Share News

మరో మూడు డీఎస్సీలు

ABN , Publish Date - Sep 06 , 2026 | 05:59 AM

2029 లోగా మరో 3 డీఎస్సీలను నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ చెప్పారు. గతేడాది మెగా డీఎస్సీ ద్వారా 16 వేల టీచర్‌ పోస్టుల భర్తీని ఎంత పారదర్శకంగా నిర్వహించామో.. అదేవిధంగా భవిష్యత్తులోనూ ఉపాధ్యాయ నియామకాలు చేపడుతామని స్పష్టం చేశారు.

మరో మూడు డీఎస్సీలు

  • 2029లోగా వాటిని పూర్తిచేస్తాం: లోకేశ్‌

  • ఏపీపీఎస్సీకి, డీఎస్సీకి తేడా తెలియని వారు నాపై ఆరోపణలు చేస్తున్నారు

అమరావతి, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): 2029 లోగా మరో 3 డీఎస్సీలను నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ చెప్పారు. గతేడాది మెగా డీఎస్సీ ద్వారా 16 వేల టీచర్‌ పోస్టుల భర్తీని ఎంత పారదర్శకంగా నిర్వహించామో.. అదేవిధంగా భవిష్యత్తులోనూ ఉపాధ్యాయ నియామకాలు చేపడుతామని స్పష్టం చేశారు. ఏపీపీఎస్సీకి, డీఎస్సీకి తేడా తెలియనివారు తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా ఏం ఫర్వాలేదు, భయపడేది లేదని స్పష్టం చేశారు. శనివారం విజయవాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి గురుపూజోత్సవంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో సంస్కరణలపై దృష్టి సారించామని తెలిపారు. కొన్ని దశాబ్దాలుగా జరగని యూనివర్సిటీ ఫ్యాకల్టీ రిక్రూట్‌మెంట్‌ను కూడా పారదర్శకంగా నిర్వహించి... వచ్చే ఏడాది ఏప్రిల్‌ కల్లా ప్రొఫెసర్లు, అసిసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకాలను పూర్తి చేస్తామని చెప్పారు. లోకేశ్‌ ఇంకా ఏమన్నారంటే..

పని చేసేవాళ్లకే రాళ్ల దెబ్బలు!

‘’సీఎం చంద్రబాబు తన పాలనలో 14 సార్లు డీఎస్సీలు నిర్వహించి, 2 లక్షల మంది ఉపాధ్యాయులను నియమించారు. ఇప్పుడు తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైల్‌పైనే చేశారు. ఈ మెగా డీఎస్సీని పారదర్శకంగా నిర్వహిస్తానని హామీ ఇచ్చి, 16 వేల టీచర్‌ పోస్టులను భర్తీ చేసే బాధ్యత తీసుకున్నాను. పని చేసేవాళ్లకే రాళ్ల దెబ్బలు ఉంటాయి. ఆరోపణలకు నేను భయపడను. నాకు క్రమశిక్షణ నేర్పిన తొలి గురువు మా అమ్మ. సమాజంలో గౌరవంగా, నిజాయితీగా ఎలా బతకాలో నేర్పించింది నా తండ్రి చంద్రబాబు. నేను ఈ స్థాయికి రావడానికి నా తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులే ప్రధాన కారణం. అన్న ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి అయిన నెల రోజులకు నేను పుట్టాను. సీఎం మనవడు అయినంత మాత్రాన స్కూలులో క్రమశిక్షణ తప్పితే టీచర్లు ఒప్పుకునేవారు కాదు. ఆ క్రమశిక్షణే ఈ రోజు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది’’ అని పేర్కొన్నారు.


10 వేల బడుల్లో ‘వన్‌ క్లాస్‌-వన్‌ టీచర్‌’

‘‘రాష్ట్రంలోని అంగన్‌వాడీ సెంటర్ల దగ్గర నుంచి ఉన్నత విద్య (పీజీ) వరకు ఏపీ విద్యా విధానాన్ని దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే నెంబర్‌ వన్‌గా చేయడమే లక్ష్యంగా కష్టపడి పనిచేస్తున్నాం. విద్యావ్యవస్థలో సంస్కరణలు తీసుకువస్తున్నాం. గత ప్రభుత్వ 117 జీవో వల్ల సుమారు 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల నుంచి ప్రైవేట్‌ పాఠశాలలకు వెళ్లిపోయారు. మా ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదట ఆ జీవోను రద్దు చేశాం. అందరితో చర్చించి మోడల్‌ ప్రైమరీ స్కూల్‌ వ్యవస్థను తీసుకొచ్చాం. మేం అధికారంలోకి వచ్చినప్పుడు 3 శాతం పాఠశాలల్లోనే ‘వన్‌ క్లాస్‌-వన్‌ టీచర్‌’ ఉండేవారు. ఇప్పుడు 33 శాతం పాఠశాలలకు పెంచి, 10 వేల పాఠశాలల్లో ఈ విధానాన్ని తీసుకువచ్చాం. టీచర్ల బదిలీల చట్టం తీసుకొచ్చాం. సీనియారిటీ లిస్టు ఫిక్స్‌ చేశాం. నేటి కాలానికి అనుగుణంగా సిలబ్‌సలో అనేక మార్పులు తీసుకొచ్చాం. సర్వీస్‌ సేవల కోసం అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ‘లీప్‌’ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చాం’’ అని లోకేశ్‌ వివరించారు.

నియోజకవర్గానికో ‘లీప్‌’ మోడల్‌ స్కూలు

‘‘మంగళగిరి నియోజకవర్గం నిడమర్రులో ఒక లీప్‌ మోడల్‌ స్కూల్‌ను అభివృద్ధి చేశాం. ఆ మోడల్‌ను రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో అమలు చేసి, మోడల్‌ ప్రైమరీ స్కూల్‌ వరకు తీసుకురావాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ’’ అని మంత్రి లోకేశ్‌ పేర్కొన్నారు. విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శ్యామలరావు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చిన్నారుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.


16 ఏళ్ల పాలనలో 14 డీఎస్సీలు ఇచ్చాం

‘‘గత ప్రభుత్వం ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేదు. ఉద్యోగులకు ప్రతినెల 1న జీతాలు వచ్చేవి కాదు. టీచర్లను మద్యం దుకాణాల దగ్గర క్యూలైన్ల నిర్వహణకు ఉపయోగించారు. కూటమి రాగానే మెగా డీఎస్సీ ఇచ్చాం. దానిని అడ్డుకోవడానికి వైసీపీ నేతలు కోర్టులో 350కి పైగా పిటిషన్లు వేశారు. వాటని అధిగమించి సుమారు 16 వేల మంది టీచర్ల నియామకాలు పూర్తిచేశాం. దేశ భవిత అయిన విద్యార్థులను తీర్చిదిద్దుతున్న పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉండకూడదన్న ఉద్దేశంతో నేను సీఎంగా పనిచేసిన 16 ఏళ్లలో 14 డీఎస్సీలు నిర్వహించాం. గురుపూజోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగ సంఘాలతో జరిపిన సమావేశంలో పలు వరాలు ప్రకటించాం’’ అని సీఎం వివరించారు.

ఈ వార్తలను కూడా చదవండి

విద్యార్థులను తీర్చిదిద్దేది గురువులే

పరిషత్‌.. పరేషాన్‌

Updated Date - Sep 06 , 2026 | 05:59 AM