సీఆర్డీఏ అథారిటీ 64వ సమావేశం.. కీలక నిర్ణయాలు వెల్లడించిన మంత్రి నారాయణ..
ABN , Publish Date - Aug 04 , 2026 | 09:39 PM
రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) అథారిటీ 64వ సమావేశం ఈరోజు (మంగళవారం) నిర్వహించినట్లు మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఈ సమావేశంలో రాజధాని ప్రాంత అభివృద్ధికి సంబంధించి సీఆర్డీఏ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
అమరావతి: రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) అథారిటీ 64వ సమావేశం ఈరోజు (మంగళవారం) జరిగినట్లు మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఈ సమావేశంలో రాజధాని ప్రాంత అభివృద్ధికి సంబంధించి సీఆర్డీఏ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే లైన్ నిర్మాణం కోసం మోతడక గ్రామంలో 2,340 ఎకరాల భూమిని కేటాయించేందుకు గతంలో తీర్మానం చేశామని, దానికి నేడు అథారిటీ ఆమోదం తెలిపిందన్నారు.
పల్నాడు జిల్లాలో దేవదాయశాఖకు చెందిన 244.39 ఎకరాల ఇనాం భూములను ల్యాండ్ పూలింగ్‌లో చేర్చేందుకు సీఆర్డీఏ పచ్చజెండా ఊపిందన్నారు మంత్రి. ఇందుకు రూ.122 కోట్లు చెల్లించేందుకు అంగీకారం తెలిపినట్లు చెప్పారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టును ప్రారంభించామని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని తిరిగి చేపట్టినట్లు నారాయణ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రేరాకు రెన్యూవల్ ఫీజును రద్దు చేసేందుకు కూడా సీఆర్డీఏ అంగీకారం తెలిపిందన్నారు. రైతులకు యాన్యుటీ కింద గత నెలలో రూ.300 కోట్లు చెల్లించామని మంత్రి తెలిపారు. ఇందుకోసం తీసుకున్న రుణానికి ర్యాటిఫికేషన్ ఇచ్చామని చెప్పారు. డేటా సెంటర్‌కు 9 గిగావాట్ల సామర్థ్యానికి టెండర్లు పిలిచేందుకు అనుమతి ఇచ్చినట్లు నారాయణ పేర్కొన్నారు.
అమరావతిలో నెట్‌వర్క్ విస్తరణ కోసం 20 ప్రాంతాల్లో 5జీ టవర్ల ఏర్పాటుకు టెండర్లు ఆహ్వానించినట్లు తెలిపారు. రోప్‌వే ప్రాజెక్టును పీపీపీ విధానంలో చేపట్టేందుకు రైల్వేస్టేషన్, బస్ స్టాండ్, దుర్గగుడి, పున్నమి ఘాట్, భవానీ ఐలాండ్ మీదుగా వేంకటేశ్వర స్వామి ఆలయం వరకు అనుసంధానించేలా అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. క్వాంటమ్ వ్యాలీలో 18 అంతస్తులతో రెండు టవర్ల నిర్మాణానికి రూ.1,205 కోట్లతో ఎల్ అండ్ టీకి ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. కృష్ణా నదిపై విజయవాడ-అమరావతి మధ్య భవిష్యత్తులో ఎన్ని వంతెనలు అవసరమవుతాయనే అంశంపై కన్సల్టెంట్‌తో అధ్యయనం చేయించాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వ భవనాల్లో మన సంస్కృతి ప్రతిబింబించేలా రూపకల్పన చేసేందుకు ఒక కమిటీ ఏర్పాటుకు కూడా అనుమతి ఇచ్చినట్లు చెప్పారు.
మరోవైపు, లండన్ ఐ ప్రాజెక్టుకు టెండర్లు పిలిచేందుకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపిందని ఆయన వెల్లడించారు. సీడ్ యాక్సిస్ రోడ్డు పనులు దాదాపు పూర్తయ్యాయని, వర్షాలు లేకపోతే ఈ నెల 13వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు వాటిని పరిశీలిస్తారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్లు సిద్ధమయ్యాయని, వాటిని అదే రోజు ముఖ్యమంత్రి జీఏడీకి అప్పగిస్తారని తెలిపారు. మొత్తం క్యాపిటల్ సిటీలో 217 కిలోమీటర్ల పరిధిలో నాలుగు ఎస్టీపీలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కోటి జనాభాను దృష్టిలో ఉంచుకుని గుంటూరు, విజయవాడను కలుపుతూ మెగా సిటీని అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. దీనికి అనుగుణంగా వంతెనల నిర్మాణంపై కన్సల్టెంట్ మూడు నెలల్లో నివేదిక సమర్పించనున్నట్లు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి
మండలి వెంకట కృష్ణారావు సిద్ధాంతాల ఆదర్శంగా పని చేద్దాం: వెంకయ్య నాయుడు
గుంటూరు సమీపంలో రూ.100 కోట్లతో కేంద్ర యోగా పరిశోధన సంస్థ