వెలుగుల వెలిగొండ
ABN , Publish Date - Aug 28 , 2026 | 04:30 AM
మూడు దశాబ్దాల కల నెరవేరబోతోంది. కరువు నేలపై కృష్ణమ్మ పరవళ్లు తొక్కే సమయం ఆసన్నమైంది. తమ జీవితాల్లో వెలుగులు నింపే వెలిగొండ ప్రాజెక్టు ఇప్పుడు ప్రారంభానికి సిద్ధం కావడంతో ప్రజల ఆనందానికి అవధుల్లేకుండా పోతోంది.
నెరవేరనున్న 30 ఏళ్ల కల.. కరువు నేలకు కృష్ణమ్మ
ఈ నెల 31న ప్రాజెక్టు జాతికి అంకితం
తీరనున్న మార్కాపురం జిల్లావాసుల కష్టాలు
ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకూ లబ్ధి
కరువు కాటకాలు, ఫ్లోరైడ్ సమస్యలకు చెక్
అంచనా వ్యయం 10,200 కోట్లు
సామర్థ్యం 53.85 టీఎంసీలు
మొత్తం 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు
23 లక్షల మందికి తాగునీరు సరఫరా
1996లో నాటి సీఎం చంద్రబాబు భూమిపూజ
ఇప్పుడు ప్రారంభించేదీ ఆయనే
ప్రాజెక్టు పనులను అపహాస్యం చేసిన వైసీపీ
జగన్ పాలనలో 140 కోట్ల బిల్లులు పెండింగ్
పైగా జాతికి అంకితం అంటూ మోసం
(అమరావతి/మార్కాపురం-ఆంధ్రజ్యోతి): మూడు దశాబ్దాల కల నెరవేరబోతోంది. కరువు నేలపై కృష్ణమ్మ పరవళ్లు తొక్కే సమయం ఆసన్నమైంది. తమ జీవితాల్లో వెలుగులు నింపే వెలిగొండ ప్రాజెక్టు ఇప్పుడు ప్రారంభానికి సిద్ధం కావడంతో ప్రజల ఆనందానికి అవధుల్లేకుండా పోతోంది. ఇంతటి బృహత్తర ప్రాజెక్టు పూర్తి కావడానికి కారకుడు నాటి, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు కావడం విశేషం. 1996లో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన అప్పటి సీఎం చంద్రబాబు.. ఈ నెల 31న జాతికి అంకితం చేయనున్నారు. ప్రాజెక్టు తొలిదశ పనులు పూర్తి కావడంతో కృష్ణమ్మ నీళ్లు నల్లమల సాగర్ రిజర్వాయర్‌కు తెచ్చే శుభ ఘడియల కోసం ప్రజానీకం ఎదురుచూస్తోంది. ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కడప జిల్లాల్లో తక్కువ వర్షపాతంతో నిత్యం కరువు కాటకాల సమస్యలకు పరిష్కారంచూపడంతో పాటు సురక్షిత తాగునీరు లేని ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాల విముక్తి కోసం రూపకల్పన చేసిన ప్రాజెక్టు వెలిగొండ. శ్రీశైలం నుంచి కృష్ణా వరద నీటిని నల్లమల కొండల కింద నిర్మించిన రెండు సొరంగాల ద్వారా నల్లమల సాగర్ రిజర్వాయర్‌కు తరలించి 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మందికి తాగునీరు అందించడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. అంతేకాకుండా నల్లమల సాగర్ రిజర్వాయర్‌ను నీటితో నింపడం వల్ల సమీప ప్రాంతాల్లో ప్రస్తుతం 30 నుంచి 60 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలాలు పెరిగి 6 మీటర్లలోనే అందుబాటులోకి రానున్నాయి.
