ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం
ABN , Publish Date - Jun 02 , 2026 | 03:59 PM
వేసవి కాలం.. అందునా రోహిణి కార్తె కావడంతో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రంలో రుతుపవనాల ప్రవేశానికి ఇంకా సమయం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది.
విశాఖపట్నం, జూన్ 02: వేసవి కాలం.. అందునా రోహిణి కార్తె కావడంతో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రంలో రుతుపవనాల ప్రవేశానికి ఇంకా సమయం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో తీవ్రమైన ఎండలు, గాలిలో తేమ లేకపోవడంతోపాటు ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అలాంటి వేళ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం ఉరుములు మెరుపులతోపాటు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
విశాఖపట్నం, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, పార్వతీపురం మన్యం, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు విజయనగరం, విశాఖపట్నం, మన్యం అల్లూరి, అనకాపల్లి, ఏలూరు, ఎన్టీఆర్, అనకాపల్లితోపాటు ఉభయ గోదావరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. దీంతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు స్పష్టం చేసింది.