Share News

తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలు.. రాజమహేంద్రవరం విమానాశ్రయంలో విమానాల ఆలస్యం..

ABN , Publish Date - Sep 24 , 2026 | 12:55 PM

ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో తూర్పు గోదావరి జిల్లాలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బస్సులు, రైళ్లు, విమాన సర్వీసులు ఆలస్యమవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలు.. రాజమహేంద్రవరం విమానాశ్రయంలో విమానాల ఆలస్యం..
Rajamahendravaram Airport

తూ.గో. జిల్లా: ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పోలవరం సహా పలు జిల్లాల్లో విపరీతంగా వానలు పడుతున్నాయి. చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నదులకు పెద్దఎత్తున వరదనీరు పోటెత్తుతోంది. ఈ నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బస్సులు, రైళ్లు, విమాన సర్వీసులు ఆలస్యమవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


భారీ వర్షాల కారణంగా రాజమహేంద్రవరం విమానాశ్రయంలో పలు సర్వీసుల రాకపోకలు ఆలస్యమయ్యాయి. ఈరోజు (గురువారం) హైదరాబాద్ నుంచి స్థానిక ఎయిర్‌పోర్టుకు రావాల్సిన విమానం ఆలస్యమైంది. మధ్యాహ్నం ఒంటి గంటకు రావాల్సిన FLY-91 విమాన సర్వీసు గంట ఆలస్యమైంది. అదే సంస్థకు చెందిన మరో విమానం నిన్న రాత్రి రాజమహేంద్రవరానికి చేరుకున్నా వాతావరణం అనుకూలించకపోవడంతో 3 గంటల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఎంతసేపు ఎదురు చూసినా పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో చివరికి పైలట్ విమానాన్ని బెంగళూరుకు మళ్లించారు. దీంతో ప్రయాణికులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.


మరోవైపు, వాయుగుండం ప్రభావంతో జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, రోడ్లపై చెట్లు విరిగిపడటం వంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అనపర్తి-పొలమూరు రోడ్డులో ఎర్రకాలువ వంతెనపై పెద్ద చెట్టు కూలిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎర్రకాలువ ఉధృతంగా ప్రవహించడంతో నిడదవోలు పరిసర ప్రాంతాల్లో పలు రహదారులపైకి వరదనీరు చేరింది. సింగవరం-తాళ్లపాలెం రోడ్డుపైకి నీరు చేరి రాకపోకలు నిలిచిపోయాయి. రాజమహేంద్రవరం హైటెక్ బస్టాండ్ సెంటర్, రైల్వే స్టేషన్ రహదారులు కూడా నీట మునిగాయి.


ఈ వార్తలు కూడా చదవండి

తీవ్ర వాయుగుండం.. 24x7 అత్యంత అప్రమత్తంగా ఉండాలి: మంత్రి జనార్దన్ రెడ్డి

వాయుగుండం ఎఫెక్ట్.. ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షాలు.. కలెక్టర్ కీలక ఆదేశాలు

Updated Date - Sep 24 , 2026 | 12:59 PM