మరో 15 కొత్త జిల్లా పరిషత్‌ల ఏర్పాటుకు కసరత్తు
ABN , Publish Date - Aug 11 , 2026 | 07:04 AM
కొత్త జిల్లాలు వచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలో మరో 15 జిల్లా పరిషత్‌ల ఏర్పాటుకు పంచాయతీరాజ్‌శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. జిల్లాకో జడ్పీ ఏర్పాటుకు ప్రస్తుతమున్న 13 జిల్లా పరిషత్‌ల పునర్విభజన చేపట్టనున్నారు.
జడ్పీల పునర్విభజనకు రెడీ!
కొత్తగా మరో 15 జిల్లా పరిషత్‌ల ఏర్పాటుకు కసరత్తు
సెప్టెంబరు 24తో ముగియనున్న జడ్పీ, మండల పాలకవర్గాల పదవీకాలం
ఆలోపు ఎన్నికలు పూర్తయ్యే ఛాన్స్ లేదు
ప్రత్యేకాధికారుల నియామకానికి చర్యలు
అమరావతి: కొత్త జిల్లాలు వచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలో మరో 15 జిల్లా పరిషత్‌ల ఏర్పాటుకు పంచాయతీరాజ్‌శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. జిల్లాకో జడ్పీ ఏర్పాటుకు ప్రస్తుతమున్న 13 జిల్లా పరిషత్‌ల పునర్విభజన చేపట్టనున్నారు. అంటే మొత్తం 28 జిల్లా పరిషత్‌లు ఏర్పాటు కానున్నాయి. సెప్టెంబరు 24వ తేదీతో అన్ని జిల్లాల జడ్పీ చైర్‌పర్సన్లు, జడ్పీటీసీల పదవీకాలం, అంతకుముందు రోజే ఎంపీటీసీలు, మండల పరిషత్ అధ్యక్షుల పదవీకాలం ముగియనుంది.
ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో జిల్లా పరిషత్‌ల పునర్విభజన ప్రక్రియ పూర్తి చేసేందుకు సమయం పడుతుంది. అందుకే పంచాయతీరాజ్ కమిషనరేట్ ఆ మేరకు ప్రతిపాదనలు సిద్దం చేసింది. వాటిని ప్రభుత్వానికి పంపి క్యాబినెట్ ఆమోదం తీసుకోవలసి ఉంటుంది. అనంతరం అసెంబ్లీలో తీర్మానం చేయాలి. ఆ తర్వాత ఆయా జిల్లా పరిషత్‌లకు సీఈవో, డిప్యూటీ సీఈవో పోస్టులతో పాటు అదనపు సిబ్బందినీ మంజూరు చేయాల్సి ఉంటుంది.
ఇదంతా ఎన్నికల్లోపే పూర్తి చేసేందుకు పంచాయతీరాజ్‌శాఖ చర్యలు చేపట్టింది. ఇంకోవైపు.. సెప్టెంబరు 24వ తేదీ లోపు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం లేనందున మండల పరిషత్ అధ్యక్షులు, జడ్పీ చైర్‌పర్సన్ల స్థానంలో ప్రత్యేకాధికారుల నియామకానికి పంచాయతీరాజ్‌శాఖ సిద్ధమవుతోంది. జడ్పీలకు కలెక్టర్లను, మండల పరిషత్‌లకు డివిజనల్ డెవలప్‌మెంట్ఆఫీసర్లను నియమించే అవకాశముంది.