Share News

ప్రకృతి వ్యవసాయంలో ఏపీనే టాప్: సీఎం చంద్రబాబు..

ABN , Publish Date - Oct 10 , 2026 | 09:43 PM

ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తృతం చేస్తూ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానానికి చేరుకుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రకృతి వ్యవసాయం విజయవంతం కాదని గతంలో కొందరు దుష్ప్రచారం చేశారని ఆగ్రహించారు.

ప్రకృతి వ్యవసాయంలో ఏపీనే టాప్: సీఎం చంద్రబాబు..
CM Chandrababu Naidu

అమరావతి: ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తృతం చేస్తూ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానానికి చేరుకుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రకృతి వ్యవసాయం విజయవంతం కాదని గతంలో కొందరు దుష్ప్రచారం చేశారని ఆగ్రహించారు. అయితే, 2016లో 40 వేల మంది రైతులతో ప్రారంభమైన ఈ సాగు నేడు 17.73 లక్షల మంది అన్నదాతలకు చేరిందన్నారు. ఏపీలో ప్రకృతి సేద్యం విస్తరణ, పీఎండీఎస్‌పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, రైతులు, కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లు, వ్యవసాయ శాఖ అధికారులు హాజరయ్యారు.


ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయంలో దేశంలోనే అగ్రస్థానానికి చేరుకున్నామని అన్నారు. 25 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యం చేసేలా ప్రోత్సహిస్తున్నామని సగర్వంగా చెప్పారు. రసాయన ఎరువుల వాడకంతో భూసారం క్షీణిస్తుందని, సాగు ఖర్చులు పెరిగి రైతులకు భారంగా మారుతుందని చంద్రబాబు తెలిపారు. రసాయన ఎరువుల వినియోగంతో పోలిస్తే ప్రకృతి వ్యవసాయం ద్వారా 47 శాతం మేర ఆదాయం పెరిగిందన్నారు. తీవ్రమైన కరవు పరిస్థితులను సైతం తట్టుకుని ప్రకృతి సేద్యం ద్వారా ఎక్కువ దిగుబడులు పొందవచ్చన్నారు. దీని ద్వారా సాగు చేసినప్పుడు పత్తి పంటలో 96 శాతం, కందుల్లో 87 శాతం మేర నికర ఆదాయం లభించిందని పేర్కొన్నారు.


పెట్టుబడి వ్యయాన్ని తగ్గించి, రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ఈ వ్యవసాయ విధానం ఉపకరిస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రస్తుతం ఎల్ నినో ప్రభావంతో ఏర్పడే కరవును తట్టుకునేలా ప్రకృతి వ్యవసాయం దోహదపడుతుందని, తద్వారా భూతాపాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని అన్నారు. పచ్చదనం పెరిగితే నేలలో తేమను కాపాడుకునేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. ఏడాది పొడవునా రైతులకు ఆదాయం లభించడంతో పాటు పశుగ్రాసం, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రకృతి సేద్యం ద్వారా స్వల్ప వర్షపాతం నమోదైనా పంటలను కాపాడుకునే అవకాశం ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ ద్వారా రైతులకు అండగా నిలుస్తోందన్నారు. ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు ఏపీలో అనుసరిస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానాలను అధ్యయనం చేస్తున్నారని తెలిపారు.


2023-24కు ముందు సంవత్సరాలతో పోలిస్తే ఏపీలో రసాయన ఎరువుల వినియోగం 6 శాతం మేర తగ్గిందని సీఎం వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే ఇప్పటికే మరో 2.28 శాతం మేర తగ్గిందన్నారు. ఎరువుల వినియోగాన్ని తగ్గించినందుకు కేంద్రం అందించే రూ.218 కోట్ల ప్రోత్సాహకాల కోసం ఇప్పటికే లేఖ రాశామన్నారు. ప్రకృతి వ్యవసాయ విస్తరణకు యుద్ధప్రాతిపదికన పనిచేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలతో లోటు వర్షపాతం 34 శాతానికి తగ్గిందన్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రకృతి సేద్యాన్ని కొనసాగించామని, రాయలసీమలో ఉద్యాన పంటలు, ఇతర ప్రాంతాల్లో పౌల్ట్రీపై దృష్టి పెట్టామని చెప్పారు.


నిరంతర అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రకృతి వ్యవసాయంలో దేశానికే ఆదర్శంగా నిలిచే అవకాశం ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రకృతి సేద్యంలో గుజరాత్ కంటే ఏపీ అగ్రస్థానంలో ఉందని ఇటీవల ప్రధాని మోదీ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ నెల 15న నిర్వహించే సరస్ మేళాలోనూ ప్రకృతి వ్యవసాయ విధానాలను ప్రదర్శిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి

తూ.గో. జిల్లాలో పెద్దపులి కలకలం.. రంగంలోకి పుణె రెస్క్యూ టీమ్

మంత్రి లోకేశ్ చొరవ.. ఆ సర్కార్ పాఠశాలకు మహర్దశ

Updated Date - Oct 10 , 2026 | 09:55 PM