రెండో రోజుకు చేరిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ప్రశ్నోత్తరాల్లో ఏం చర్చించనున్నారంటే..
ABN , Publish Date - Aug 18 , 2026 | 07:53 AM
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ (మంగళవారం) రెండో రోజు కొనసాగనున్నాయి. ఉదయం 9 గంటలకు సభ ప్రారంభం కానుంది. తొలుత ప్రశ్నోత్తరాల కార్యక్రమం నిర్వహించనున్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ (మంగళవారం) రెండో రోజు కొనసాగనున్నాయి. ఉదయం 9 గంటలకు సభ ప్రారంభం కానుంది. తొలుత ప్రశ్నోత్తరాల కార్యక్రమం నిర్వహించనున్నారు. అనంతరం బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) నిర్ణయాల నివేదికను సభ ముందు సీఎం చంద్రబాబు ఉంచనున్నారు. అనంతరం విద్యుత్ శాఖకు సంబంధించిన జీవో ఆర్‌టీ నం.27ను మంత్రి గొట్టిపాటి రవికుమార్ సభలో ప్రవేశపెట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్-1971 ప్రకారం ఈ జీవోను సభ ముందు పెట్టనున్నారు.
అలాగే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ లైబ్రరీస్ (అమెండ్‌మెంట్) బిల్లు-2026పై కీలక ప్రక్రియ జరగనుంది. సవరణ బిల్లును ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరడంతోపాటు.. బిల్లును పరిశీలనకు తీసుకోవాలని, అనంతరం ఆమోదించాలని మంత్రి నారా లోకేశ్ ప్రతిపాదించనున్నారు. అలాగే, ‘సూపర్ సిక్స్-ప్రజా సంక్షేమం’పై సభలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. సూపర్ సిక్స్ పథకాలు, ప్రజా సంక్షేమానికి సంబంధించిన అంశాలపై సభ్యులు చర్చించనున్నారు.
ప్రశ్నోత్తరాల్లో కీలక అంశాలు..
అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. వడ్డీ లేని రుణాల పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచడంపై ఎమ్మెల్యే దాసరి సుధ ప్రశ్నించనున్నారు. గత రెండేళ్లలో స్వయం సహాయక సంఘాలకు విడుదల చేసిన వడ్డీ లేని రుణాల వివరాలనూ ఆమె కోరనున్నారు. 25 వేలకుపైగా జనాభా ఉన్న గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేసే ప్రతిపాదనపై ప్రశ్నలు రానున్నాయి. కోవూరు గ్రామ పంచాయతీని కూడా అప్‌గ్రేడ్ చేసే జాబితాలో చేర్చారా? అనే అంశంపై సభ్యులు ప్రశ్నించనున్నారు. కోనసీమలో వృద్ధాప్య దశకు చేరిన కొబ్బరి తోటల అంశం సభ ముందుకు రానుంది. కొబ్బరి తోటల పునరుజ్జీవనం, తిరిగి నాటే కార్యక్రమాలపై కొబ్బరి అభివృద్ధి బోర్డుతో కేంద్రం జరిపిన సంప్రదింపుల వివరాలను కోరనున్నారు. అర్హులైన కొబ్బరి రైతులకు కొత్త మొక్కలు, ఆర్థిక, సాంకేతిక సహాయం అందించే ప్రతిపాదనలపై ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ వివరాలు అడగనున్నారు.
