నిత్యావసరాల ధరలకు కళ్లెం!
ABN , Publish Date - Sep 17 , 2026 | 03:47 AM
నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా, సామాన్యుడికి అందుబాటులో అవి ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ముందస్తు అంచనాలతో పంటల సాగు, ఉత్పత్తి, మార్కెట్ నిర్వహణపై దృష్టి పెట్టాలన్నారు. బుధవారం ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వ్యవసాయ, అనుబంధ శాఖలపై సీఎం సమీక్ష నిర్వహించారు.
రైతుబజార్లు, రేషన్ షాపుల ద్వారా నిత్యావసరాల సరఫరా
60 రకాల సరుకులు అందుబాటులో ఉంచాలి
డిమాండ్ అంచనాల ఆధారంగా పంటల సాగు
అవసరమైతే రైతులతో బైబ్యాక్ ఒప్పందాలు
వ్యవసాయ, అనుబంధశాఖల సమీక్షలో సీఎం ఆదేశాలు
అమరావతి, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా, సామాన్యుడికి అందుబాటులో అవి ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ముందస్తు అంచనాలతో పంటల సాగు, ఉత్పత్తి, మార్కెట్ నిర్వహణపై దృష్టి పెట్టాలన్నారు. బుధవారం ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వ్యవసాయ, అనుబంధ శాఖలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘ద్రవ్యోల్బణం పెరగడానికి గల కారణాలను అంచనా వేయాలి. డిమాండ్‌కు తగ్గట్టుగా ఉత్పత్తి ఉందా? సరఫరా పరిస్థితులు ఎలా ఉన్నాయనే అంశాలను విశ్లేషించుకుని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి. ఎలాంటి ప్రాంతాల్లో.. ఏఏ పంటలకు మార్కెట్ జోక్యం అవసరమో గుర్తించాలి. కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధరలు అమలుతో పాటు రైతులు ఆయా పంటలు సాగుచేసేలా ప్రోత్సహించాలి. అవసరమైతే రైతుల నుంచి బైబ్యాక్ ఒప్పందాలు చేసుకోవాలి. ఆయిల్‌ఫెడ్, మార్క్‌ఫెడ్, రైతుబజార్లు, రేషన్ డిపోల వంటి వ్యవస్థలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. కనీస మద్దతు ధరలు ప్రకటిస్తే.. ఉత్పత్తులు ప్రభుత్వం చెంతకే చేరతాయి. తద్వారా ధరల నియంత్రణకు అవకాశం ఉంటుంది. ప్రెడిక్షన్ చేశాక.. ప్రొడక్షన్‌కు వెళ్లాలి. ఆ మేరకు మార్కెట్‌ను కూడా అంచనా వేసుకోవాలి. రైతుబజార్లు, రేషన్ డిపోల ద్వారా దాదాపు 60 రకాల నిత్యావసర సరుకులను ప్రజలకు సరఫరా చేసేలా చూడాలి. ఉల్లి, కంది, పప్పుల వంటి వాటిని రైతుబజార్లు, రేషన్ షాపుల ద్వారా అందించాలి. పామాయిల్‌ను కూడా రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయాలి. ఉల్లి, మిర్చి వంటి పంటలను ఎప్పుడూ పండించే ప్రాంతాల్లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ పండించే అంశాన్ని పరిశీలించాలి. ఏఏ పంటలు పండిస్తున్నారో తెలుసుకోవాలి. ఉల్లి అవసరం ఎంత? ప్రస్తుతం ఎంత అందుబాటులో ఉందో అంచనా వేసుకోవాలి. ధరలు ఏ విధంగా పెరుగుతాయో ముందుగానే అంచనావేసి, ప్రస్తుత మార్కెట్‌ను నియంత్రణ చేసుకుంటూ, అవసరమైన పంటలు వేసేలా చూడాలి. రాయితీ విత్తనాలు, అవసరమైన యంత్ర పరికరాలు ఇచ్చి, పంటలు వేసేలా రైతులను ప్రోత్సహించాలి.
వర్షాధార పంటలు వేయాలి
రాష్ట్రంలో ఎక్కడా పశుగ్రాసం లేక పాల ఉత్పత్తి తగ్గిందనే మాట రాకూడదు. పశువుల దాణాకు ఇబ్బంది లేకుండా ఉండాలి. రాష్ట్రంలో పంటల సాగుచేయని 8.61 లక్షల హెక్టార్లలో వర్షాధార పంటలు వేసేలా వ్యవసాయ శాఖ చూడాలి. చిరుధాన్యాలు, రాగులు, కొర్రలు, జొన్న, సజ్జ, ఉలవ, మొక్కజొన్న వంటి పంటలు సాగు చేయించాలి. ప్రకృతి సాగును మరింత ప్రోత్సహించాలి. రాష్ట్రంలో 3.61 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు హైరి్‌స్కలో ఉన్నాయి. ఈ పంటలను కాపాడేందుకు లైఫ్ సేవింగ్ ఇరిగేషన్ కోసం రూ. 190 కోట్లు కేటాయిస్తున్నాం. అవసరమైన ప్రాంతాలకు వాటర్ ట్యాంకర్లను పంపేలా చూడాలి. ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రతి నెలా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలి’’ అని అధికారులను ఆదేశించారు. ఏపీ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టుకు గ్లోబల్ ఎక్స్‌లెన్స్ అవార్డు రావడంపై ఉద్యా,న, ఎంఐపీ అధికారులను సీఎం అభినందించారు. సమీక్షలో మంత్రులు అచ్చెన్నాయుడు, రామానాయుడు, మనోహర్, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
గంటల వ్యవధిలోనే రోడ్లు మంజూరు చేసిన డిప్యూటీ సీఎం పవన్
ఎక్కువ ధరకు గణేశ్ లడ్డూ వేలం పాడడంపై వివాదం.. వ్యక్తి ఆత్మహత్య