Share News

యూరప్ దేశాల్లో ఉద్యోగాల పేరుతో భారీ మోసం.. మహిళ అరెస్ట్

ABN , Publish Date - Aug 22 , 2026 | 04:03 PM

యూరప్ దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను నమ్మించి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘ఫ్లయింగ్ బోర్డర్స్’ సంస్థ నిర్వాహకురాలు సౌజన్యను విశాఖ ద్వారకా పోలీసులు అరెస్ట్ చేశారు. పలువురు బాధితుల ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు కృష్ణా జిల్లా తాడిగడపలో ఆమెను అదుపులోకి తీసుకుని విశాఖకు తరలించారు.

యూరప్ దేశాల్లో ఉద్యోగాల పేరుతో భారీ మోసం.. మహిళ అరెస్ట్
Visakhapatnam Jobs Fraud

విశాఖపట్నం, ఆగస్టు 22: యూరప్ దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను నమ్మించి భారీగా డబ్బులు వసూలు చేసిన ఘటన కృష్ణా జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ‘ఫ్లయింగ్ బోర్డర్స్’ పేరుతో సంస్థ నిర్వహిస్తున్న సౌజన్య అనే మహిళపై పలువురు బాధితులు మోసం ఆరోపణలు చేశారు. విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన పలువురు యువతను టార్గెట్ చేసిన సౌజన్య.. యూరప్ దేశాల్లో మంచి ఉద్యోగాలు, అధిక వేతనాలు ఇప్పిస్తామని నమ్మించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఉద్యోగాల కోసం ఆశపడిన నిరుద్యోగుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే బాధితులు విశాఖలోని ద్వారకా పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.


బాధితుల ఫిర్యాదులపై కేసు నమోదు చేసిన విశాఖ ద్వారకా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా కృష్ణా జిల్లా తాడిగడపలో ఉన్న సౌజన్య ఇంటికి పోలీసులు వెళ్లారు. అక్కడ ఆమెను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసిన పోలీసులు.. అనంతరం విశాఖకు తరలించినట్లు సమాచారం. యూరప్ ఉద్యోగాల పేరుతో ఎంతమంది నుంచి డబ్బులు వసూలు చేశారు? మొత్తం ఎంత మొత్తాన్ని తీసుకున్నారు? ఈ వ్యవహారంలో మరెవరైనా ఉన్నారా? ‘ఫ్లయింగ్ బోర్డర్స్’ సంస్థ ద్వారా గతంలో కూడా ఇలాంటి మోసాలు జరిగాయా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితుల నుంచి సేకరించిన వివరాలు, ఆర్థిక లావాదేవీల ఆధారంగా కేసు దర్యాప్తును పోలీసులు కొనసాగిస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

అనకాపల్లికి గోదావరి నీళ్లు.. సెప్టెంబర్ నాటికి తీసుకొస్తాం: సీఎం చంద్రబాబు

దారుణం.. భార్యను చంపి గోదావరి నదిలో పడేసి.. ఆపై

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 22 , 2026 | 05:28 PM