పీఎస్ఆర్ ఇంట్లో ఈడీ సోదాలు
ABN , Publish Date - Nov 05 , 2026 | 06:00 AM
వైసీపీ హయాంలో జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు దూకుడు పెంచారు.
మాజీ ఐపీఎస్‌ను విచారించిన అధికారులు
వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్-1 పత్రాల
మూల్యాంకనం అక్రమాల కేసులో దూకుడు
క్యామ్‌సైన్, హాయ్‌ల్యాండ్ సహా 7 చోట్ల తనిఖీలు
పీఎస్ఆర్ ఇంట్లో రెండు ఆధారాలు..
ఓ మహిళ ఇంట్లో డిజిటల్ రికార్డులు స్వాధీనం
‘ప్రైవేట్’ ఆధీనంలో 84 రోజుల పాటు పత్రాలు
66 మంది అనర్హులతో పేపర్లు దిద్దించారు
ముందే నిర్ణయించిన మార్కులు వేయించారు!
ఈ క్రమంలో రూ.కోట్ల మనీలాండరింగ్‌పై దృష్టి
హైదరాబాద్/అమరావతి/మంగళగిరి, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు దూకుడు పెంచారు. మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేపట్టిన అధికారులు.. బుధవారం ఏపీపీఎస్సీ మాజీ కార్యదర్శి, మాజీ ఐపీఎస్ అధికారి పీఎ్‌సఆర్ ఆంజనేయులు ఇంట్లో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. అలానే ఆయనను సుదీర్ఘంగా విచారించారు. హైదరాబాద్ జోనల్ ఈడీ అధికారులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏడు చోట్ల సోదాలు నిర్వహించారు.
పీఎస్ఆర్ ఆంజనేయులు నివాసంతో పాటు.. మూల్యాంకనం బాధ్యతలు చేపట్టిన క్యామ్‌సైన్ సంస్ధ కార్యాలయం, ఆ సంస్ధ ఎండీ మధుసూదన్‌రావు(ధాత్రి మధు) నివాసం, గుంటూరు జిల్లా చినకాకానిలోని హయ్‌ల్యాండ్ రిసార్టు, ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన మరో మహిళ ఇంట్లో కూడా అధికారులు సోదాలు నిర్వహించి పలు పత్రాలను పరిశీలించారు. ఈ క్రమంలో పీఎస్ఆర్ ఆంజనేయులు అత్యంత రహస్యంగా దాచిన ఆధారాలను సేకరించినట్టు తెలిసింది. మూల్యాంకనం ప్రక్రియలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో పాటు ప్రభుత్వ నిధులను ప్రైవేటు సంస్థకు అక్రమంగా చెల్లించడం, ఈ క్రమంలో మనీలాండరింగ్‌కు పాల్పడడం వంటి ఆరోపణలపై ఈడీ అధికారులు అనుమానితుల ఇళ్లల్లో పత్రాలను, ఆర్ధిక లావాదేవీలను పరిశీలించారు.
రంగారెడ్డి జిల్లా ఖాసింబౌలిలోని పీఎస్ఆర్ నివాసం, బంజారాహిల్స్‌లోని క్యామ్‌సైన్ కార్యాలయంలో, ఎర్రమంజిల్‌లోని సంస్ధ ఎండీ మధుసూదన్ నివాసంలో, సికింద్రాబాద్ ఢిఫెన్స్ కాలనీలోని స్టోన్ మీడియా అడ్వయిజరీ, ట్రూగ్రేడర్ సర్వీసెస్ కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలు, ఎలక్ర్టానిక్, డిజిటల్ సాక్ష్యాధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. నేరేడ్‌మెట్‌లోని ఆకెళ్ల పేరి శ్రీనివాసరావు, అల్వాల్ వెంకటాపురంలో మహంకాళి రఘురామ్ ఇంట్లోనూ ఈడీ అధికారులు సుదీర్ఘ తనిఖీలు చేశారు. సేకరించిన ఆధారాలను ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపనున్నట్లు తెలిసింది. గ్రూప్-1 జవాబు పత్రాల మూల్యాంకనం జరిగిన హయ్‌ల్యాండ్ రిసార్ట్‌లో రికార్డులను పరిశీలించారు. జవాబు పత్రాల మూల్యాంకనంలో క్యామ్‌సైన్ సంస్ధ కీలక పాత్ర పోషించినట్లు ఇప్పటికే సిట్ విచారణలో వెల్లడైంది.
నిబంధనలకు విరుద్ధంగా
మూల్యాంకనం నిబంధనలకు విరుద్ధంగా 84 రోజులపాటు జవాబు పత్రాలను ప్రైవేటు సంస్ధ అధీనంలో ఉంచినట్టు అధికారులు గుర్తించారు. అలానే, మూల్యాంకనం కోసం 66 మంది అర్హతలేని వ్యక్తులను వినియోగించడం, మూల్యాంకనం పూర్తిగా చేయకుండా ముందే నిర్ణయించిన మార్కులను ఓఎంఆర్ షీట్లలో నమోదు చేయడం వెనుక కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారి ఉంటాయని ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు.
క్యామ్‌సైన్ మీడియాకు చెల్లించిన రూ.1.14 కోట్ల ప్రభుత్వ నిధులు ఏవిధంగా ఆ సంస్ధకు వెళ్లాయి?. ఒప్పందాల వివరాలు, బ్యాంకు లావాదేవీల వివరాలను పరిశీలించారు. 169 పోస్టుల భర్తీలో మాన్యువల్ మూల్యాంకనం చేపట్టడంతో భారీగా ఆర్థిక లావాదేవీలు జరిగాయన్న ఆరోపణలను ఈడీ అధికారులు పరిశీలించినట్లు తెలుస్తోంది. బుధవారం సోదాలు నిర్వహించిన సమయంలో పీఎస్ఆర్‌తో పాటు మధుసూదన్‌రావు ఇతరుల వాంగ్మూలాలను ఈడీ అధికారులు నమోదు చేశారు. .
సిట్ పేర్కొన్న అంశాలపైనే..
జవాబు మూల్యాంకనం కోసం క్యామ్‌సైన్ మీడియాకు రూ 1.14 కోట్లు, డిజిటల్ మూల్యాంకన సంస్థలకు రూ.1.38 కోట్లు చెల్లించినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. అంతేకాకుండా మూల్యాంకన పత్రాల్లో 287 బార్‌కోడ్ అసమానతలు, 169 స్లిప్పుల్లో కరెక్షన్ ఫ్లూయిడ్ వినియోగం వంటివాటిని సిట్ గుర్తించింది. ఈ కేసులో 173 మంది సాక్షులను విచారించి ఫోరెన్సిక్ ఆధారాలను సైతం సిట్ పరిశీలించింది.
ఈ అక్రమాలపై 2025 ఏప్రిల్‌లో పోలీసు కేసు నమోదు కాగా, పీఎస్ఆర్ ఆంజనేయులు క్యామ్‌సైన్ మీడియా డైరెక్టర్ మధుసూదన్‌రావును గతంలో అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం హైకోర్టులో విచారణలో ఉంది. సిట్ దర్యాప్తు నేపధ్యంలో అక్టోబరులో మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసి తాజాగా ఈ సోదాలను చేపట్టింది.
ఈ వార్తలనూ చదవండి:
ఎన్నికల కమిషనర్లకు జీవితకాల చట్టపరమైన రక్షణ.. సుప్రీంకోర్టులో పిటిషన్
ఫోర్జరీ, చీటింగ్ కేసులో సులోచన సహా ముగ్గురికి రిమాండ్