Share News

ఎల్‌నినో ప్రభావం.. రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయండి: మంత్రి అచ్చెన్నాయుడు

ABN , Publish Date - Jun 29 , 2026 | 11:39 AM

వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. వైసీపీ హయాంలో వ్యవసాయానికి కనీస సహకారం లేదని మండిపడ్డారు.

ఎల్‌నినో ప్రభావం.. రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయండి: మంత్రి అచ్చెన్నాయుడు
Minister Atchannaidu

గుంటూరు జిల్లా, జూన్ 29: వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు ‘ఏరువాక’ను ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ హయాంలో వ్యవసాయానికి కనీస సహకారం లేదని.. విత్తనాల కంపెనీలకు కూడా బకాయిలు పెట్టి వెళ్లారని మండిపడ్డారు. కూటమి అధికారంలో వచ్చాక రాయితీపై రైతులకు విత్తనాలు ఇస్తున్నామన్నారు. వ్యవసాయ రంగాన్ని వైసీపీ నాశనం చేసిందని.. ఇప్పుడు మళ్లీ ఏదేదో విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


మామిడి, పొగాకు రైతులకు ధరల ఇబ్బంది లేకుండా చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఎరువులు, పురుగు మందులను రైతులు తక్కువగా వాడాలని సూచించారు. భూమి ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రత్యేక యాప్ ద్వారా ఎరువులను అందిస్తున్నామన్నారు. యాప్ ద్వారా 20 రోజుల్లో 11 లక్షల మంది రైతులు ఎరువులు తీసుకున్నారని తెలిపారు. వీరిలో మూడు లక్షల మందికి పైగా కౌలు రైతులు కూడా ఉన్నారన్నారు. రాష్ట్రంలో ఎక్కడా ఎరువుల కొరత లేదని స్పష్టం చేశారు. శాస్త్రవేత్తలు సూచించిన మేరకు మాత్రమే ఎరువులు వేయాలని అన్నారు. రైతులకు పచ్చిరొట్ట ఎరువుల కోసం రాయితీ ఇస్తున్నామన్నారు. మిర్చిలో పురుగు మందుల అవశేషాలు ఉన్నాయని చైనా మూడు కంటైనర్లు వెనక్కి పంపిందని.. ఈ విషయాన్ని రైతులు గమనించి పురుగు మందులు వాడకం తగ్గించాలని సూచించారు.


వరిసాగును తగ్గించాలని చెప్పినా రైతులు పట్టించుకోవటం లేదని.. సరైన లాభాలు లేకపోయినా వరి వేసి నష్టాల పాలవుతున్నారని మంత్రి తెలిపారు. ఉద్యాన పంటలకు మంచి డిమాండ్ ఉందన్నారు. వ్యవసాయంలో 50 వేల కోట్ల ఆదాయం వస్తుంటే.. ఉద్యాన పంటలలో లక్షా 50 వేల కోట్ల ఆదాయం వస్తోందని తెలిపారు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని చెప్పారు. రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సూచించారు. వర్జీనియా పొగాకు ధర సరిగా లేదని టోబాకో బోర్డు, వ్యాపారులతో మాట్లాడామన్నారు. కిలో రూ.200 కంటే తక్కువకు కొనడానికి వీల్లేదని చెప్పామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.


ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, బూర్ల రామాంజనేయులు, జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధూళిపాళ్ల మాట్లాడుతూ.. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేశారని తెలిపారు. అనేక రకాల పంటలకు గిట్టుబాటు ధర కల్పించారన్నారు. ఎరువులను ఇప్పుడు ఒక యాప్ ద్వారా అందిస్తున్నామని చెప్పారు. రైతులకు 3 బస్తాల యూరియా ఇస్తే ఉపయోగకరంగా ఉంటుందన్నారు. 2.5 ఎకరానికి ఒక బస్తా డీఏపీ ఇస్తున్నారని.. అలా కాకుండా ఎకరానికి ఒక బస్తా ఇస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ఎమ్మెల్యే ధూళిపాళ్ల సూచించారు. రైతులకు అన్నదాతా సుఖీభవ ద్వారా ఎంతో లబ్ధి చేకూరుతోందని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అన్నారు. రైతుల సంక్షేమం కోసం పని చేసే వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ఎమ్మెల్యే కొనియాడారు.


ఇవి కూడా చదవండి...

తమిళనాడు, పాండిచ్చేరి మరబోట్ల హల్‌చల్.. తీరంలో హైటెన్షన్

ఏబీఎన్ ఎఫెక్ట్.. చింతలపూడి ఎస్సీ బాలికల హాస్టల్ వార్డెన్ సస్పెన్షన్

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 29 , 2026 | 12:27 PM