DSC నిర్వహణపై ఆరోపణలు అవాస్తవం: కోన శశిధర్
ABN , Publish Date - May 30 , 2026 | 05:45 PM
డీఎస్సీ నిర్వహణపై వస్తున్న ఆరోపణలు నిరాధారమని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ స్పష్టం చేశారు. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన డీఎస్సీ ప్రక్రియను పూర్తిస్థాయి పారదర్శకతతో చేపట్టామని తెలిపారు.
అమరావతి: డీఎస్సీ (DSC) నిర్వహణపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ స్పష్టం చేశారు. డీఎస్సీ నియామక ప్రక్రియను పూర్తిస్థాయి పారదర్శకతతో నిర్వహించినట్లు తెలిపారు. డీఎస్సీలో మెరిట్ ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేశామని ఆయన పేర్కొన్నారు. మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసినట్లు వెల్లడించారు.
ఈ నియామక ప్రక్రియకు రాష్ట్రవ్యాప్తంగా 3.36 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని శశిధర్ తెలిపారు. డీఎస్సీ నియామక ప్రక్రియపై 226 కేసులు దాఖలైనప్పటికీ, కేవలం 148 రోజుల్లోనే నియామకాలను పూర్తి చేసి ప్రభుత్వం రికార్డు సృష్టించిందని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. 154 టీసీఎస్ అయాన్ (TCS iON) కేంద్రాల్లో విజయవంతంగా పరీక్షలను నిర్వహించినట్లు కోన శశిధర్ తెలిపారు.
డీఎస్సీ ప్రశ్నాపత్రాన్ని ఎవరూ మానిప్యులేట్ చేయలేరని స్పష్టం చేశారు. ప్రశ్నాపత్రం తయారీ నుంచి పరీక్ష నిర్వహణ వరకు పూర్తి స్థాయిలో భద్రతా ప్రమాణాలను పాటించినట్లు వివరించారు. ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలను యాక్సెస్ చేసే అవకాశం కేవలం ఇద్దరు సీనియర్ అధికారులకు మాత్రమే ఉంటుందని తెలిపారు. క్వశ్చన్ బ్యాంక్ పాస్‌వర్డ్‌లు ప్రతిరోజూ మారుతూ ఉండటంతో భద్రత మరింత కఠినంగా ఉంటుందని చెప్పారు. ఆ ఇద్దరు అధికారులు మాత్రమే టీసీఎస్ (TCS) సిస్టంలో ప్రశ్నలను అప్‌లోడ్ చేస్తారని, పరీక్ష రోజు ప్రశ్నాపత్రం జంబుల్డ్ రూపంలో అభ్యర్థులకు అందుతుందని పేర్కొన్నారు. ప్రశ్నలు ఎన్‌క్రిప్ట్ చేయబడిన విధంగా ఉంటాయని, వాటిని డీకోడ్ చేయడం అసాధ్యమని స్పష్టం చేశారు.
దేశవ్యాప్తంగా అనేక ప్రతిష్టాత్మక పరీక్షలు ఇదే విధానంలో నిర్వహిస్తున్నట్లు కోన శశిధర్ తెలిపారు. కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానంలో మాన్యువల్ జోక్యం చాలా తక్కువగా ఉంటుందని చెప్పారు. ఏపీ హైకోర్టు సహా అనేక సంస్థల పరీక్షలు కూడా ఇదే విధానంలో నిర్వహిస్తారని వివరించారు. TCS కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలు, కఠినమైన భద్రతా ప్రోటోకాల్ అమల్లో ఉన్నాయని, ఎక్కడా విధాన ఉల్లంఘనలకు అవకాశం లేదని స్పష్టం చేశారు. ఫలితాల ప్రకటన ప్రక్రియలోనూ పారదర్శకత పాటించినట్లు తెలిపారు. డ్రాఫ్ట్ కీ విడుదల చేసిన తర్వాత అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించి, ఫైనల్ కీని విడుదల చేసినట్లు పేర్కొన్నారు. అన్ని జిల్లాల స్కోర్లను 11వ తేదీన అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు ఊరట.. స్వదేశానికి వెళ్లాల్సిందేననే నిబంధనపై అమెరికా యూటర్న్..
వైభవ్ శరీరమే లక్ష్యంగా బౌలింగ్.. గుజరాత్ బౌలర్లపై ఇర్ఫాన్ పఠాన్ ఆగ్రహం..