Share News

వార్డుల పునర్విభజనకు పచ్చజెండా

ABN , Publish Date - Sep 04 , 2026 | 04:40 AM

రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయితీల్లో వార్డుల పునర్విభజన ప్రక్రియను సవాల్‌ చేస్తూ దాఖలైన 50 పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ‘అడ్మినిస్ట్రేటివ్‌ యూనిట్‌ సరిహద్దులను ఫ్రీజ్‌ చేస్తూ కేంద్రం ఇచ్చిన సర్క్యులర్‌ జనాభా లెక్కల సేకరణ కోసమే పరిమితమని స్పష్టం చేసింది.

వార్డుల పునర్విభజనకు పచ్చజెండా

  • వార్డుల పునర్విభజనకు పచ్చజెండా

  • మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల భౌగోళిక హద్దులు మారవు: హైకోర్టు

  • కేంద్రం ఇచ్చిన సర్క్యులర్‌ జనాభా లెక్కల సేకరణకే పరిమితం

  • వార్డుల విభజనకు దానిని అన్వయించలేం: న్యాయమూర్తి

  • ఈ అంశంపై దాఖలైన 50 వ్యాజ్యాలూ కొట్టివేత

అమరావతి, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయితీల్లో వార్డుల పునర్విభజన ప్రక్రియను సవాల్‌ చేస్తూ దాఖలైన 50 పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ‘అడ్మినిస్ట్రేటివ్‌ యూనిట్‌ సరిహద్దులను ఫ్రీజ్‌ చేస్తూ కేంద్రం ఇచ్చిన సర్క్యులర్‌ జనాభా లెక్కల సేకరణ కోసమే పరిమితమని స్పష్టం చేసింది. దానిని వార్డుల పునర్విభజనకు అన్వయించలేమని తెలిపింది. ‘వార్డుల పునర్విభజన వల్ల స్థానిక సంస్థల ఎన్నికల పిటిషనర్ల ఓటుహక్కుకు ఎలాంటి భంగం కలుగదు. జనాభా లెక్కల సేకరణ ప్రక్రియతో వార్డుల పునర్విభజన ప్రక్రియ, స్థానిక ఎన్నికల ఓటింగ్‌కు ఎలాంటి సంబంధం లేదు’ అని పేర్కొంది. వార్డుల పునర్విభజన వల్ల మున్సిపాలిటీ, కార్పొరేషన్‌ భౌగోళిక సరిహద్దులు మారవని స్పష్టం చేసింది. పునర్విభజన విషయంలో అభ్యంతరాలు సమర్పించేందుకు వెసులుబాటు ఉంటుందని అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ) చెబుతున్నందున వ్యాజ్యాలను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.హరినాథ్‌ గురువారం తీర్పు ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల పరిధిలోని మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వార్డుల పునర్విభజన ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవోలు, ప్రాథమిక నోటిఫికేషన్లను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి.


పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది కేఎస్‌ మూర్తి తదితరులు వాదనలు వినిపించారు. వార్డుల పునర్విభజన ప్రక్రియను నిలిపివేయాలని కోరారు. అయితే వార్డుల పునర్విభజన ప్రక్రియ కారణంగా భౌగోళిక సరిహద్దులు మారడం లేదని.. కొత్తగా ఏ గ్రామ పంచాయతీను, మున్సిపాలిటీని చేర్చడంగానీ, తొలగించడం గానీ చేయడం లేదని రాష్ట్రప్రభుత్వం తరఫున ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్‌ తెలిపారు. వార్డుల పునర్విభజనను అడ్డుకుంటే మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియ మరింత ఆలస్యమవుతుందని, దీనివల్ల పిటిషనర్ల హక్కులకు ఎలాంటి భంగం కలుగదని ఏజీ స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

రోహిత్‌ శర్మ రిటైర్‌మెంట్‌పై క్లారిటీ

పదవి ఉన్నా.. లేకున్నా ప్రజలతోనే: మాజీ మంత్రి చిన్నారెడ్డి

Updated Date - Sep 04 , 2026 | 04:40 AM