మునిసిపోల్‌కు సమాయత్తం
ABN , Publish Date - Sep 11 , 2026 | 12:46 AM
మునిసిపల్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. ముందస్తు పనుల్లో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అధికారులు ఓటరు జాబితాలను ఇప్పటికే విడుదల చేశారు.
చురుగ్గా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు
రేపటితో ముగియనున్న ప్రక్రియ
పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా విడుదల
అభ్యంతరాలు, సూచనలకే నేటి సాయంత్రం వరకు గడువు
ఎలమంచిలి, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. ముందస్తు పనుల్లో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అధికారులు ఓటరు జాబితాలను ఇప్పటికే విడుదల చేశారు. వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతున్నది. 12వ తేదీతో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. మరోవైపు గురువారం పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాలను విడుదల చేశారు.
మునిసిపాలిటీలో గతంలో 25 వార్డులు ఉండగా, 2011 జనాభా ప్రాతిపదికన పునర్విభజన తరువాత 32 వార్డులకు పెరిగాయి. వచ్చే నెలలో ఎన్నికలు నిర్వహించడానికి సన్నద్ధంగా వున్న రాష్ట్ర ఎన్నికల కమిషన్.. ఈ ఏడాది జనవరి 1వ తేదీన విడుదల చేసిన ఓటరు జాబితాల ఆధారంగా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో మొత్తం 36,526 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 17,450, మహిళలు 19,068, ఇతరులు 8 మంది వున్నారు. మొత్తం మీద నాలుగు మినహా మిగిలిన 28 వార్డుల్లో మహిళా ఓటర్లే అధికంగా వున్నారు. 28వ వార్డులో అత్యధికంగా 1,299 మంది ఓటర్లు, అత్యల్పంగా 32వ వార్డులో 867 మంది ఓటర్లు ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు ప్రక్రియ పూర్తయిన తరువాత జాబితాలను మునిసిపల్, తహశీల్దారు కార్యాలయాలతోపాటు అన్ని స్వర్ణ వార్డు కార్యాలయాల్లో ప్రదర్శిస్తారు. వీటిపై ప్రజల అభిప్రాయాలు, అభ్యంతరాలు తెలుసుకోవడానికి వార్డుల వారీగా సభలు ఏర్పాటు చేశారు. అనంతరం అవసరమైన మార్పులు, చేర్పులతో తుది ఓటరు జాబితాలను విడుదల చేస్తారు. బీసీ రిజర్వేషన్లపై కోర్టు తీర్పు వెలువడిన అనంతరం రిజర్వేషన్లకు ఖరారు చేస్తారు.
పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా విడుదల
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మునిసిపల్ కమిషనర్ ప్రసాదరాజు, పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు కలిసి గురువారం 32 వార్డులకు సంబంధించి పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను నోటీసు బోర్డులో పెట్టారు. ఈ జాబితాలను తహశీల్దారు, సబ్‌రిజిస్ట్రార్, పోస్ట్ ఆఫీస్, కోర్టు సముదాయం, జిల్లా కలెక్టర్, రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో కూడా అందుబాటులో వుంచినట్టు తెలిపారు. పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలు, సూచనలు, సలహాలను 11వ తేదీ సాయంత్రంలోగా మునిసిపల్ కమిషనర్‌కు సమర్పించాలని పేర్కొన్నారు.