నీళ్లపై నిప్పులు!
ABN , Publish Date - Sep 05 , 2026 | 04:54 AM
తెలుగు రాష్ట్రాలపై ఎల్‌నినో తీవ్ర ప్రభావం చూపుతోంది. నైరుతి సీజన్‌లో మూడు నెలలు ముగిసిపోయింది. అయినా... సరైన చినుకు జాడే లేదు. ఎగువ రాష్ట్రాలు కర్ణాటక, మహారాష్ట్రలో కురిసిన వర్షాలకు శ్రీశైలం జలాశయానికి ఓ మోస్తరుగానే వరద చేరింది.
సాగు పేరుతో రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం
ఎల్‌నినో దెబ్బతో కృష్ణా ప్రాజెక్టులకు కష్టకాలం
ఈసారి తాగునీటి అవసరాలకే ప్రాధాన్యం
సాగునీరు ఇవ్వలేని దైన్యంపై ప్రభుత్వ ప్రకటన
ఒక్క విడత కూడా నిండని శ్రీశైలం జలాశయం
నాగార్జున సాగర్‌దీ అదే పరిస్థితి
వచ్చే సీజన్ దాకా ప్రతి చుక్కా ముఖ్యమే
ఆ దిశగానే ప్రభుత్వం చర్యల
(కర్నూలు - ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాలపై ఎల్‌నినో తీవ్ర ప్రభావం చూపుతోంది. నైరుతి సీజన్‌లో మూడు నెలలు ముగిసిపోయింది. అయినా... సరైన చినుకు జాడే లేదు. ఎగువ రాష్ట్రాలు కర్ణాటక, మహారాష్ట్రలో కురిసిన వర్షాలకు శ్రీశైలం జలాశయానికి ఓ మోస్తరుగానే వరద చేరింది. ఒక్క విడత కూడా గేట్లు ఎత్తి కిందికి నీరు విడుదల చేయలేని పరిస్థితి! ఉన్న నీటిని జలాశయాల్లో భద్రపరిచి తాగునీటి అవసరాల కోసం వినియోగించాలని కూటమి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ‘‘ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకోండి. ఈ ఏడాది ఆయకట్టు సాగుకు నీరు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాం’’ అని అధికార యంత్రాంగం పదేపదే విజ్ఞప్తి చేస్తోంది. వాస్తవ పరిస్థితులు ఇలా ఉండగా... ‘‘శ్రీశైలంలో నీళ్లు పుష్కలంగా ఉన్నప్పటికీ సాగునీరు ఇవ్వడంలేదు’’ అంటూ రైతులను వైసీపీ రెచ్చగొడుతోంది. రైతుల పేరుతో రోడ్లెక్కుతోంది. జల రాజకీయం చేస్తోంది. 2023లో ఇలాంటి పరిస్థితే తలెత్తినప్పుడు... నాడు అధికారంలోని వైసీపీ నాయకులు సాగుకు నీరివ్వలేమని నంద్యాల ఐఏబీ సమావేశంలో తేల్చి చెప్పారు. ఇప్పుడేమో... ‘సాగుకు నీరివ్వాల్సిందే’ అని రచ్చ చేస్తున్నారు. సున్నితమైన అంశాన్నీ రాజకీయాలకు వాడుతున్నారు.
శ్రీశైలమే ఇలా...
