Share News

ఎరువుల పంపిణీపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు: మంత్రి అచ్చెన్న..

ABN , Publish Date - Jun 07 , 2026 | 09:30 PM

ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఎరువుల పంపిణీ చేయాలని సంబంధిత అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. ఎరువుల పంపిణీలో పారదర్శకతకు ఏపీఎఐఎంఎస్ 2.0 అమలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఎరువుల పంపిణీపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు: మంత్రి అచ్చెన్న..
Minister Kinjarapu Atchannaidu

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఎరువుల పంపిణీ చేయాలని సంబంధిత అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. ఎరువుల పంపిణీలో పారదర్శకతకు ఏపీఎఐఎంఎస్ 2.0 అమలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే ఎరువుల దారి మళ్లింపులు అరికట్టేందుకు విజిలెన్స్ బృందాలను ఏర్పాటు చేయాలని ఆజ్ఞాపించారు. కౌలు రైతులకూ ఎలాంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు నేడు (ఆదివారం) జిల్లా కలెక్టర్లు, జేసీలు, వ్యవసాయ అధికారులతో మంత్రి అచ్చెన్న టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో 28 జిల్లాల అధికారులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా ఎరువుల కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి అచ్చెన్న ఆదేశించారు. రైతుల్లో అనవసర ఆందోళనలు రేకెత్తించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎరువుల పంపిణీపై తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పంటల వారీగా ఎరువుల వినియోగంపై అన్నదాతలకు అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. మండల స్థాయిలో ముందస్తుగా ఎరువుల నిల్వలు ఉంచాలని హుకుం జారీ చేశారు. గతేడాది సమస్యలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కృష్ణా, కాకినాడ జిల్లాల్లో ఎఫ్‌ఎఫ్‌ఎస్ ద్వారా ఎరువుల బుకింగ్ చేయాలని, మిగతా 26 జిల్లాల్లో ఏపీఎఐఎంఎస్ 2.0 యాప్ ద్వారా పంపిణీ చేయాలన్నారు.


మరోవైపు ఎరువుల దారి మళ్లింపుపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ చర్యలు కొనసాగించాలని అధికారులకు సీఎం చంద్రబాబు కార్యదర్శి రాజమౌళి సూచించారు. జిల్లా వ్యవసాయ అధికారులు రోజువారీ నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. రైతుల సమస్యల పరిష్కారానికి రియల్‌టైమ్ గ్రీవెన్స్ వ్యవస్థ ఏర్పాటు చేశామన్నారు. అన్ని రైతు సేవా కేంద్రాలకు లాగిన్ వివరాలు అందించినట్లు ఆయన వెల్లడించారు. ఖరీఫ్ ఈ-క్రాప్ బుకింగ్ రైతుల జాబితా డౌన్‌లోడ్ సౌకర్యం కల్పించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ఎరువుల రిటైలర్లు ఏపీఎఐఎంఎస్ 2.0లో నమోదు చేసుకోవాలన్నారు. రైతులు గుర్తింపు పొందిన రిటైలర్ల ద్వారా ఎరువులు కొనుగోలు చేసే అవకాశం ఉందన్నారు. శాస్త్రవేత్తల సిఫార్సుల ఆధారంగానే ఎరువుల కేటాయింపు చేయాలని అధికారులకు సీఎం కార్యదర్శి రాజమౌళి సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి

కూటమి నేతలతో జూమ్ మీటింగ్.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

కుప్పం బాధ్యతల నుంచి కంచర్ల శ్రీకాంత్‌ను తప్పించిన సీఎం చంద్రబాబు

Updated Date - Jun 07 , 2026 | 09:36 PM