Share News

మనవడి కోసం.. 70 ఏళ్ల అమ్మమ్మ నడక

ABN , Publish Date - Aug 12 , 2026 | 07:05 AM

మనవడి ఆరోగ్యం బాగుపడాలన్న ఆకాంక్షతో కలియుగ దైవాన్ని ప్రార్థిస్తూ గుంటూరు నుంచి ఓ అమ్మమ్మ కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. 70 ఏళ్ల వయస్సు... మోకాళ్ల నొప్పులు... భారీ కాయం... ఇతర అనారోగ్య సమస్యలు సరేసరి. ఇవేవీ మనవడిపై ఆమె ప్రేమకు అడ్డం కాలేదు.

మనవడి కోసం.. 70 ఏళ్ల అమ్మమ్మ నడక
Kameswari

  • గుంటూరు నుంచి తిరుమలకు పాదయాత్ర

  • గోవింద నామస్మరణతో 57 రోజుల ప్రయాణం

గుంటూరు: మనవడి ఆరోగ్యం బాగుపడాలన్న ఆకాంక్షతో కలియుగ దైవాన్ని ప్రార్థిస్తూ గుంటూరు నుంచి ఓ అమ్మమ్మ కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. 70 ఏళ్ల వయస్సు... మోకాళ్ల నొప్పులు... భారీ కాయం... ఇతర అనారోగ్య సమస్యలు సరేసరి. ఇవేవీ మనవడిపై ఆమె ప్రేమకు అడ్డం కాలేదు. వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి వెంకన్నను దర్శించుకున్నారు. ‘స్వామీ... నా మనవడు, కాళ్లు చేతులు చచ్చుపడి కదల్లేని స్థితిలో ఉన్నాడు. ఆ బిడ్డకు మంచి ఆరోగ్యం ప్రసాదించు’ అని వేడుకున్నారు.


గుంటూరు కృష్ణనగర్‌లో ఉంటున్న ఆకుల కామేశ్వరి కుమార్తె కొడుకు ధనుష్‌(20) రెండేళ్ల క్రితం ఆనారోగ్యం పాలయ్యాడు. కాళ్ల చేతులు చచ్చుబడ్డాయి. అన్ని పరీక్షలు చేసిన వైద్యులు సాధారణస్థితికి రావడం కష్టమని తేల్చి చెప్పారు. వైద్యుల మాటలతో ఖిన్నురాలైన కామేశ్వరి... తిరుపతి వెంకన్నపై భారం వేశారు. మనవడి కాళ్లు, చేతులు పనిచేస్తే గుంటూరు నుంచి తిరుపతికి నడుచుకుంటూ వస్తానని మొక్కుకున్నారు. ఆ తరువాత కొద్ది రోజులకు ధనుష్‌ ఆరోగ్యంలో మార్పు కనిపించింది.


చచ్చుబడిన అవయవాలకు కొంతమేర స్పర్శ వచ్చింది. ఇది స్వామి దయేనని నమ్మిన కామేశ్వరి మనవడికి సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని కోరుతూ జూన్‌ 11న తిరుమల పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. 57 రోజులు... 400 కి.మీ... దారిపొడవునా గోవింద నామస్మరణ... ఎట్టకేలకు ఆగస్టు 1 మెట్ల మార్గంలో తిరుమల చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు.


మొక్కు తీర్చలేనేమోనని కంగారుపడ్డా

మనుమడిని ఆ పరిస్థితిలో చూసిన తర్వాత ఏడుకొండలు వాడే బాగు చేయాలని మొక్కుకున్నా. ఆరోగ్యం పూర్తిగా మెరుగు పడకపోయినా యాత్ర చేయాలని నిర్ణయించుకున్నా. ఇంకా ఆగితే వయసు మీద పడి స్వామికి ఇచ్చిన మాట నెరవేరుస్తానో లేదో అనిపించింది. దారి మధ్యలో చాలా మంది ఆశ్రయం ఇచ్చారు. నా మనవడి మీద ఉన్న ప్రేమ, మమకారం ఈ వయసులో ఈ యాత్రకు పురిగొల్పాయి.

- కామేశ్వరి, గుంటూరు

Updated Date - Aug 12 , 2026 | 07:10 AM