తెలుగు రాష్ట్రాల తాగు, సాగునీటిని తీర్చే ప్రధాన వనరు.. శ్రీశైలం జలాశయం. సహజంగా ప్రతి ఏటా జూన్‌లోనే వరద పోటెత్తుతుంది. కానీ... ఈసారి జూలై 29న వరద ప్రారంభమైంది. ఈ నెల రోజుల్లో శ్రీశైలానికి 211.52 టీఎంసీలు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో ఒక్కవిడత కూడా నిండలేదు. అయినప్పటికీ... డ్యామ్ లెవెల్ 855 అడుగులు దాటిన తర్వాత రాయలసీమ జలాశయాలు నింపాలనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా శ్రీశైలం కుడిగట్టు ప్రధాన కాలువ (ఎస్‌ఆర్‌ఎంసీ)కు నీటి విడుదల చేపట్టింది. అదే క్రమంలో హంద్రీనీవా కాలువకు నంద్యాల జిల్లాలోని మాల్యాల ఎత్తిపోతల పథకం నుంచి కృష్ణా జలాలు ఎత్తిపోతలు చేపట్టారు. తెలంగాణ వైపు విద్యుదుత్పత్తి కోసం నీటిని విడుదల చేసుకుంటుండగా... ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమ దాహార్తిని తీర్చేందుకు నీళ్లు విడుదల చేస్తున్నారు. ఇప్పటి వరకు పోతిరెడ్డిపాడు నుంచి నుంచి 18.13 టీఎంసీలు, హంద్రీనీవా కాలువ ద్వారా 6.36 టీఎంసీలు కలిపి 24.49 టీఎంసీలు విడుదల చేశారు. ప్రస్తుతం రోజుకు ఎనిమిది వేల క్యూసెక్కులు తీసుకుంటున్నారు. ఇదంతా... తాగునీటి అవసరాలకు మాత్రమే అని అధికార యంత్రాంగం స్పష్టం చేసింది. అటు... తెలంగాణ రాష్ట్రం మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకం ద్వారా 7.21 టీఎంసీలు ఎత్తిపోసుకుంది. అదే క్రమంలో విద్యుత్ ఉత్పత్తి పేరిట తెలంగాణ ప్రభుత్వం 56.83 టీఎంసీలు, ఏపీ ప్రభుత్వం 6.36 టీఎంసీలు... మొత్తంగా 67.96 టీఎంసీలు వదిలేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) భేటీలోనూ చర్చ తాగునీటి అవసరాల మీదే జరిగింది. ఉన్న నీటిని తాగు అవసరాలకోసం ఎలా పంచుకోవాలన్నదానిపైనే ఇరు రాష్ట్రా లు వాదనలు వినిపించాయి. సాగునీటి ప్రస్తావనే రాలేదు.
వైసీపీ తీరు అప్పుడలా.. ఇప్పుడిలా!
అధికారంలో ఉంటే ఒక మాట.. ప్రతిపక్షంలో ఉంటే మరో మాట! సీమకు సాగునీటి విడుదలపై వైసీపీ నాయకుల ద్వంద్వ వైఖరి ఇది. జగన్ సీఎంగా ఉండగా... 2023లో కూడా వర్షభావంతో ఇలాంటి పరిస్థితులో తలెత్తాయి. ఆ ఏడాదంతా కలిపి 141 టీఎంసీలు మాత్రమే శ్రీశైలానికి చేరాయి. ఆ ఏడాది ఆగస్టు 9న నంద్యాలలో ఉమ్మడి కర్నూలు జిల్లా సాగునీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం అనుమతి ఇస్తే తప్పా సాగునీరు ఇవ్వలేమని ఏక వ్యాక్య తీర్మానంతో భేటీ ముగించారు. నాడు తాము చేసిన పనిని సమర్థించుకున్న అదే పార్టీ నేతలు.... నేడు జలరాజకీయాలకు తెరతీయడం వారి నైజానికి నిదర్శనం అని కూటమి నాయకులు పేర్కొంటున్నారు.
నాగార్జున సాగర్‌లో...
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేస్తేనే నాగార్జున సాగర్‌కు చేరేది. శ్రీశైలమే నిండకుంటే సాగర్ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. సాగర్ గరిష్ఠ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 179.38 టీఎంసీలు ఉన్నాయి. జలాశయం నుంచి ఏపీ, తెలంగాణ రెండూ కేవలం తాగునీటి అవసరాల కోసం చెరో రెండువేల క్యూసెక్కులు మాత్రం తీసుకుంటున్నాయి. ఈ నీటితో చెరువులు నింపుతున్నారు.
ఇదీ సీమ ప్రాజెక్టుల పరిస్థితి...
రాయలసీమ జిల్లాల్లో దాదాపు 54 చిన్న, పెద్ద, మధ్యస్థ జలాశయాలు ఉన్నాయి. వాటి సామర్థ్యం 158.259 టీఎంసీలు. ఇవన్నీ నిండితే... డెడ్ స్టోరేజీ 17.128 టీఎంసీలు పోనూ 141.131 టీఎంసీలు వినియోగించుకోవచ్చు. కానీ... ఇప్పుడు ఆయా జలాశయాల్లో 70.523 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి. అంటే... డెడ్ స్టోరేజీ పోను వినియోగానికి అందుబాటులో ఉన్నది 56 టీఎంసీలే. అందులో ఒక్క కడప జిల్లాలో మాత్రం 29.415 టీఎంసీల నిల్వ ఉంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన జలాశయాల నీటి నిల్వ సామర్థ్యం 1014 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 578 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి.
ఈ వార్తలను కూడా చదవండి
ఒకే గ్రామంలో ఇద్దరు గురువులకు అవార్డులు