మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులపై గృహ హింస కేసు
ABN , Publish Date - Jul 24 , 2026 | 09:21 PM
ఎన్టీఆర్ జిల్లాలో మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులపై గృహ హింస, వరకట్న వేధింపులు, చీటింగ్, హత్యాయత్నం ఆరోపణలతో కేసు నమోదైంది. బాధితురాలు మేఘన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు..
ఎన్టీఆర్ జిల్లా, జులై 24: మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ భార్య మేఘన ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ సభ్యుల నుంచి తనకు నిరంతరం వేధింపులు ఎదురయ్యాయని, మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురిచేశారని మేఘన తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. మేఘన ఫిర్యాదులో గృహ హింస (Domestic Violence), వరకట్న వేధింపులు (Dowry Harassment), చీటింగ్ (Cheating), హత్యాయత్నం (Attempt to Murder) వంటి తీవ్రమైన ఆరోపణలు చేశారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా మాజీ మంత్రి జోగి రమేష్, జోగి రాము కుటుంబాలకు చెందిన మొత్తం 11 మంది సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులో పేర్కొన్న ఆరోపణలపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. బాధితురాలు సమర్పించిన వివరాలు, అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలిస్తూ తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ కేసులో ఉన్న ఆరోపణల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రతి అంశాన్నీ నిశితంగా దర్యాప్తు చేస్తున్నామని ఇబ్రహీంపట్నం పోలీసులు తెలిపారు. అవసరమైతే సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాలు నమోదు చేసి, సాక్ష్యాధారాలను సేకరించిన అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్థానిక సమస్యలపై దృష్టి పెట్టండి.. జనసేన నేతలకు మంత్రి మనోహర్ సూచన
అమరావతి ఎన్‌జీఓ టవర్స్ నిర్మాణ పనుల్లో మరో ముందడుగు
Read Latest AP News And Telugu News