Share News

ఫాలోఆన్‌ తప్పేనా?

ABN , Publish Date - Aug 26 , 2026 | 04:18 AM

భారత్‌-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. తొలి రెండు రోజులు భారత్‌ ఆధిపత్యం చూపగా.. మూడో రోజు మంగళవారం మాత్రం ఆతిథ్య లంక బ్యాటర్లు...

ఫాలోఆన్‌  తప్పేనా?

  • లంక తొలి ఇన్నింగ్స్‌ 265/8

  • ప్రసిద్ధ్‌, మానవ్‌లకు మూడేసి వికెట్లు

కొలంబో: భారత్‌-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. తొలి రెండు రోజులు భారత్‌ ఆధిపత్యం చూపగా.. మూడో రోజు మంగళవారం మాత్రం ఆతిథ్య లంక బ్యాటర్లు పట్టుదల ప్రదర్శించారు. ఆరంభంలోనే టపటపా వికెట్లు కోల్పోయిన దశలో పసిందు సూరియబందర (80) అడ్డుగా నిలిచాడు. ఆ తర్వాత టెయిలెండర్లతో కలిసి మిడిలార్డర్‌ బ్యాటర్‌ సోనాల్‌ దినుష (85 బ్యాటింగ్‌) భారత బౌలర్లను విసిగించాడు. ఈ ఇద్దరి పోరాటంతో లంక తొలి ఇన్నింగ్స్‌లో 83.4 ఓవర్లలో 265/8 స్కోరు చేసింది. కమిందు మెండిస్‌ (35) ఫర్వాలేదనిపించాడు. క్రీజులో సోనాల్‌కు జతగా లాహిరు కుమార (8 బ్యాటింగ్‌) ఉన్నాడు. వర్షం కారణంగా ఆటను కాస్త ముందుగానే ముగించారు. అయితే ఇప్పటికీ లంక ఫాలోఆన్‌ తప్పించుకోవాలంటే మరో 38 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో రెండు వికెట్లు మాత్రమే ఉండడంతో బుధవారం తొలి సెషన్‌ కీలకం కానుంది. ప్రస్తుతం భారత్‌ 238 పరుగుల ఆధిక్యంతో పటిష్ట స్థితిలోనే ఉంది. ప్రసిద్ధ్‌, మానవ్‌లకు మూడేసి వికెట్లు దక్కాయి. అరంగేట్ర స్పిన్నర్‌ సారాంశ్‌ జైన్‌ పరుగులు నియంత్రించినా వికెట్‌ తీయలేకపోయాడు.

ఆదుకున్న పసిందు: 8/2 ఓవర్‌నైట్‌ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన లంకను పేసర్‌ ప్రసిద్ధ్‌ చక్కటి పేస్‌, అదనపు బౌన్స్‌తో ఇబ్బందిపెట్టాడు. ముందుగా కమిల్‌ (19)ను అవుట్‌ చేశాడు. అయితే 35/3 స్కోరుతో కష్టాల్లో పడిన జట్టును పసిందు ఆదుకున్నాడు. ఓవైపు సర్ఫరాజ్‌, సిరాజ్‌ల నుంచి స్లెడ్జింగ్‌ ఎదురైనా ఏకాగ్రత కోల్పోలేదు. అతడికి కమిందు మెండిస్‌ సహకరించడంతో ఈ జోడీ నాలుగో వికెట్‌కు 87 పరుగుల భాగస్వామ్యం ఏర్పరచింది. అలాగే ఈ సెషన్‌లో లంక 122 పరుగులు జత చేసింది. పసిందు హాఫ్‌ సెంచరీ సాధించగా, ప్రసిద్ధ్‌ రెండు వికెట్లు తీశాడు.


సోనాల్‌ పట్టుదల: లంచ్‌ బ్రేక్‌ తర్వాత భారత బౌలర్లు ప్రభావం చూపారు. మూడు వికెట్లు తీయడంతో పాటు సోనాల్‌ ఒంటరి పోరాటం కారణంగా లంక 88 పరుగులే చేయగలిగింది. కెప్టెన్‌ ధనంజయ (8)ను ఆరంభంలోనే మానవ్‌ అవుట్‌ చేయగా, కాసేపటికే సెంచరీ ఖాయమనుకున్న పసిందును జడేజా బౌల్డ్‌ చేశాడు. డిక్‌వెల్లా సిరాజ్‌ ఓవర్‌లో డకౌటయ్యాడు. ఇలా 173 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోవడంతో లంక ఆలౌట్‌కు ఎంతో సమయం పట్టదనిపించింది. కానీ టెయిలెండర్లను అండగా చేసుకుని సోనాల్‌ అద్భుతంగా పోరాడాడు. తనకు తొమ్మిదో నెంబర్‌ బ్యాటర్‌ కేశర (18) నుంచి కీలక సహకారం అందింది. ఇద్దరూ చివరి సెషన్‌లో భారత బౌలర్లను విసిగించారు. ఈక్రమంలో కేశర 74 బంతులు ఎదుర్కోవడం విశేషం. ఎనిమిదో వికెట్‌కు 57 పరుగులు జోడించాక కేశర వెనుదిరిగాడు. ఆ తర్వాత కూడా భారత్‌కు ఊరట దక్కలేదు. ప్రస్తుతం క్రీజులో ఉన్న లాహిరు కుమార ఇప్పటికే 50 బంతులు ఎదుర్కోవడం విశేషం. 84వ ఓవర్‌లో వర్షం కురవడంతో మ్యాచ్‌ను ముగించారు. సోనాల్‌-కుమార జోడీ అజేయంగా తొమ్మిదో వికెట్‌కు 35 పరుగులు జోడించింది.

స్కోరుబోర్డు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 503/9 డిక్లేర్‌

శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌: ఉడార (సి) జైస్వాల్‌ (బి) ప్రసిద్ధ్‌ 1, కమిల్‌ (సి) జురెల్‌ (బి) ప్రసిద్ధ్‌ 19, ప్రభాత్‌ (ఎల్బీ) మానవ్‌ 2, పసిందు (బి) జడేజా 80, కమిందు (సి) జడేజా (బి) ప్రసిద్ధ్‌ 32, ధనంజయ (సి) రాహుల్‌ (బి) మానవ్‌ 8, సోనాల్‌ (బ్యాటింగ్‌) 85, డిక్‌వెల్లా (సి) జురెల్‌ (బి) సిరాజ్‌ 0, కేశర (సి) సారాంశ్‌ (బి) మానవ్‌ 18, లాహిరు కుమార (బ్యాటింగ్‌) 8; ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: 83.4 ఓవర్లలో 265/8. వికెట్ల పతనం: 1-1, 2-8, 3-35, 4-122, 5-137, 6-171, 7-173, 8-230. బౌలింగ్‌: సిరాజ్‌ 11-0-33-1, ప్రసిద్ధ్‌ 14-1-47-3, మానవ్‌ 21-1-83-3, సారాంశ్‌ 18-5-51-0, జడేజా 19.4-4-45-1.

ఈ వార్తలనూ చదవండి:

ఏడేళ్ల తర్వాత భారత్‌కు జిన్‌పింగ్.. బ్రిక్స్ సదస్సుకు 400 మందితో భారీ బృందం..

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి సంబంధించిన అరుదైన వీడియో విడుదల!

Updated Date - Aug 26 , 2026 | 04:18 AM