Share News

ఫ్రీహోల్డ్‌కు లైన్‌క్లియర్‌!

ABN , Publish Date - Sep 11 , 2026 | 03:06 AM

రెండేళ్ల నిరీక్షణకు సర్కారు తెరదించనుంది. ఫ్రీహోల్డ్‌ పరిధిలోకి వచ్చే భూముల రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించనుంది. ఈ నెల 14 లేదా 15వ తేదీల్లో రెవెన్యూ శాఖ ద్వారా ఈ మేరకు ఉత్తర్వులు ఇప్పించనుంది.

ఫ్రీహోల్డ్‌కు లైన్‌క్లియర్‌!
Land

  • త్వరలో భూముల రిజిస్ట్రేషన్లకు అవకాశం

  • రిజిస్ట్రేషన్ల నిషేధంపై ముగిసిన గడువు

  • ఇక పొడిగింపు ఉండదు: మంత్రి అనగాని

  • 14-15 తేదీల్లో ఉత్తర్వులిచ్చే అవకాశం

  • 8.50 లక్షల ఎకరాలకు పూర్తి హక్కులు

    (అమరావతి-ఆంధ్రజ్యోతి)

రెండేళ్ల నిరీక్షణకు సర్కారు తెరదించనుంది. ఫ్రీహోల్డ్‌ పరిధిలోకి వచ్చే భూముల రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించనుంది. ఈ నెల 14 లేదా 15వ తేదీల్లో రెవెన్యూ శాఖ ద్వారా ఈ మేరకు ఉత్తర్వులు ఇప్పించనుంది. గతంలో మాదిరిగా రేపు, ఎల్లుండి అని వాయిదాలు వేయకుండా పక్కాగా ఫ్రీహోల్డ్‌ భూముల రిజిస్ట్రేషన్లకు విధివిధానాలు ప్రకటిస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఫ్రీహోల్డ్‌ భూముల రిజిస్ట్రేషన్లపై ఉన్న నిషేధ గడువు గురువారంతో ముగిసింది. ఇకపై ఆ గడువును పొడిగించడం లేదని, త్వరలో ఆ భూములకు లైన్‌ క్లియర్‌ అవుతుందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ తెలిపారు. గురువారం నాటి జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఫ్రీహోల్డ్‌ భూముల గురించి మంత్రి అనగాని చూచాయగా చెప్పారు. త్వరలో ఫ్రీహోల్డ్‌ను క్లియర్‌ చేస్తామన్నారు. దీనిపై ఆరా తీయగా.. ఫ్రీహోల్డ్‌ రిజిస్ట్రేషన్ల విధివిధానాలు, ఇతర అంశాల కూర్పు ఇంకా పూర్తికాలేదని, ఉత్తర్వులు విడుదల చేయడానికి మరో రెండు, మూడు రోజుల సమయం పట్టొచ్చని అధికార వర్గాలు తెలిపాయి. కాగా ఫ్రీహోల్డ్‌ రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇస్తూ సోమవారం లేదా మంగళవారం అధికారిక ఉత్తర్వులు రావొచ్చని రెవెన్యూ శాఖ ఉన్నతాధికారవర్గాలు ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పాయి. సోమవారం వినాయక చవితి పండగ. ప్రభుత్వం అనుకుంటే అదే రోజు ఉత్తర్వులు ఇవ్వొచ్చు. లేనిపక్షంలో మంగళవారం ఉత్తర్వులు విడుదలయ్యే అవకాశం ఉందని ఆ వర్గాలు తెలిపాయి.


