ఆహారం వికటించి 54 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత
ABN , Publish Date - Aug 30 , 2026 | 05:58 AM
ఒక ప్రైవేట్ హాస్టల్‌లో ఆహారం వికటించి 54 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
దోసకాయలపల్లి జీఎస్‌హెచ్ హాస్టల్‌లో ఘటన
రాజమహేంద్రవరం, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): ఒక ప్రైవేట్ హాస్టల్‌లో ఆహారం వికటించి 54 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం దోసకాయలపల్లిలో జీఎస్‌హెచ్ అనే మిషనరీ స్కూల్ ఉంది. ఇక్కడి ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకూ విద్యాబోధన జరుగుతోంది. మొత్తం 474 మంది పేద విద్యార్థులు ఉండగా 172 మంది హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్నారు. గురువారం రాత్రి భోజనంలో చికెన్ తిన్నారు. శుక్రవారం ఉదయం మైసూర్ బజ్జీలు, చట్నీ అందించారు. టిఫిన్ తిన్న కాసేపటికే వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో విలవిల్లాడిపోయారు. తీవ్ర అస్వస్థతకు గురైన 54 మంది విద్యార్థులను సాయంత్రం హాస్టల్ ఉద్యోగులు స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. అయితే శనివారం ఉదయం వరకూ ఈ విషయాన్ని వెలుగు చూడనివ్వలేదు. 6వ తరగతి చదువుతున్న విద్యార్థికి రక్త విరేచనాలు కావడంతో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రాజమహేంద్రవరం ఆర్డీవో శివరాముడు ఆస్పత్రికి వెళ్లి ఆ చిన్నారితో మాట్లాడి ధైర్యం చెప్పారు. వైద్యులతో మాట్లాడి చికిత్స తీరును తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని సూచించారు.
Also Read:
సింహాద్రి అప్పన్న ఆలయంలో ముగ్గురు ఉద్యోగుల సస్పెండ్
గత ప్రభుత్వానికి నరకడం తప్ప.. నాటే ఆలోచనే రాలేదు: నాగబాబు