికారత కల్పించడంతో పాటు స్థానిక సంస్థలను మరింత బలోపేతం చేసే దిశగా ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్న నిర్ణయం చారిత్రాత్మకమని పేర్కొన్నారు.


గ్రామీణ స్థానిక సంస్థల్లో (RLBs) బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయించిందని లోకేశ్‌ తెలిపారు. అలాగే పట్టణ స్థానిక సంస్థల్లో (ULBs) బీసీలకు 33⅓ శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. బీసీలకు రాజకీయంగా మరింత ప్రాతినిధ్యం కల్పించేందుకు ఈ నిర్ణయం గొప్ప అవకాశంగా మారుతుందని మంత్రి పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో బీసీల భాగస్వామ్యం పెరగడం ద్వారా నిర్ణయాధికారంలో వారికి మరింత ప్రాధాన్యం లభిస్తుందని అన్నారు.


తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచే బీసీలకు అండగా నిలుస్తోందని నారా లోకేశ్‌ అన్నారు. బీసీల సంక్షేమం, రాజకీయ సాధికారత కోసం పార్టీ నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. 'ప్రజా ప్రభుత్వం బీసీలకు జై కొట్టింది.. జయహో బీసీ అంటోంది' అని లోకేశ్‌ పేర్కొన్నారు. ఏపీ పంచాయతీరాజ్‌ చట్టం–1994కు అనుగుణంగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ముఖ్యమైన అంశమని మంత్రి వివరించారు. నగరాలు, పట్టణాలు, నగర పంచాయతీల్లో మేయర్లు, చైర్మన్లను ఇకపై ప్రత్యక్ష ఎన్నికల విధానంలో ఎన్నుకునేలా నిర్ణయం తీసుకున్నట్లు లోకేశ్‌ తెలిపారు. రాష్ట్రంలోని ప్రస్తుత 13 జిల్లా పరిషత్‌లను 28 జిల్లా పరిషత్‌లుగా ఏర్పాటు చేయాలని కేబినెట్‌ నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. పరిపాలన వికేంద్రీకరణకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.


ఈ క్రమంలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌ కల్పించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్వాగతించారు. ఇది బీసీల సామాజిక న్యాయం, రాజకీయ సాధికారత దిశగా మరో కీలక అడుగని పేర్కొన్నారు. 34 శాతం రిజర్వేషన్‌తో లక్షలాది బీసీ కుటుంబాల చిరకాల స్వప్నాలు సాకారం కానున్నాయని అన్నారు. ఎన్టీఆర్‌ నుంచి చంద్రబాబు వరకు టీడీపీ బీసీల అభ్యున్నతికి ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. బీసీల హక్కులను కాపాడటమే టీడీపీ ప్రభుత్వ ధ్యేయమని పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం బీసీలను వంచించిందని, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా జగన్‌ మోసం చేశారని పల్లా శ్రీనివాసరావు విమర్శించారు.


Also Read:

పడుకునే ముందు గ్లాసు ధనియాల నీరు తాగితే ఆరోగ్యానికి మంచిదా?

జేసీబీ‌తో డ్రైవర్ పరార్.. సినిమా లెవెల్లో పోలీస్ ఛేజింగ్..

Updated Date - Aug 18 , 2026 | 09:07 PM