మైనార్టీ అభ్యర్థులకు గ్రూప్-1 ఉచిత శిక్షణ
ABN , Publish Date - Aug 30 , 2026 | 05:45 AM
గ్రూప్-1 పరీక్షలకు రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవల్‌పమెంట్ ఆఫ్ మైనార్టీస్ (సీఈడీఎం)-ఏపీ ద్వారా ఉచిత శిక్షణ అందించనున్నట్టు ఆ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ తెలిపారు.
ఎంపిక కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రవేశ పరీక్ష
రేపటి నుంచే దరఖాస్తులు: మంత్రి ఫరూక్
అమరావతి, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): గ్రూప్-1 పరీక్షలకు రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవల్‌పమెంట్ ఆఫ్ మైనార్టీస్ (సీఈడీఎం)-ఏపీ ద్వారా ఉచిత శిక్షణ అందించనున్నట్టు ఆ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ తెలిపారు. ఉచిత శిక్షణకు అభ్యర్థులను రాష్ట్రవ్యాప్త ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నట్టు శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో శిక్షణ అందించనున్నట్టు తెలిపారు. అర్హత, ఆసక్తి కలిగిన మైనార్టీ అభ్యర్థులందరూ తమ వివరాలను ‘సీఈడీఎం-ఏపీ’ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ పద్ధతిలో నమోదు చేసుకోవాలని సూచించారు. ఆఫ్‌లైన్ శిక్షణ తరగతులకు దరఖాస్తు చేసుకునే వారు డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులు పొంది, తెల్లరేషన్ కార్డు కలిగిన కుటుంబాలవారై ఉండాలన్నారు. ఆన్‌లైన్ శిక్షణకు మాత్రం పై నిబంధన వర్తించదని తెలిపారు. మరిన్ని వివరాల కోసం www.apcedmmwg.org వెబ్‌సైట్‌లో లేదా 08645-297535, 7386789966 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని సూచించారు. ప్రవేశ పరీక్షకు ఆన్‌లైన్ దరఖాస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 31వ తేదీన ప్రారంభమై సెప్టెంబరు 10వ తేదీతో ముగుస్తుందని తెలిపారు. పూర్తి వివరాలు సీఈడీఎం-ఏపీ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరచినట్లు వెల్లడించారు. త్వరలో నోటిపికేషన్ విడుదలయ్యే గ్రూప్-2కు కూడా ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభిస్తామన్నారు. నోటిఫికేషన్ విడుదలయ్యాక దీనిపైనా మైనార్టీ సంక్షేమశాఖ ప్రత్యేకంగా ప్రకటన జారీ చేస్తుందని తెలిపారు. ప్రభుత్వం నిపుణులైన అధ్యాపకులతో అందిస్తున్న ఉచిత శిక్షణను మైనార్టీ యువత సువర్ణ అవకాశంగా భావించి, పట్టుదలతో చదివి ఉన్నత ఉద్యోగాలు సాధించాలని సూచించారు.
Also Read:
సింహాద్రి అప్పన్న ఆలయంలో ముగ్గురు ఉద్యోగుల సస్పెండ్
గత ప్రభుత్వానికి నరకడం తప్ప.. నాటే ఆలోచనే రాలేదు: నాగబాబు