జగన్‌ ప్రభుత్వంలో భారీ అక్రమాలు

గత జగన్‌ ప్రభుత్వం 2023లో ఏపీ అసైన్‌మెంట్‌ చట్టసవరణ చేసి అసైన్డ్‌ భూముల ఫ్రీహోల్డ్‌కు అవకాశం కల్పించింది. భూములు అసైన్‌మెంట్‌ అయిన 20 ఏళ్ల తర్వాత అసైనీలకే పూర్తి హక్కులు కల్పించాలని, వారి పేరిటే శాశ్వత పట్టాలు ఇవ్వాలని చట్టసవరణ చేశారు. దీని అమలుకు 2023 నవంబరులో జీఓ 596 జారీ చేశారు. 20 ఏళ్ల తర్వాత పూర్తి హక్కులు వచ్చే భూములను అసైనీల పేరిటే రిజిస్ట్రేషన్‌ చేస్తారు. ఒక్క అసైన్‌మెంట్‌ భూములే కాకుండా, చుక్కల భూములు, షరతుగల పట్టా భూములకు కూడా దీన్ని వర్తింపజేశారు. ఇలా అర్హత గల భూములను నిషేధిత జాబితా 22(ఏ) నుంచి తొలగించి రైతుల పేరిట పూర్తి హక్కులు ఇచ్చారు. హక్కులు పొందిన రైతులు ఇతరులకు విక్రయించుకునే వెసులుబాటు కల్పించారు. గత జగన్‌ ప్రభుత్వం 13.75 లక్షల ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించి ఫ్రీహోల్డ్‌గా ప్రకటించింది. ఇందులో 25 వేల ఎకరాల రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయి. అప్పట్లో ఫ్రీహోల్డ్‌ ప్రక్రియపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. వైసీపీ నేతలు, భూ కబ్జాదారులు పేదల భూములను అక్రమంగా పొందారన్న విమర్శలు వచ్చాయి. కూటమి సర్కారు రాగానే 2024లో విచారణకు ఆదేశించింది. 13.75 లక్షల ఎకరాల్లో 5.85 లక్షల ఎకరాలను అసైన్డ్‌ చట్టం, ఇతర నిబంధనలకు విరుద్ధంగా నిషేధిత జాబితా నుంచి తొలగించి ఫ్రీహోల్డ్‌ చేశారని ప్రభుత్వం గుర్తించింది. దీంతో 2024 ఆగస్టులోనే ఫ్రీహోల్డ్‌ భూముల రిజిస్ట్రేషన్లపై నిషేధం విధించింది. ఆ త ర్వాత ఈ భూములపై మరింత విచారణ, భవిష్యత్‌ కార్యాచరణ కోసం రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. ఈ ఉపసంఘం అధ్యయనం చేసి గత ఏడాది డిసెంబరు నాటికే ముఖ్యమంత్రి చంద్రబాబుకు నివేదిక ఇచ్చింది.


8.50 లక్షల ఎకరాలకు విముక్తి

ఉపసంఘం నివేదిక ప్రకారం.. అసైన్డ్‌ చట్టం నిబంధనలకు లోబడి ఫ్రీ హోల్డ్‌ అయిన భూములకు స్వేచ్ఛ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే.. నిబంధనల ప్రకారం ఫ్రీహోల్డ్‌ అయిన 7.9 లక్షల ఎకరాలకు ఇప్పుడు విముక్తి లభించబోతోంది. వీటికి తోడు అసైన్డ్‌ చట్టం ప్రకారం గత రెండేళ్ల వ్యవధిలో 20 ఏళ్ల గడువు తీరిన భూములు మరో 60 వేల ఎకరాల మేర ఉండొచ్చని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇవన్నీ కలిపి 8.50 లక్షల ఎకరాలను ఫ్రీహోల్డ్‌ జాబితాలోకి తీసుకొచ్చి రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించేలా రెవెన్యూ శాఖ ఉత్తర్వులు ఇవ్వనుంది. ఫ్రీహోల్డ్‌ విధానం ఎలా ఉండాలి? ఏయే భూములకు అది వర్తిస్తుంది? అన్న అంశాలపై స్పష్టత ఇస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు ఇవ్వనుందని మంత్రి అనగాని సత్యప్రసాద్‌ తెలిపారు. ఫ్రీహోల్డ్‌ రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పిస్తూ త్వరలో ఉత్తర్వులు ఇవ్వనున్నట్టు చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..
మునిసిపోల్‌కు సమాయత్తం

పడకేస్తున్న ప్లస్‌-2

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 11 , 2026 | 03:06 AM