గుడ్ న్యూస్.. ఆగస్టు చివరి నాటికి ఆ ప్రాజెక్టుల లెఫ్ట్ మెయిన్ కెనాళ్లు ప్రారంభం: మంత్రి నిమ్మల..
ABN , Publish Date - Aug 14 , 2026 | 05:26 PM
ఆగస్టు నెలాఖరులోగా వెలిగొండ, పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాళ్లను ప్రారంభించి నీరందిస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గొడ్డలి పార్టీ ఐదేళ్లపాటు విధ్వంసం చేసిన ఇరిగేషన్ రంగానికి ప్రస్తుతం పునర్జీవం పోస్తూ ముందుకెళ్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
అమరావతి: ఆగస్టు నెలాఖరులోగా వెలిగొండ, పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాళ్లను ప్రారంభించి నీరందిస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ నెల 17 నుంచి 24వ తేదీ వరకు వెలిగొండ నిర్వాసితులకు పెండింగ్ పరిహారం రూ.600 కోట్లు చెల్లిస్తామని వెల్లడించారు. గొడ్డలి పార్టీ ఐదేళ్లపాటు విధ్వంసం చేసిన ఇరిగేషన్ రంగానికి ప్రస్తుతం పునర్జీవం పోస్తూ ముందుకెళ్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
పోలవరం ప్రాజెక్టులో 77 శాతం పనులు పూర్తయ్యాయని, ఆ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగానూ తీర్చిదిద్దుతామని మంత్రి నిమ్మల చెప్పారు. పోలవరం నుంచి భద్రాచలం వరకు రివర్ బేస్‌డ్ పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలన్నది సీఎం చంద్రబాబు ఆలోచన అని తెలిపారు. పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ నీటిని ఈ నెలాఖరులోగా అనకాపల్లికి తీసుకెళ్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కెనాల్ ద్వారా ఉత్తరాంధ్రకు పుష్కలంగా నీరందుతుందని మంత్రి భరోసా ఇచ్చారు. డేటా సెంటర్లు, ఇతర పారిశ్రామిక అవసరాలకు మూడు టీఎంసీల నీటిని లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా అందిస్తే సరిపోతుందని తెలిపారు.
రానున్న రోజుల్లోనూ ప్రాధాన్యంగా భావిస్తున్న 36 ప్రాజెక్టులను షెడ్యూల్ ప్రకారం పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ఎల్‌నినో ప్రభావం దృష్ట్యా తాగునీటికి మాత్రమే తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
అసెంబ్లీ వర్షాకాల సమావేశాల భద్రతపై కో-ఆర్డినేషన్ సమావేశం
పాదగయ క్షేత్రానికి పవన్ సతీమణి.. ఆలయంలో ప్రత్యేక పూజలు