ప్రైవేట్ స్లీపర్ బస్సుల్లో వరుసగా చోటుచేసుకుంటున్న అగ్ని ప్రమాదాల అంశం అసెంబ్లీలో ప్రస్తావనకు రానుంది. ప్రమాదాల నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వివరాలు కోరనున్నారు. రాష్ట్రంలో ప్రైవేట్, ప్రభుత్వ రంగాల్లో నమోదైన స్లీపర్ బస్సుల సంఖ్యపైనా ప్రశ్నించనున్నారు. భారీ వాహనాలకు రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు, టెయిల్ లైట్ల విషయంలో రవాణాశాఖ తీసుకుంటున్న చర్యలపై ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ ప్రశ్నించనున్నారు. విశాఖపట్నం పోర్టు ప్రాంతంలో వాయు నాణ్యత పర్యవేక్షణపైనా అసెంబ్లీలో ప్రశ్నలు రానున్నాయి. డస్ట్ సప్రెషన్ సిస్టమ్స్, ఫాగ్ కేనన్స్, గ్రీన్‌బెల్ట్, రియల్‌టైమ్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్ల ఏర్పాటుపై సభ్యులు వివరాలు కోరనున్నారు. విశాఖపట్నంలో వాయు నాణ్యత మెరుగుదలకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, ప్రతిపాదనలపై ప్రశ్నించనున్నారు.
ఎస్సీ, ఎస్టీ మహిళా స్వయం సహాయక సంఘాల సాధికారత కోసం కేటాయించిన ‘ఉన్నతి పథకం’ నిధుల దుర్వినియోగం అంశాన్ని సభ్యులు ప్రభుత్వం దృష్టికి తీసుకురానున్నారు. ఈ నిధుల వినియోగానికి సంబంధించిన అంశాలపై అసెంబ్లీలో ప్రశ్నలు రానున్నాయి. అలాగే ప్రధాన దేవాలయాల్లో అర్చకులు, వేద పండితుల నియామకాల్లో స్థానికులకు ప్రాధాన్యత కల్పించే అంశంపైనా చర్చ జరగనుంది. శ్రీశైలం, మహానంది, శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాల్లో స్థానికులకు ప్రాధాన్యత కల్పించే చర్యలపై ఎమ్మెల్యే వాల్మీకి పార్థసారథి వివరాలు కోరనున్నారు. ప్రధాన దేవాలయాల్లో నియామకాలకు జోనల్ విధానం అమలుపై ప్రశ్న రానుంది. రాయలసీమకు చెందిన అర్చకులు, వేద పండితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సభ్యులు కోరనున్నారు.
అరకు కాఫీ తోటలకు కాఫీ బెర్రీ డిసీజ్‌తో తీవ్ర నష్టం వాటిల్లిన అంశం అసెంబ్లీ దృష్టికి రానుంది. వేల ఎకరాల్లో కాఫీ తోటలు దెబ్బతిన్నాయన్న అంశంపై సభ్యులు ప్రశ్నించనున్నారు. ప్రభావిత విస్తీర్ణం, రైతుల సంఖ్య, ప్రభుత్వం చెల్లించిన పరిహారానికి సంబంధించిన వివరాలను కోరనున్నారు. మరోవైపు, రాష్ట్రంలో కొత్త ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్ల అంశంపైనా ప్రశ్నలు రానున్నాయి. ప్రతిపాదిత, నిర్మాణంలో ఉన్న కొత్త పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల జిల్లా వారీ వివరాలను సభ్యులు కోరనున్నారు. ఆయా ప్రాజెక్టుల అంచనా వ్యయం, కేటాయింపులు, విడుదలైన నిధులు, ఇప్పటివరకు చేసిన ఖర్చుపై వివరాలు అడగనున్నారు. భూసేకరణ, పర్యావరణ, సీఆర్‌జెడ్ అనుమతులు, బ్రేక్‌వాటర్లు, జెట్టీలు, డ్రెడ్జింగ్ పనుల ప్రస్తుత స్థితిపైనా ప్రశ్నలు లేవనెత్తనున్నారు. కొత్త పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల ద్వారా ఆర్థికాభివృద్ధి, ఎగుమతులు, మత్స్యకారుల జీవనోపాధి, ఉపాధి అవకాశాలపై ప్రభుత్వం అంచనా వేసిన అంశాలను సభ్యులు ప్రశ్నించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి