పడకేస్తున్న ప్లస్-2
ABN , Publish Date - Sep 11 , 2026 | 12:48 AM
పాఠశాల విద్యా శాఖ, ఇంటర్మీడియట్ బోర్డు అధికారుల మధ్య సమన్వయలోపం కారణంగా ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న ప్లస్-2 విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైంది. పాఠశాలస్థాయి ఉపాధ్యాయులు ఇంటర్ పాఠాలు బోధిస్తుండడంతో విద్యార్థులకు సరిగా అర్థం కాని పరిస్థితి నెలకొంది.
ఉన్నత పాఠశాలల్లో టీచర్లతోనే ఇంటర్ పాఠాల బోధన
లెక్చరర్ల నియామకాన్ని పట్టించుకోని అధికారులు
విద్యార్థులకు కొరవడిన నాణ్యమైన బోధన
కొయ్యూరు, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి):
పాఠశాల విద్యా శాఖ, ఇంటర్మీడియట్ బోర్డు అధికారుల మధ్య సమన్వయలోపం కారణంగా ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న ప్లస్-2 విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైంది. పాఠశాలస్థాయి ఉపాధ్యాయులు ఇంటర్ పాఠాలు బోధిస్తుండడంతో విద్యార్థులకు సరిగా అర్థం కాని పరిస్థితి నెలకొంది.
కొయ్యూరు మండలంలోని వివిధ పాఠశాలల నుంచి ఏటా సుమారు 600 మంది విద్యార్థులు పదో తరగతి పూర్తిచేస్తున్నారు. మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల లేకపోవడం, గురుకుల కళాశాలలో కొద్ది సీట్లు మాత్రమే వుండడంతో మిగిలిన వారంతా ఇంటర్ చదవడానికి మైదాన ప్రాంతానికి వెళ్లాల్సి వస్తున్నది. దీనివల్ల చాలా మంది ఆడపిల్లలతోపాటు పలువురు అబ్బాయిలు పదో తరగతితో చదువు మానేస్తున్నారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి రావడంతో నాలుగేళ్ల క్రితం కొయ్యూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ప్లస్-2 (ఇంటర్) మంజూరు చేసి ఎంపీసీ, సీఈసీ గ్రూపులను ప్రవేశపెట్టారు. తొలి ఏడాది పాఠశాల ఉపాధ్యాయులే ఇంటర్ విద్యార్థులకు పాఠాలు బోధించారు. ప్రభుత్వం అధ్యాపకులను నియమించకపోవడంతో ఇప్పటికీ టీచర్లే వారికి పాఠాలు చెబుతున్నారు. దీనివల్ల ఆయా సబ్జెక్టులను ప్రిపేర్ కావడానికి ఉపాధ్యాయులు, వీరు బోధించే పాఠాలు అర్థంకాక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ప్లస్-2 ఎంపీసీలో ఫస్టియర్‌లో ఆరుగురు, సెకండియర్‌లో నలుగురు మాత్రమే వున్నారు. సీఈసీలో 13 మంది చొప్పున 26 మంది విద్యార్థులు వున్నారు. విద్యా శాఖ పరిధిలోని పాఠశాలల్లో ప్లస్-2ను ఏర్పాటు చేసినందున వాటి నిర్వహణ బాధ్యత తమది కాదని ఇంటర్ విద్యా శాఖ అధికారులు అంటున్నారు. కాగా ప్లస్-2 పాఠశాలల్లో అధ్యాపకుల నియామకానికి ఉన్నతాధికారులు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని విద్యా శాఖాధికారులు అంటున్నారు. రెండు శాఖల మధ్య సమన్వయలోపంతో తాము ఇబ్బంది పడుతున్నామని విద్యార్థులు, ఉపాధ్యాయులు వాపోతున్నారు.