Share News

బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం.. శనివారం అత్యవసర క్యాబినెట్ భేటీ..

ABN , Publish Date - Oct 09 , 2026 | 09:22 PM

ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన తరగతులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. బీసీలకు తగిన న్యాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు.

బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం.. శనివారం అత్యవసర క్యాబినెట్ భేటీ..
BC Reservations in AP

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన తరగతులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. బీసీలకు తగిన న్యాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఇవాళ (శుక్రవారం) సీఎం చంద్రబాబు కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రిజర్వేషన్ల అంశంపై ఉన్నత న్యాయస్థానం తీర్పును గౌరవిస్తున్నామని పేర్కొన్నారు. అయితే, రాజ్యాంగ పరిధిలో బీసీలకు సాధ్యమైనంత రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.


ఎస్సీ, ఎస్టీల రాజ్యాంగబద్ధమైన హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఈ అంశంపై చర్చించి తదుపరి కార్యాచరణను నిర్ణయించేందుకు శనివారం అత్యవసర క్యాబినెట్ సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా రాజీవ్ రంజన్ ఏకసభ్య కమిషన్ నివేదికను క్యాబినెట్ ముందు ఉంచనున్నట్లు తెలిపారు. కమిషన్ నివేదిక, సుప్రీంకోర్టు తీర్పు, రాజ్యాంగ నిబంధనలను సమగ్రంగా పరిశీలించి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి వెల్లడించారు.


బీసీల రాజకీయ సాధికారతకు చట్టబద్ధమైన, నిలకడైన పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు చెప్పారు. చట్టపరంగా సమస్యలు ఉన్నప్పటికీ, రాజకీయంగా బీసీలకు 34 శాతం కంటే ఎక్కువ సీట్లు ఇచ్చి న్యాయం చేస్తామని ఇప్పటికే ప్రకటించినట్లు ఆయన తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

రేపు ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. బీసీ రిజర్వేషన్లపై కీలక చర్చ

ఆ భూములపై చంద్రబాబు కీలక నిర్ణయం.. రైతులకు భారీ ఊరట

Updated Date - Oct 09 , 2026 | 09:29 PM