Share News

Kumaram Bheem Asifabad: పరిషత్‌.. పరేషాన్‌

ABN , Publish Date - Sep 06 , 2026 | 12:04 AM

బెజ్జూరు, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలు జరగక పోవడంతో పరిషత్‌లు ప్రత్యేకాధికారుల పాలనలోనే కొనసాగుతున్నాయి.

Kumaram Bheem Asifabad:   పరిషత్‌.. పరేషాన్‌

- స్థానిక సంస్థలకు ప్రత్యేకాధికారుల గండం

- నిధుల కొరతతో కుంటుపడుతున్న అభివృద్ధి

- పాలకవర్గాలు లేక నిలిచిన నిధులు

- ప్రత్యేక అధికారుల చేతిలో అధికారాలు

- ప్రశ్నించే ప్రతినిధులు కరువు

- ఆశావహుల్లో ఉత్కంఠ

బెజ్జూరు, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలు జరగక పోవడంతో పరిషత్‌లు ప్రత్యేకాధికారుల పాలనలోనే కొనసాగుతున్నాయి. దీంతో ప్రజల అవసరాలు, గ్రామీణ ప్రాంతాల సమస్యలను స్థానిక స్థాయిలో ప్రస్తావించి పరిష్కరించాల్సిన ప్రజాప్రతినిధులు లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తమవుతోంది. గతంలో ఎన్నికైన పాలకవర్గాల పదవీకాలం ముగిసి చాలాకాలం గడిచినా, కొత్తపాలకవర్గాల ఏర్పాటుకు ఎన్నికలు జరగకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. చివరగా 2018లో జడ్పీటీసీ, ఎంపీటీసీలకు ఎన్నికలు జరిగాయి. పాలకవర్గాల పదవీకాలం ముగిసిన తర్వాత వివిధ కారణాలతో ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయడంలో ఆలస్యం చేసింది. దీంతో అభివృద్ధి కార్యక్రమాలపై కూడా ప్రభావం చూపుతోంది.

విడుదల కాని ఆర్థిక సంఘం నిధులు..

నిబంధనల ప్రకారం స్థానిక సంస్థలకు ఎన్నికైన పాలకవర్గాలు లేకపోతే కేంద్రం ఆర్థిక సంఘం నిధులు పూర్తిగా కేటాయించదు. గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగడంతో నేరుగా అందుతు న్నాయి. కానీ జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌లకు పాలకవర్గాలు లేకపోవడంతో ఆర్థిక సంఘం నిధులు రావడం లేదు. ఇలా జిల్లాకు రావాల్సిన కోట్ల రూపాయల ఆర్థికసంఘం నిధులకు బ్రేక్‌ పడింది.

సమస్యలపై పట్టింపు కరువు..

జడ్పీ, మండల పరిషత్‌ల పరిధిలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులు, స్థానిక సమస్యల పరిష్కారం, మౌళిక వసతుల కల్పన వంటి అంశాల్లో ప్రజాప్రతినిధుల చొరవ కీలకం. ఎన్నికలు లేకపోవడంతో ప్రజల తరపున నిలదీసే వ్యవస్థ బలహీనపడుతోంది. దీర్ఘకాలం ప్రత్యేకాధికారుల పాలన కొనసాగడం, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్దమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

తప్పని ఎదురుచూపులు..

జిల్లాలో 15మండలాలు ఉన్నాయి. జిల్లాలో 15జడ్పీటీసీ, 15ఎంపీపీ, 127ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. పరిషత్‌ ఎన్నికలపై గతంలో పలుమార్లు ఊరిస్తూ రాగా ప్రస్తుతం ఎన్నికల నిర్వహణపై ఎలాంటి ప్రకటన విడుదల చేయకపోవడంతో ఆశావహుల్లో ఆందోళన నెలకొంది. గత సర్పంచ్‌ ఎన్నికల్లో ఆశపడ్డ వారికి రిజర్వేషన్లు అనుకూలించక కొంతమంది ఎన్నికలకు దూరం కాగా ఆ భర్తీని పరిషత్‌ రూపంలో నెరవేర్చుకుందామని అనుకుంటున్నారు. కానీ ఎన్నికల ఏర్పాట్లపై ప్రభుత్వం ముందుకు రాకపోవడం వారి ఆశలపై నీళ్లు చల్లేలా ఉన్నాయంటూ పలువురు ఆవేదన చెందుతున్నారు. గతంలో ఎన్నికల నిర్వహణకు హడావుడి చేసినా ఆ తర్వాత వెనక్కితగ్గింది. ఒకసారి రైతుభరోసా, మరోసారి రుణమాఫీ పథకాలు పూర్తయ్యాక ఎన్నికలకు వెళ్దామని భావించినా ప్రభుత్వం పూర్తిస్థాయిలో కసరత్తు మాత్రం పెట్టడం లేదు. రాష్ట్రంలో మూడంచెల విధానాన్ని కూడా తీసుకురావాలని ప్రభుత్వం బలంగా ఉన్నట్లు అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఎన్నికల నిర్వహణపై ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.

Updated Date - Sep 06 , 2026 | 12:04 AM