రాజధాని అమరావతిపై గొడ్డలి పార్టీ విష ప్రచారం చేస్తోంది: నక్కా ఆనంద బాబు..
ABN , Publish Date - Jul 12 , 2026 | 03:37 PM
రాజధాని అమరావతి అభివృద్ధిని అడ్డుకునేందుకు వైసీపీ (గొడ్డలి పార్టీ) ఇప్పటికీ కుట్రలు కొనసాగిస్తోందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు ఆరోపించారు. రాజధాని అభివృద్ధికి 99.5 శాతం మంది రైతులు భూములు స్వచ్ఛందంగా ఇచ్చారని, భూములు ఇవ్వని అరశాతం మంది రైతులను అడ్డం పెట్టుకుని అమరావతిపై విష ప్రచారం చేస్తోందని విమర్శించారు.
అమరావతి: రాజధాని అమరావతి అభివృద్ధిని అడ్డుకునేందుకు వైసీపీ (గొడ్డలి పార్టీ) ఇప్పటికీ కుట్రలు కొనసాగిస్తోందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు ఆరోపించారు. రాజధాని అభివృద్ధికి 99.5 శాతం మంది రైతులు భూములు స్వచ్ఛందంగా ఇచ్చారని, భూములు ఇవ్వని అరశాతం మంది రైతులను అడ్డం పెట్టుకుని అమరావతిపై విష ప్రచారం చేస్తోందని విమర్శించారు. ఈ సందర్భంగా సీఆర్డీఏ సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణం, భూసేకరణ వంటి అంశాలపై మీడియా సమావేశంలో నక్కా ఆనంద బాబు పలు వాస్తవాలను తెలియజేశారు.
ఈ సందర్భంగా నక్కా ఆనంద బాబు మాట్లాడుతూ.. సీఆర్డీఏ చేపట్టిన ఈ-3 సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియ పూర్తిగా నిబంధనల ప్రకారమే జరిగిందని స్పష్టం చేశారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే వైసీపీ వ్యవహరిస్తోందని ఆనంద బాబు పేర్కొన్నారు. 2014 నుంచి 2019 వరకు అమరావతి అభివృద్ధిని అడ్డుకునేందుకు తప్పుడు ఆరోపణలు, ఫిర్యాదులు చేసిన గొడ్డలి పార్టీ.. 2019 నుంచి 2024 వరకు మూడు రాజధానుల పేరుతో రాజధానిని పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆగ్రహించారు. రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెప్పడంతో ఆ పార్టీ 11 అసెంబ్లీ స్థానాలకు పరిమితమైందని, కూటమి ప్రభుత్వం అమరావతే రాష్ట్ర రాజధాని అని పార్లమెంటులో స్పష్టం చేసినా వైసీపీ వైఖరిలో మార్పు రాలేదని అన్నారు.
రాజధాని అమరావతికి కనెక్టివిటీ కోసం నిర్మిస్తున్న ఈ-3 సీడ్ యాక్సెస్ రోడ్ కోసం చేపట్టిన 2.725 ఎకరాల భూసేకరణ అంశాన్ని బూచిగా చూపే ప్రయత్నం ఆ పార్టీ చేస్తోందన్నారు. భూసేకరణకు ముందు అధికారులు పలుమార్లు రైతులతో సమావేశాలు నిర్వహించి, ల్యాండ్ పూలింగ్‌లో చేరితే కలిగే ప్రయోజనాలను వివరించారని ఆనంద బాబు చెప్పారు. నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత కూడా ల్యాండ్ పూలింగ్‌కు అవకాశం కల్పిస్తూ రైతులను ఒప్పించే ప్రయత్నాలు కొనసాగించారని పేర్కొన్నారు. ఉండవల్లి గ్రామంలో తొలుత 20.323 ఎకరాల భూమి అవసరమని సీఆర్డీఏ ప్రతిపాదించగా, అధికారుల చర్చలతో సుమారు 10 ఎకరాల భూమి యజమానులు స్వచ్ఛందంగా సమీకరణకు ముందుకు వచ్చారని ఆయన తెలిపారు. అందులో కొందరు ఇప్పటికే భూములు అప్పగించగా, మరో 5.28 ఎకరాలకు సంబంధించిన సంప్రదింపులు కొనసాగాయని చెప్పారు.
మిగిలిన భూముల విషయంలో రైతులు అంగీకరించకపోవడంతో 10.5 ఎకరాలకు భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేయాల్సి వచ్చిందన్నారు ఆనంద బాబు. భూసేకరణ నోటిఫికేషన్ తర్వాత కూడా రైతులతో అధికారులు చర్చలు కొనసాగించడంతో, మరికొందరు ల్యాండ్ పూలింగ్‌కు అంగీకరించారని తెలిపారు. వైసీపీ అధినేతను కలిసిన అనంతరం ఆయన రాజకీయ ఉద్దేశాలను గ్రహించిన ఓ రైతు 1.12 ఎకరాల భూమిని స్వచ్ఛందంగా సమీకరణకు ఇచ్చేందుకు ముందుకు వచ్చారని చెప్పారు. దీంతో నోటిఫికేషన్ పరిధిలోని సుమారు 10 ఎకరాల్లో 7 ఎకరాలకు పైగా భూమి యజమానులు ల్యాండ్ పూలింగ్‌కు అంగీకరించినట్లు వివరించారు.
చివరకు మిగిలిన 2.725 ఎకరాల విషయంలో మాత్రమే తప్పనిసరి పరిస్థితుల్లో భూసేకరణ ప్రక్రియను కొనసాగించాల్సి వచ్చిందని ఆనందబాబు తెలిపారు. ఈ భూములకు సంబంధించిన అవార్డు ఇప్పటికే పాస్ అయిందని, ప్రస్తుతం చట్టపరమైన నిబంధనల ప్రకారం భూసేకరణ ప్రక్రియను అధికారులు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. రైతులను ఒప్పించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నించినప్పటికీ, కొద్ది మంది రైతులను అడ్డం పెట్టుకుని వైసీపీ రాజధాని అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోందని, మెజారిటీ రైతుల అభిప్రాయాలను గౌరవించడం లేదని నక్కా ఆనందబాబు ఆరోపించారు.
ఈ వార్తలు కూడా చదవండి
జనాభా నియంత్రణ కాదు.. జనాభా సంరక్షణే లక్ష్యం: సీఎం చంద్రబాబు
యువత పరిశోధనలు, ఆవిష్కరణలు స్టార్టప్‌ల వైపు అడుగులు వేయాలి: గవర్నర్