శంకుస్థాపన చేసింది చంద్రబాబే
1985లోనే వెలిగొండ ప్రాజెక్టు ఆలోచన మొదలైనప్పటికీ 1994లో దీనికి సంబంధించిన డీపీఆర్ పూర్తయ్యింది. 1996 మార్చి 5న నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. నల్లమల కొండల శ్రేణిగా పిలిచే వెలిగొండల శ్రేణిలో గ్యాప్‌లను పూడ్చటం ద్వారా రిజర్వాయర్ పూర్తి చేయాలనేది ప్రణాళిక. 1998లోనే సుంకేసుల, గొట్టిపడియ డ్యామ్‌లకు రూ.138 కోట్ల పరిపాలన అనుమతులు వచ్చాయి. అనంతరం కాకర్ల డ్యాంకు కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఆనకట్టల నిర్మాణం పూర్తయి 53.85 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో రిజర్వాయర్ రూపుదిద్దుకుంది. దోర్నాల మండలం కొత్తూరు వద్ద సొరంగాలు ఉన్న ప్రాంతం నుంచి దాదాపు 22 కి.మీ దూరంలో ఉన్న నల్లమల సాగర్‌కు ఫీడర్ కాలువ ద్వారా నీటిని తరలిస్తారు. ఈ రిజర్వాయర్ నుంచి ప్రధాన కాలువల ద్వారా నిర్దేశిత ప్రాంతాలకు నీటిని అందిస్తారు.
పనుల్లో జాప్యంతో పెరిగిన అంచనా వ్యయం
2004లో టన్నెల్-1, 2009లో టన్నెల్-2 పనులు ప్రారంభమైనప్పటికీ తవ్వకాల సమయంలో ఏర్పడిన అవాంతరాల కారణంగా జాప్యం జరిగింది. టన్నెల్-2లో టన్నెల్ బోరింగ్ యంత్రం ఇరుక్కుపోవడం వల్ల పనులు నిలిచిపోయాయి. 2014కు ముందు సరైన ప్రణాళిక లేకుండా చేసిన పనుల వల్ల కాలవ్యవధితో పాటు ప్రాజెక్టు అంచనా వ్యయం కూడా పెరిగిపోయింది. 1996లో రూ.980 కోట్లతో ప్రారంభమైన అంచనా వ్యయం ఇప్పుడు రూ.10,200 కోట్లకు చేరింది. టన్నెల్ నిర్మాణాలు పూర్తికాకుండానే కాలువల తవ్వకం పనులు చేయడం, నిర్వాసితుల సమస్య వదిలేయడం వంటి చర్యలతో 2014కు ముందు కేవలం మట్టి తవ్వకం పనులపైనే శ్రద్ధ చూపారు. ప్రధాన కాలువ తవ్వకం కూడా పూర్తి చేయకపోగా, బ్రాంచ్ కాలువ, మేజర్, మైనర్ కాలువల నిర్మాణం చేపట్టలేదు. ఫీడర్ కాలువ పూర్తి చేసినట్టు మట్టి పనులతో చేతులు దులుపుకోవడంతో వర్షం కురిసినప్పుడు వచ్చిన వరద నీటికే ఫీడర్ కాలువకు నాలుగైదు చోట్ల గండ్లు పడ్డాయి.
చంద్రబాబు హయాంలోనే పనుల్లో వేగం
2014 జూన్‌లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచారు. ఐదేళ్ల కాలంలో రూ.1,388.81 కోట్ల పనులు పూర్తి చేశారు. 18.8 కి.మీ పొడవున్న టన్నెల్-1లో అప్పటికి బ్యాలెన్స్ ఉన్న 7.2 కి.మీల తవ్వకంలో 2019 నాటికి 4.3 కి.మీ పూర్తి చేశారు. టన్నెల్-2లో 10 కి.మీ తవ్వాల్సి ఉంటే అందులో 2019 నాటికి 2.3 కి.మీ పూర్తి చేశారు. 2024లో మళ్లీ సీఎంగా పగ్గాలు చేపట్టాక కేవలం రెండేళ్ల రెండు నెలల్లో రూ.2,402 కోట్ల పనులు పూర్తి చేశారు. ఫీడర్ కాలువ పటిష్ఠతకు రూ.456 కోట్లు ఖర్చు చేసి కాంక్రీట్ రిటైనింగ్‌వాల్, లైనింగ్ పనులు పూర్తి చేశారు. టన్నెల్-2లో బెంచింగ్ లైనింగ్ పనులు వేగంగా చేశారు. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో 2,770 మీటర్ల బెంచింగ్ పనులు చేస్తే, కూటమి హయాంలో 4,924 మీటర్ల పనులు పూర్తి చేశారు., వైసీపీ సర్కారు ఐదేళ్లలో 702 మీటర్ల లైనింగ్ మాత్రమే చేయగా, కూటమి వచ్చాక 6,988 మీటర్ల లైనింగ్ పూర్తి చేసింది. టీబీఎం తొలగింపునకు కోర్టు అనుమతులతో వెంటనే పనులు ప్రారంభించి దాని విడిభాగాలు బయటకు తెచ్చారు. మొత్తం 1,901 టన్నులకు గాను ఇప్పటికి 1,650 టన్నుల భాగాలు బయటకు తీశారు. కొల్లంవాగు వద్ద హెడ్ రెగ్యులేటర్ పనులు పూర్తి చేయడంతో పాటు అక్కడ కుప్పగా పోసిన మక్, టన్నెల్‌లలో ఉన్న దాదాపు 1.20లక్షల క్యూ.మీ మక్ (మట్టి వ్యర్ధాలు) తొలగింపు పూర్తి చేశారు.
