దేవరపల్లి ఆశ్రమ బాలుర హాస్టల్ విద్యార్ధుల అస్వస్థతపై సీఎం సీరియస్
ABN , Publish Date - Feb 08 , 2026 | 06:36 PM
దేవరపల్లి ఆశ్రమ బాలుర హాస్టల్ విద్యార్థుల అస్వస్థతపై సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారు. రేపటిలోగా సమగ్ర నివేదిక సమర్పించాలని.. ఆహార పదార్థాల తయారీలో నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అమరావతి, ఫిబ్రవరి 8: ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం జిల్లా మారేడుమిల్లి మండలం దేవరపల్లి గిరిజన ఆశ్రమ బాలుర వసతి గృహంలో (హాస్టల్) విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అధికారులతో ఇవాళ (ఆదివారం) అమరావతిలో సమీక్ష నిర్వహించారు. రేపటిలోగా (ఫిబ్రవరి 9) సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు. నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు.
సీఎం సమీక్ష & ఆదేశాలు
అమరావతిలోని సచివాలయంలో అధికారులతో ఈ ఘటనపై సమీక్షించిన సీఎం చంద్రబాబు.. విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. 'హాస్టళ్లలో విద్యార్థులకు ఏమైనా జరిగితే ముందుగా సంబంధిత అధికారులను సస్పెండ్ చేసి, తర్వాతే మిగతా విషయాలు చర్చిస్తాను' అని ఆయన హెచ్చరించారు. రేపటిలోగా ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఆహార నాణ్యత, హైజీన్, వంట సిబ్బంది పర్యవేక్షణపై వివరణాత్మక విశ్లేషణ కావాలన్నారు. నిర్లక్ష్యం ఉంటే కఠిన చర్యలు (సస్పెన్షన్, డిపార్ట్‌మెంటల్ ఇన్వెస్టిగేషన్) తీసుకోవాలని సీఎం ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా సరైన ఆహార సరఫరా, ఆరోగ్య పర్యవేక్షణ చర్యలు తీసుకోవాలని హుకుం జారీ చేశారు.
ఘటన నేపథ్యం
దేవరపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల బాలుర హాస్టల్‌లో 92 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, కడుపు నొప్పి, జ్వరం, విరేచనాలు వంటి లక్షణాలు కనిపించాయి. ఇది ఫుడ్ పాయిజనింగ్ వల్లే జరిగినట్టు అధికారులు అంచనా వేశారు. సరిగా వండని.. ఇడ్లీ, సాంబార్.. వంటి ఆహారం వడ్డించడం లేదా హైజీన్ లోపాల వల్ల ఇది జరిగినట్టు ప్రాథమికంగా తేలింది.
అస్వస్థత తీవ్రమవడంతో విద్యార్థులను మొదట మారేడుమిల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, తర్వాత రంపచోడవరం ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం వారందరూ చికిత్స పొందుతున్నారు, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని ఆసుపత్రి అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
భారత్ - మలేషియా నవశకం.. కీలక రంగాలపై ఇరు ప్రధానుల ఒప్పందాలు..
దూసుకొచ్చిన మృత్యువు.. పెళ్లి పత్రికలు పంచడానికి వెళ్తుండగా..