Share News

అమరావతిపై జగన్ వ్యాఖ్యలు పూర్తిగా బాధ్యతారాహిత్యమైనవి: మంత్రి మండిపల్లి

ABN , Publish Date - Jun 02 , 2026 | 04:29 PM

రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అనుసరిస్తున్న వైఖరిపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమరావతిపై జగన్ వ్యాఖ్యలు పూర్తిగా బాధ్యతారాహిత్యమైనవి: మంత్రి మండిపల్లి
AP Minister Mandipalli Ramprasad Reddy

అమరావతి, జూన్ 02: రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అనుసరిస్తున్న వైఖరిపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం రాజధాని అమరావతిలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. అమరావతి గురించి వైఎస్ జగన్ చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా బాధ్యతారాహిత్యమైనవన్నారు. ప్రపంచ స్థాయి రాజధానిని ఐదేళ్ల పాలనలో అల్లకల్లోలం చేసింది గత వైసీపీ ప్రభుత్వమేనని ఆయన గుర్తు చేశారు. రాజధాని నిర్మాణాన్ని అర్ధంతరంగా నిలిపివేసి ఇప్పుడు అభివృద్ధిపై నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందంటూ జగన్ తీరును ఈ సందర్భంగా ఆయన ఎండగట్టారు.


మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని అయోమయంలోకి నెట్టి.. ఇప్పుడు మావిగన్ అంటూ మాయ మాటలు చెప్తున్నారంటూ జగన్‌పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి నిప్పులు చెరిగారు. అమరావతి రైతులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కింది గత వైసీపీ పాలనలోనే అని విమర్శించారు. రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులు నిలిపి వేసి.. తద్వారా వేలాది కుటుంబాలను ఇబ్బందులకు గురి చేశారంటూ జగన్ తీరును మంత్రి మండిపల్లి తుర్పారబట్టారు.


అమరావతికి భూములు ఇచ్చిన రైతుల విశ్వాసాన్ని దెబ్బతీశారంటూ ఆ పార్టీ అగ్రనేతలపై మంత్రి నిప్పులు చెరిగారు. ఐదేళ్లు అధికారంలో ఉండి రాజధాని అభివృద్ధికి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదన్నారు. ఇప్పుడు అమరావతిపై అసత్యాలు ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ జగన్ వైఖరిని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వివరించారు. అమరావతి నిర్మాణానికి కేంద్రం, రాష్ట్రం కలిసి వేగంగా చర్యలు చేపడుతున్నాయని పేర్కొన్నారు.


రాజధాని అభివృద్ధిని అడ్డుకున్న వారే అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి వ్యంగ్యంగా అన్నారు. వైసీపీ హయాంలో నిలిచిపోయిన పనులను కూటమి ప్రభుత్వం తిరిగి ప్రారంభించిందన్నారు. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి మండిపల్లి స్పష్టం చేశారు. రైతుల ఆకాంక్షలు, రాష్ట్ర ప్రజల ఆశయాలకు అనుగుణంగా రాజధాని నిర్మాణం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అమరావతి అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని.. ఇది రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన అంశమన్నారు.


జగన్ చేసిన విధ్వంసాన్ని సరిదిద్దుతూ అమరావతిని తిరిగి గాడిలో పెడుతున్నామని ఆయన వివరించారు. రాజధానిపై రాజకీయాలు కాకుండా రాష్ట్రాభివృద్ధిపై దృష్టి పెట్టాలని వైఎస్ జగన్‌కు ఆయన సూచించారు. అమరావతి రాష్ట్ర గౌరవానికి ప్రతీక, దాని నిర్మాణాన్ని పూర్తి చేయడం ప్రభుత్వ బాధ్యత అని వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆ జిల్లాల్లో పిడుగులతోపాటు వర్షాలు..

యూఎస్‌లో 30 మంది భారతీయుల అరెస్ట్

Updated Date - Jun 02 , 2026 | 04:39 PM