Share News

గుడ్ న్యూస్.. నాలుగు యూసీఎఫ్ ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..

ABN , Publish Date - May 21 , 2026 | 08:05 PM

ఆంధ్రప్రదేశ్‌లో రూ.1,990.83 కోట్ల విలువైన అర్బన్ ఛాలెంజ్ ఫండ్(UCF) ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఆంధ్రప్రదేశ్ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఈ మేరకు నాలుగు కీలకమైన పట్టణ మౌలిక వసతుల ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వెల్లడించారు.

గుడ్ న్యూస్.. నాలుగు యూసీఎఫ్ ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..
Minister Narayana

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రూ.1,990.83 కోట్ల విలువైన అర్బన్ ఛాలెంజ్ ఫండ్(UCF) ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఆంధ్రప్రదేశ్ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఈ మేరకు నాలుగు కీలకమైన పట్టణ మౌలిక వసతుల ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వెల్లడించారు. యూసీఎఫ్ ద్వారా ఈ ప్రాజెక్టుల కోసం కేంద్రం రూ.497.71 కోట్ల ఆర్థిక సహాయం అందించనుందని మంత్రి పేర్కొన్నారు.


విశాఖపట్నం, మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్లలో ప్రాజెక్టులకు ఆమోదం లభించిందని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. 'అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద నాలుగు ప్రాజెక్టులకు ఆమోదం లభించడం ఏపీకి గొప్ప గుర్తింపు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది. సాధారణ మున్సిపల్ పనులకు మించి ఆధునిక పట్టణాభివృద్ధిపై ఫోకస్ పెట్టాం. తాగునీరు, అండర్‌ గ్రౌండ్ డ్రైనేజ్, మురుగునీటి శుద్ధిపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది.


ఈ ప్రాజెక్టుల ద్వారా విశాఖ, మంగళగిరి-తాడేపల్లిలో ప్రజారోగ్యం, జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. పట్టణాల్లో కోర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ముందుగా పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అవకాశాన్ని ఏపీ పూర్తిస్థాయిలో వినియోగించుకుంటుంది. ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో అత్యుత్తమ పట్టణ మౌలిక వసతుల రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం. పట్టణాభివృద్ధిలో దేశానికి ఆంధ్రప్రదేశ్ మోడల్‌గా నిలుస్తుంది' అని చెప్పారు.


కాగా, పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి, నగరాల ఆధునీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.లక్ష కోట్లతో అర్బన్ ఛాలెంజ్ ఫండ్‌ని ఏర్పాటు చేసింది. పట్టణాలను ఆర్థికవృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దడం, అలాగే ప్రైవేట్ లేదా మార్కెట్ పెట్టుబడులను ఆకర్షించే ఉద్దేశంతో కేంద్రం ఈ ఫండ్‌ని కేటాయించింది.


ఈ వార్తలు కూడా చదవండి

మహానాడులో 20 తీర్మానాలు.. రాజకీయ అంశాలపై విస్తృత చర్చ
గుంటూరు ప్రభుత్వ విద్యార్థులతో ఉపరాష్ట్రపతి భేటీ.. ‘నారీ శక్తి’పై ప్రశంసలు

Updated Date - May 21 , 2026 | 08:09 PM