నిర్వాసితుల సమస్యకు పరిష్కారం
వెలిగొండ ప్రాజెక్టు పరిధిలో ఉన్న 7,321 నిర్వాసిత కుటుంబాలకు పరిహారం చెల్లింపును కూటమి ప్రభుత్వం చేపట్టింది. నీటి విడుదలకు ముందే చెల్లిస్తామని చెప్పినట్టుగానే జూన్ 29న రూ.306 కోట్లు, రెండో విడత ఈనెల 19న రూ.200 కోట్లు, మూడో విడత 22న రూ.250 కోట్లు చెల్లించింది. మిగిలిన రూ.132 కోట్ల పరిహారాన్ని నిర్వాసితులకు సంబంధించిన సమగ్ర వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయగానే చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇక త్వరలో నీటి విడుదల చేయనున్న నేపథ్యంలో 11 గ్రామాల నిర్వాసితులు ఊళ్లు ఖాళీ చేసి బయటకు వస్తున్నారు. వారికి కేటాయించిన కాలనీల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించిన ప్రభుత్వం ప్లాట్ల కేటాయింపును పూర్తి చేస్తోంది. మొత్తంమీద 2014 నుంచి 2019వరకు రూ.1,388.81 కోట్లు, 2024 నుంచి ఇప్పటివరకు రూ.2,402.35 కోట్లు ఖర్చు చేసిన ఘనత టీడీపీకే దక్కుతుంది. మధ్యలో వైసీపీ సర్కారు పూర్తి కాని ప్రాజెక్టును జాతికి అంకితం చేయగా.. అన్ని పనులూ చేసి ఈ నెల 31న మొదటి సొరంగం ద్వారా 10.7 టీఎంసీల నీటిని విడుదల చేసి నల్లమలసాగర్ రిజర్వాయర్‌కు చేరుస్తున్నారు.
జగన్ సర్కారు నిర్వాకం
2019-24 మధ్య జగన్ సర్కారు ప్రాజెక్టు పనులను పూర్తిగా అపహాస్యం చేసింది. ఐదేళ్లలో కేవలం రూ.981.66 కోట్ల పనులను చేసి అందులో కూడా రూ.140 కోట్ల బిల్లులను చెల్లించకుండా పెండింగ్‌లో ఉంచింది. టన్నెల్-2లో ఇరుక్కుపోయిన టీబీఎం తొలగింపు గురించి కనీస ఆలోచన చేయలేదు. హెడ్ రెగ్యులేటర్ పనులు కూడా పూర్తి చేయలేదు. నిర్వాసితుల ఆర్‌అండ్‌ఆర్ విషయం పట్టించుకోకుండా పునరావాస కాలనీలను కూడా వదిలేయడంతో చిల్లచెట్ల మధ్య కాలనీలన్నీ ఉండిపోయాయి. ఇవన్నీ చేయకుండానే నాటి సీఎం జగన్ ప్రాజెక్టును జాతికి అంకితం చేసి ప్రజలను మోసం చేశారు.
