Share News

కూటమి వెంటే ఉద్యోగులు

ABN , Publish Date - Nov 08 , 2026 | 03:19 AM

టీడీపీ ప్రభుత్వం పట్ల ప్రభుత్వ ఉద్యోగుల్లో అంత సానుకూలత ఉండదనే ప్రచారం వాస్తవం కాదని మరోసారి రుజువైంది.

కూటమి వెంటే ఉద్యోగులు

  • స్థానిక ఎన్నికల్లో పెరిగిన ఆదరణ

  • వైసీపీ ప్రాబల్య ప్రాంతాల్లోనూ అండ

  • వెల్లువెత్తిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు

  • పురపోరులో మొత్తం 69 శాతం మద్దతు

  • వైసీపీకి 18 శాతం ఓట్లు మాత్రమే

  • కడపలో టీడీపీకి 232, వైసీపీకి 102

  • పరిషత్‌ ఎన్నికల్లో కూటమికి ఏకంగా 74 శాతం

  • వైసీపీకి దక్కినవి కేవలం 15 శాతమే

(అమరావతి-ఆంధ్రజ్యోతి): టీడీపీ ప్రభుత్వం పట్ల ప్రభుత్వ ఉద్యోగుల్లో అంత సానుకూలత ఉండదనే ప్రచారం వాస్తవం కాదని మరోసారి రుజువైంది. ఉద్యోగుల్లో అత్యధిక శాతం కూటమి వెంటే ఉన్నారని తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. కూటమి సర్కారు పనితీరుపై ఉద్యోగుల ఆశలు, నమ్మకాలు ఏమాత్రం సన్నగిల్లలేదని తేల్చాయి. అంతేగాక ప్రభుత్వం పట్ల వారి ఆదరణ మరింత పెరిగిందని రుజువు చేశాయి.

2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో కూటమి వైపు మొగ్గు చూపారు. రెండేళ్ల పాలన తర్వాత ఇప్పుడు మున్సిపల్‌ ఎన్నికలు, ఇటు పరిషత్‌ ఎన్నిక ల్లోనూ అండగా నిలిచారు. ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను పరిశీలిస్తే వైసీపీకి కంటే కూటమికి భారీగా పడ్డాయి. మున్సిపల్‌ ఎన్నికల్లో కంటే పరిషత్‌ ఎన్నికల్లో కూటమికి మరిన్ని ఎక్కువ ఓట్లు పడ్డాయి.


మున్సిపల్‌ ఎన్నికల్లో మొత్తం పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో 69 శాతానికి పైగా కూటమి ఖాతాలో చేరాయి. వైసీపీకి కేవలం 18 శాతం వచ్చాయి. స్వతంత్రులకు 10 శాతం, మిగిలినవి నోటాకు వెళ్లాయి. ఇక పరిషత్‌ ఎన్నికల్లో కూటమికి ఏకంగా 74 శాతం మేర ఉద్యోగులు జైకొట్టారు. వైసీపీకి దక్కిన ఓట్లు కేవలం 15 శాతమే. స్వతంత్రులకు 8 శాతం, నోటాకు 2 శాతం ఓట్లు వెళ్లాయి. కొన్ని ప్రాంతాల్లో టీడీపీకి ఉద్యోగుల ఓట్లు గంపగుత్తగా వచ్చాయి. వైసీపీ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లోనూ కూటమి పార్టీలకు మద్దతు పలికారు.

పురపోరులో..

మున్సిపల్‌ పోరులో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు కూటమి వెంట నిలిచారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. జగన్‌ సొంత జిల్లా కడపలో టీడీపీ జోరుసాగింది. కడప కార్పొరేషన్‌లో 232 మంది ఉద్యోగులు టీడీపీకి ఓటేయగా, వైసీపీకి 102 మంది మాత్రమే వేశారు. క ర్నూలు కార్పొరేషన్‌లో టీడీపీకి 1102 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు రాగా, వైసీపీకి కేవలం 298 దక్కాయి. అనంతపురం మేయర్‌ పీఠాన్ని వైసీపీ గెలుచుకున్నప్పటికీ, పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు టీడీపీకే ఎక్కువ వచ్చాయి. అక్కడ టీడీపీకి 196, వైసీపీకి 176 ఓట్లు పడ్డాయి.

