నగరిలో రోజా హంగామా
ABN , Publish Date - Nov 08 , 2026 | 04:30 AM
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్‌కే రోజా ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద హంగామా సృష్టించారు. మహిళా పోలీసును తోసేయడంతో పాటు, నీళ్లు తాగమని బాటిల్ ఇచ్చిన పీఏ మీద చేయి చేసుకున్నారు.
మహిళా పోలీసును తోసేసి.. పీఏను కొట్టి.. వాటర్ బాటిల్ పడేసి
3 ఓట్లతో టీడీపీ ఎంపీటీసీ గెలుపు
రీకౌంటింగ్‌కు పట్టుబట్టి.. నానా యాగీ
నగరి, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్‌కే రోజా ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద హంగామా సృష్టించారు. మహిళా పోలీసును తోసేయడంతో పాటు, నీళ్లు తాగమని బాటిల్ ఇచ్చిన పీఏ మీద చేయి చేసుకున్నారు. బాటిల్ విసిరి పడేశారు. పోలీసులు నచ్చజెప్పినా నానాయాగీ చేశారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం విజయపురం మండలంలోని ఇల్లత్తూరు ఎంపీటీసీ పరిధిలో టీడీపీ అభ్యర్థి ప్రభావతి 3 ఓట్లతో గెలిచారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి(ఆర్వో) డిక్లరేషన్ అందించారు.
అప్పటివరకు కౌంటింగ్ కేంద్రంలోనే ఉన్న వైసీపీ నాయకులు సుమారు అరగంట తర్వాత నిరసనకు దిగారు. ఇది తెలిసి రోజా నగరి డిగ్రీ కాలేజీ కౌంటింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. అనుచరులతో రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి, అధికారులకు, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తొలుత వైసీపీ అభ్యర్థి 10 ఓట్లతో గెలిస్తే, టీడీపీ వాళ్ల కోరిక మేరకు రీకౌంటింగ్ చేసి 3 ఓట్లతో టీడీపీ అభ్యర్థి గెలిచినట్లు డిక్లరేషన్ ఇచ్చారని ఆరోపించారు.
ఈ సమయంలో ఏఎస్పీ షేక్ షా సహా పోలీసులు ఎంత సర్దిచెప్పినా ఆమె పట్టించుకోలేదు. పోలీసుల అభ్యర్థన మేరకు కౌంటింగ్ కేంద్రంలో నుంచి ఆర్వో జయచంద్రారెడ్డి (పీఆర్ డీఈ) నిరసన ప్రాంతానికి వచ్చారు. రోజా మాట్లాడుతూ.. ‘‘మాకూ రీకౌంటింగ్ అవకాశం మాకూ ఇవ్వాలి.’’ అని కోరారు. ఆర్వో బదులిస్తూ ‘‘టీడీపీ అభ్యర్థికి డిక్లరేషన్ ఇచ్చేటప్పుడు కూడా మీ వాళ్లు రీకౌంటింగ్ అడగలేదు. అరగంట తర్వాత మీ వాళ్లు రీకౌంటింగ్ అడిగారు. ఇప్పుడు నేనేమీ చేయలేను.’’ అని వివరణ ఇచ్చారు.
కాగా, నిరసన సమయంలో ఓ మహిళా పోలీసును రోజా తోసేశారు. పోలీసుల్ని దుర్భాషలాడారు. ఈ సమయంలో పోలీసులు ఆమెను బలవంతంగా కారులోకి ఎక్కించారు. కారులో ఆమె పీఏ గణపతి నీళ్ల బాటిల్ అందించగా, విసిరికొట్టి.. పీఏ మీద చేయి చేసుకున్నారు. కారులో కూర్చొని కూడా పెడబొబ్బలు పెట్టారు. కారు స్టార్ట్ చేస్తున్న డ్రైవర్‌ను వద్దని గద్దించారు. దీంతో పోలీసులు సుమారు అరగంట వేచి చూసి, తామే ఆమె కారును డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి తీసుకెళ్లారు.
ఈ వార్తలనూ చదవండి:
ఫలించిన మంత్రి కొండపల్లి వ్యూహం.. బొత్స కూతురిపై సామాన్య మహిళ గెలుపు..