ప్రాజెక్టు పరిధి
వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నాలుగు జిల్లాల్లోని 30 మండలాల పరిధిలో 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. మార్కాపురం జిల్లాలో 20 మండలాలు, ప్రకాశంలో 3, నెల్లూరులో 5, కడప జిల్లాలో 2 మండలాలకు నీరందుతుంది. ఫ్లోరైడ్ ప్రాంతాల్లోని 23 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందుతుంది. నాలుగు జిల్లాల్లో 9 నియోజకవర్గాలకు ప్రయోజనం చేకూరుతుంది. వాటిలో ఎర్రగొండపాలెం, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, కొండపి, దర్శి, ఉదయగిరి, ఆత్మకూరు, బద్వేలు నియోజకవర్గాలు ఉన్నాయి. భూగర్భ జలాల మట్టాలు పెరుగుతాయి. 840 అడుగుల శ్రీశైలం ఫోర్‌షోర్ నుంచి కృష్ణా వరద జలాలు అందుబాటులోకి వస్తాయి.
కొనసాగుతున్న వెలిగొండ సంబరాలు
ఎర్రగొండపాలెం, మార్కాపురం ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): వెలిగొండ ప్రారంభానికి సిద్ధమవడంతో మార్కాపురం జిల్లా అంతటా సంబరాలు సాగుతున్నాయి. వరాల వెలిగొండ వారోత్సవాల పేరుతో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ కూటమి ప్రభుత్వానికి ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అందులో భాగంగా ఎర్రగొండపాలెంలో గురువారం టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు ఆధ్వర్యంలో ట్రాక్టర్‌లతో భారీ ర్యాలీ నిర్వహించారు. మార్కాపురంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. చెన్నకేశవస్వామి ఆలయ మాడవీధుల్లో భారీఎత్తున మహిళలతో కోలాట ప్రదర్శన ఏర్పాటు చేశారు.
మారనున్న ‘మార్కాపురం’ భవిష్యత్తు
బిందెడు నీళ్ల కోసం ఎదురు చూపులు.. ఫ్లోరైడ్ సమస్యలతో అనారోగ్యం బారినపడటం.. పంట పండుతుందనే ఆశతో విత్తనం వేయడం.. పంట పండకపోతే వలసపోవడం.. ఇవన్నీ మార్కాపురం జిల్లా ప్రజల కష్టాలు. వర్షం పడితే పంట.. పండకపోతే అప్పు. బోరు పనిచేస్తే సాగు.. అడుగంటితే వలస. ఇలా తరతరాలుగా కరువుతో పోరాడిన ప్రజల కష్టాలు తీర్చేందుకు వెలిగొండ ప్రాజెక్టు భరోసా ఇవ్వనుంది. ఒకప్పుడు రాయలసీమ కంటే తీవ్ర కరువు కాటకాలకు చిరునామాగా నిలిచిన మార్కాపురం ప్రాంతానికి ఇప్పుడు వెలిగొండ జలాలు కొత్త ఆశలు తీసుకొస్తున్నాయి. ఇప్పటివరకు వర్షం కోసం ఆకాశం వైపు చూసిన రైతన్నలు.. ఇక నీటి కోసం కాలువల వైపు చూడనున్నారు. బోరుబావి పని చేస్తుందో లేదోనని ఆందోళన చెందిన రైతులు.. ఇక ఏ పంట వేయాలా అని ఆలోచించనున్నారు. ఇక ఈ నేల నుంచి వలసలు ఆగనున్నాయి.
కీలక ఘట్టాలు
1985లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వెలిగొండ ప్రాజెక్టు ప్రతిపాదనను ఉమ్మడి ప్రకాశం జిల్లాల నేతలు తీసుకువెళ్లారు.
1994లో ఈ ప్రాజెక్టు సమగ్ర నివేదిక సిద్ధమైంది.
1996 మార్చి 5వ తేదీన ముఖ్యమంత్రిగా
చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టుకు భూమి పూజ చేశారు.
1998లో ఇంజనీర్-సలహాదారు రామకృష్ణయ్య ప్రాజెక్టు ప్రాథమిక నివేదిక తయారు చేశారు.
1998లో సుంకేసుల, గొట్టిపడియ ఆనకట్టలకు రూ.138 కోట్లతో పాలనా అనుమతులు.
1999లో సుంకేసుల గ్యాప్ పనులు ప్రారంభం
ఈ వార్తలను కూడా చదవండి