Share News

రక్త దారులు!

ABN , Publish Date - Nov 25 , 2026 | 02:52 AM

కార్తీక పౌర్ణమి వేళ శ్రీముఖ లింగేశ్వరుడిని దర్శించుకుని ఆనందంగా ఇంటికి తిరుగు పయనమైన స్నేహితులను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వెంటాడింది.

రక్త దారులు!

  • ట్యాంకర్‌ లారీని థార్‌ ఢీకొట్టడంతో మంటలు.. ఐదుగురు దుర్మరణం

  • కార్తీక పౌర్ణమి వేళ భోగాపురం వద్ద విషాదం

  • కుటుంబాలతో కలిసి శ్రీకాకుళం శ్రీముఖ లింగేశ్వరుని దర్శనానికి వెళ్లిన మిత్రులు

  • తిరుగు ప్రయాణంలో పెట్రోల్‌ బంక్‌ పక్కన ఆగిన లారీని ఢీకొనడంతో ప్రమాదం..

  • లారీ కిందకు చొచ్చుకెళ్లిన జీపు

  • మృతులంతా విశాఖవాసులే..

  • ఇంటికి తిరిగొచ్చేస్తున్నట్టు పిల్లలతో ఫోన్‌లో మాట్లాడిన కొద్ది సేపటికే దుర్ఘటన

  • పెళ్లిరోజే సతీశ్‌, శ్రుతి దంపతుల దుర్మరణం

  • మరో ప్రమాదంలో లారీ డ్రైవరు, క్లీనర్‌ మృతి

భోగాపురం/విజయనగరం, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): కార్తీక పౌర్ణమి వేళ శ్రీముఖ లింగేశ్వరుడిని దర్శించుకుని ఆనందంగా ఇంటికి తిరుగు పయనమైన స్నేహితులను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వెంటాడింది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం కొత్త పెట్రోల్‌ బంక్‌ సమీపంలో ఆగి ఉన్న లారీని వారు ప్రయాణిస్తున్న థార్‌ జీపు ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. వాహనంలోని నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.

మంగళవారం ఉదయం 7.30 గంటల సమయంలో శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. విశాఖ జిల్లా మధురవాడకు చెందిన కొండపు సూరిబాబు, తగరపువలసకు చెందిన భార్యాభర్తలు బొర్రా శ్రుతి (31), బొర్రా సతీశ్‌(40); పోతలమల్లయ్యపాలెంకు చెందిన దంపతులు వాకలపూడి శ్రీను(42), కుసుమ రజని (39) కుటుంబాల మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి.


శ్రీను విశాఖ ద్వారకానగర్‌ రిలయన్స్‌ డిజిటల్‌లో స్టోర్‌ మేనేజర్‌. బొర్రా సతీశ్‌ సీఎంఆర్‌ సెంట్రల్‌ డిపార్ట్‌మెంటల్‌ స్టోర్‌ మేనేజర్‌. కొండపు సూరిబాబు విజయనగరంలోని రిలయన్స్‌ డిజిటల్‌లో డిపార్ట్‌మెంటల్‌ మేనేజర్‌. కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగం దర్శనానికి వీరంతా వెళ్లారు. దర్శనం అనంతరం మహీంద్రా థార్‌ జీపులో తిరుగు పయనమయ్యారు. భోగాపురం మండలం పరిధిలో కొత్తగా నిర్మిస్తున్న పెట్రోల్‌ బంక్‌ సమీపంలో ఒడిశా రాష్ట్రం ముండలీ ప్రాంతవాసి ప్రదీ్‌పకుమార్‌ తన ట్యాంకర్‌ లారీని రహదారి పక్కన నిలిపి కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లాడు. అదే సమయంలో వేగంగా వచ్చిన థార్‌ ఆగి ఉన్న లారీని వెనుకనుంచి బలంగా ఢీకొట్టింది.

దీంతో జీపు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయి మంటలు చెలరేగాయి. డ్రైవింగ్‌ సీటులో ఉన్న కొండపు సూరిబాబు, పక్కన కూర్చున్న వాకలపూడి శ్రీను, వెనుక సీటులో ఉన్న కుసుమరజని వాహనంలోనే చిక్కుకుని మృతిచెందారు. శ్రుతి రోడ్డుపై పడిపోగా, అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన సతీశ్‌ను 108 వాహనంలో తగరపువలసలోని పైవ్రేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన కూడా మృతిచెందారు. ప్రమాద తీవ్రతకు జీపు ధ్వంసం కావడంతోపాటు మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఎస్పీ దామోదర్‌ పోలీసులను అప్రమత్తం చేశారు. జీపు ముందు భాగం లారీ కిందకు చొచ్చుకుపోవడంతో భారీ క్రేన్‌ను రప్పించి బయటకు తీయించారు. మృతదేహాలను విజయనగరం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు.


సెల్‌ఫోన్‌ పేలుడే కారణమా?

ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. ట్యాంకర్‌ను ఢీకొట్టడానికి ముందుగా థార్‌లో పెద్ద శబ్దం వినిపించింది. సెల్‌ఫోన్‌ పేలినట్లు వచ్చిన ఆ శబ్దానికి వాహనంలో ఉన్నవారు ఉలిక్కిపడ్డారు. ఈ క్రమంలో డ్రైవింగ్‌ చేస్తున్న కొండపు సూరిబాబు వాహనంపై నియంత్రణ కోల్పోయి, ముందు ఆగి ఉన్న ట్యాంకర్‌ లారీని బలంగా ఢీకొట్టారని పోలీసులు చెబుతున్నారు.

దర్శనం ఫొటోలే మిగిలాయి

శ్రీముఖలింగం ఆలయంలో దర్శనం అనంతరం ఐదుగురూ ఆనందంగా ఫొటోలు దిగారు. వాటిని కుటుంబ సభ్యులు, స్నేహితులకు వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ ద్వారా పంపించారు. దర్శనం బాగా జరిగిందంటూ సందేశాలు కూడా పంపారు. కొద్దిసేపటికే వారు విగతజీవులయ్యారన్న వార్త తెలియడంతో ఆ ఫొటోలను చూసుకుంటూ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ‘దర్శనానికి వచ్చిన వారిని నీ చెంతకే చేర్చుకున్నావా శివయ్యా!’ అంటూ రోదించారు. భర్తను కోల్పోయిన గౌరి రోదన అక్కడున్నవారిని కలచివేసింది. ‘ఇప్పుడిక మాకు ఎవరు దిక్కు?’ అంటూ ఆమె విలపించిన తీరు కంటతడి పెట్టించింది.

పెళ్లిరోజే పెనువిషాదం

మంగళవారం బొర్రా సతీశ్‌, శ్రుతి దంపతుల పెళ్లిరోజు. జీవితాంతం కలిసుంటామని ప్రమాణం చేసిన రోజునే మృత్యువు వారిని బలితీసుకుంది. సంతోషంగా శివదర్శనానికి వెళ్లిన ఆ దంపతులు.. మరికొద్ది గంటల్లో పిల్లల వద్దకు చేరుకుంటారనగా మృత్యువాత పడ్డారు.


తీరని శోకం...

వాకలపూడి శ్రీను దంపతులకు పదేళ్ల జీయన్స్‌ బాబు, ఆరేళ్ల గ్రీష్మ ఉన్నారు. బొర్రా సతీశ్‌ దంపతులకు ఆరేళ్ల శరణ్యశ్రీ, తొమ్మిదేళ్ల వేంకట ధన్యశ్రీ ఉన్నారు. కొండపు సూరిబాబుకు భార్య గౌరి, 12 ఏళ్ల కుమార్తె భవ్యశ్రీ, పదేళ్ల కుమారుడు రేవంత్‌రెడ్డి ఉన్నారు. తండ్రి మృతదేహాన్ని చూసిన కుమార్తె భవ్యశ్రీ తట్టుకోలేక కుప్పకూలిపోయింది. భోగాపురం దుర్ఘటనపై మంత్రులు వంగలపూడి అనిత, బీసీ జనార్దన్‌రెడ్డి, కొండపల్లి శ్రీనివాస్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. విశాఖ జిల్లా వాసులు మృతిచెందిన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విజయనగరం జిల్లా కేంద్రాస్పత్రికి చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఫోన్‌లో పిల్లల పలకరింపులే.. చివరి మాటలు

‘డాడీ.. ఎక్కడున్నారు? ఎప్పుడు ఇంటికి వస్తారు?’ అంటూ పిల్లలు ఫోన్‌ చేశారు. ‘మరికాసేపట్లో వచ్చేస్తాం’ అని తల్లిదండ్రులు సమాధానమిచ్చారు. ఆ తర్వాత కొద్దిసేపటికే వారి జీవితాల్లో పెను విషాదం అలుముకుంది. పిల్లలకు ఇక ఆ తల్లిదండ్రుల పలకరింపులు వినిపించవు. ఇంటికితిరిగివస్తారని ఎదురుచూసిన కుటుంబాలకు వారి మృతదేహాలే చేరాయి.


అతి వేగమే మింగేసిందా?

ప్రమాదం జరిగిన సమయంలో జీపు వేగం 100-120 కిలోమీటర్లు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడతామని ఎస్పీ దామోదర్‌ వెల్లడించారు. ‘‘మృతులు రాత్రంతా నిద్రలేకుండా ప్రయాణించినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. శ్రీముఖలింగంలో దర్శనం తర్వాత విశ్రాంతి తీసుకోకుండానే తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో అల్పాహారం తీసుకుని ఉంటారు. దానివల్ల నిద్రమత్తు కమ్మడంతో ప్రమాదం చోటుచేసుకుందా అనే కోణాన్నీ పరిశీలిస్తున్నామని తెలిపారు. ప్రమాద సమయంలో సెల్‌ఫోన్‌ పేలినట్లు సమాచారం ఉందన్నారు. ఏదైనా శబ్దం వచ్చి డ్రైవింగ్‌ సీటులోని వ్యక్తి ఆందోళనకు గురయ్యారా అనేదీ పరిశీలిస్తున్నామని దామోదర్‌ తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

ఎస్‌ఐపీబీ సమావేశంలో కీలక నిర్ణయాలు

అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి

Updated Date - Nov 25 , 2026 | 03:04 AM