మచిలీపట్నంలో 252 మంది టీడీపీకి ఓటేయగా, వైసీపీకి 68 మంది మాత్రమే వేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో ఉద్యోగులు కూటమి ప్రభుత్వానికి అండగా నిలిచారు. చిత్తూరులో టీడీపీకి 145 మంది ఉద్యోగులు ఓటేయగా, వైసీపీకి 38 మంది మాత్రమే మద్దతు ఇచ్చారు. కుప్పం మున్సిపాలిటీలో టీడీపీకి 15 ఓట్లు రాగా, వైసీపీకి దక్కింది సున్నా.

ఇక వెంకటగిరిలో కూటమికి 188 ఓట్లు రాగా, వైసీపీకి 66 మాత్రమే వచ్చాయి. హిందూపురంలో కూటమికి 242, వైసీపీకి కేవలం 58 ఓట్లు దక్కాయి. మార్కాపురంలో టీడీపీకి 62, వైసీపీకి 23, నూజివీడులో టీడీపీకి 128, వైసీపీకి 48, పార్వతీపురంలో కూటమికి 66, వైసీపీకి 20 ఓట్లు వచ్చాయి. కొవ్వూరులో టీడీపీకి 34 ఓట్లు రాగా, వైసీపీకి 4 ఓట్లు మాత్రమే వచ్చాయి.


పరిషత్‌లోనూ కూటమి వెన్నంటే..

గ్రామీణ నేపథ్యం, రాజకీయ ప్రాధాన్యం ఉన్న ప్రాంతాల్లో జరిగిన పరిషత్‌ ఎన్నికల్లోనూ ప్రభుత్వ ఉద్యోగులు కూటమి పట్ల ఆదరణ చూపారు. వైసీపీ ప్రాబల్యం ఉండే ప్రాంతాల్లోనూ కూటమికి అత్యధిక ఓట్లు పడ్డాయి. అన్నమయ్య జిల్లా నంబేపల్లిలో టీడీపీకి 161 మంది ఓట్లేయగా, వైసీపీకి 33 మంది మాత్రమే వేశారు. రాయచోటిలో టీడీపీకి 161 ఉద్యోగుల ఓట్లు రాగా, వైసీపీకి 33 ఓట్లే వచ్చాయి.

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత మండలం సదుంలో వైసీపీకి 74 ఓట్లురాగా, టీడీపీకి 52 వచ్చాయి. చిన్నమడెంలో టీడీపీకి 126 పోస్టల్‌ ఓట్లు రాగా, వైసీపీకి వచ్చినవి 8 మాత్రమే. పీలేరులో కూటమికి 304, వైసీపీకి 105 ఓట్లు వచ్చాయి. పీలేరు నియోజకవర్గం పరిధిలోని కలికిరి, కేవీపల్లె, గుర్రంకొండ, కలకడ మండలాల్లో టీడీపీకి గంపగుత్తగా ఉద్యోగుల ఓట్లు వచ్చాయి.

అనంతపురం జిల్లాలో కూటమికి 1803 ఓట్లు రాగా, వైసీపీకి 1081 వచ్చాయి. ప్రకాశం జిల్లాలో ఉద్యోగులు కూటమికి జై కొట్టారు. జిల్లా వ్యాప్తంగా 3098 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు వేయగా, ఇందులో టీడీపీకి 2323, వైసీపీకి 592 ఓట్లు వచ్చాయి. ఆచంటలో టీడీపీకి 91, వైసీపీకి 13 ఓట్లు పడ్డాయి. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన కుప్పంలో టీడీపీకి 110, వైసీపీకి 17 ఓట్లు దక్కాయి.

ఈ వార్తలనూ చదవండి:

కూటమి.. సునామీ

ఫలించిన మంత్రి కొండపల్లి వ్యూహం.. బొత్స కూతురిపై సామాన్య మహిళ గెలుపు..

Updated Date - Nov 08 , 2026 | 03:23 AM