Share News

ఏకగ్రీవం జరిగిందా.. టికెట్‌ కట్‌!

ABN , Publish Date - Aug 26 , 2026 | 04:28 AM

స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామాల్లో శాంతియుత వాతావరణం నెలకొనేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వమే ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తోంది. ఏకగ్రీవం అయ్యే స్థానిక సంస్థలకు నగదు ప్రోత్సాహకాలను కూడా ఇస్తోంది.

ఏకగ్రీవం జరిగిందా.. టికెట్‌ కట్‌!
Jagan


  • స్థానిక సంస్థల ఎన్నికలపై వైసీపీ

  • సెగ్మెంట్‌ ఇన్‌చార్జిలకు జగన్‌ వార్నింగ్‌

  • ఏకగ్రీవం జరిగేందుకు వీల్లేదని హుకుం

  • తాడేపల్లిలో ఎమ్మెల్యేలు, నేతలతో భేటీ

  • వైసీపీ పాలనలో బలవంతపు ఏకగ్రీవాలు

  • నాడు ప్రత్యర్థి పార్టీల నేతలపై దాడులు

  • నేడు ఏకగ్రీవాలపై హెచ్చరికలు

  • స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలు కామన్‌

  • కేంద్ర ప్రభుత్వమే ప్రోత్సహిస్తున్న వైనం

అమరావతి, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడా ‘ఏకగ్రీవం’ అనే మాటే వినిపించరాదని వైసీపీ అధినేత జగన్‌ ఆ పార్టీ నేతలకు తేల్చిచెప్పారు. ఎక్కడైనా ఏకగ్రీవమైతే.. దానికి సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతవహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అంతేకాదు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఏకగ్రీవమైన నియోజకవర్గంలో ఇన్‌చార్జికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్‌ ఉండదని బెదిరింపు ధోరణిలో తేల్చి చెప్పారు. స్థానిక సంస్థల్లో వైసీపీ అభ్యర్థులు

పోటీ చేయాల్సిందేనని, పంచాయతీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ.. ప్రతి స్థానంలోనూ వైసీపీ నుంచి బలమైన అభ్యర్థి ఉండాలన్నారు. ఈ మేరకు మంగళవారం వైసీపీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఇతర ముఖ్య నేతలతో తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో జగన్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన హెచ్చరికలతో కూడిన ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడా ఏకగ్రీవాలు జరగడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు బలమైన అభ్యర్థులు ముందుకు రాకపోతే.. అసెంబ్లీ ఇన్‌చార్జి బంధువులనైనా రంగంలోకి దింపాలని సూచించారు. నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగితే.. వైసీసీ ఘన విజయం సాధిస్తుందని జగన్‌ అన్నారు. ఎన్నికల విషయంలో పార్టీ నేతలెవరూ ‘ఇగో’కు పోవద్దని, సోషల్‌ మీడియాను వాడుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. స్థానిక ఎన్నికల్లో పోలీసులతో దౌర్జన్యాలు చేయించడం చంద్రబాబుకు అలవాటని, ఇప్పుడు కూడా పోలీసులను ప్రయోగిస్తారని అన్నారు. వైసీపీ అభ్యర్థులు పోటీ చేయకుండా నిలువరించే పోలీసుల పేర్లను ‘డిజిటల్‌ బుక్‌’లోకి ఎక్కిస్తామని హెచ్చరించాలని నేతలకు జగన్‌ సలహా ఇచ్చారు. మరో మూడేళ్లలో చంద్రబాబు పాలన అయిపోతుందని, వచ్చే ఐదేళ్లలో వారు ఎలా పనిచేస్తారో చూస్తామంటూ పోలీసులను హెచ్చరించాలన్నారు.


నాటి మాట మరిచారా?.. స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామాల్లో శాంతియుత వాతావరణం నెలకొనేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వమే ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తోంది. ఏకగ్రీవం అయ్యే స్థానిక సంస్థలకు నగదు ప్రోత్సాహకాలను కూడా ఇస్తోంది. కాగా, ఇప్పుడు ఏకగ్రీవం అయుతే ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వనని హెచ్చరిస్తున్న జగన్‌.. తన హయాంలో మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల్లో ‘అన్ని స్థానాలూ ఏకగ్రీవం’ కావాలని పార్టీ నేతల ను ఆదేశించారు. ప్రత్యర్థి పార్టీల నాయకులు ఎవరైనా నామినేషన్లు వేసేందుకు సిద్ధమైతే.. వారి నుంచి పత్రాలు లాక్కొని చించేశారు. పంచాయతీ, మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌, మునిసిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైన ప్రత్యర్థి పార్టీల నేతల ఇంటి ముందు పోలీసులతో పహారా పెట్టారు. కొన్ని కొన్ని చోట్ల ప్రత్యర్థులపై వైసీపీ నేతలు దా డులు కూడా చేశారు. మెజారిటీ స్థానాలు ఏకగ్రీవమయ్యే లా చేశారు. దీనిని తన పాలనకు ప్రజలు ఇచ్చిన మద్దతు గా జగన్‌ అప్పట్లో అభివర్ణించారు. అధికారంలో ఉన్నప్పు డు స్థానిక సంస్థల ఎన్నికలన్నీ ఏకగ్రీవం కావాలన్న జగన్‌.. ఇప్పుడు ఏకగ్రీవాలపై హెచ్చరికలు చేయడం గమనార్హం.

ఈ వార్తలను కూడా చదవండి

జైల్లో ఉండాల్సిన వ్యక్తి ఆసుపత్రిలో.. పక్కనే గర్ల్‌ఫ్రెండ్!

ఫాలోఆన్‌ తప్పేనా?

Updated Date - Aug 26 , 2026 | 04:28 AM