పరామర్శ యాత్రగా కాకుండా, బలప్రదర్శన యాత్రగా చేయడం విడ్డూరం: మంత్రి నిమ్మల
ABN , Publish Date - Jul 31 , 2026 | 06:12 PM
కూటమి ప్రభుత్వం నీరు పారించాలని చూస్తుంటే, గొడ్డలి పార్టీ రక్తాన్ని పారించాలని చూస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. దారిన పోయే దానయ్య చనిపోతే నష్టమేంటని వైఎస్ జగన్ మాట్లాడుతున్నారని చెప్పారు.
కాకినాడ, జులై 31: ప్రపంచంలో ఎక్కడైనా చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించడం చూశాం గానీ, హత్య చేసిన వ్యక్తిని పరామర్శించడం వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కే చెల్లిందని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఎద్దేవా చేశారు. శుక్రవారం కాకినాడ జిల్లాలోని అన్నవరంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఇది పరామర్శ యాత్రగా కాకుండా, బలప్రదర్శన యాత్రగా మాజీ సీఎం జగన్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవ పండగ వాతావరణంలో ఉంటే.. వైఎస్ జగన్ ఓర్వలేనితనంతో అలజడులు సృష్టించాలని చూస్తున్నారని విమర్శించారు.
కూటమి ప్రభుత్వం నీరు పారించాలని చూస్తుంటే, గొడ్డలి పార్టీ రక్తాన్ని పారించాలని చూస్తోందని మంత్రి నిమ్మల మండిపడ్డారు. దారిన పోయే దానయ్య చనిపోతే నష్టమేంటని వైఎస్ జగన్ మాట్లాడుతున్నారని చెప్పారు. దానయ్యకు 45 ఏళ్ళు వచ్చాయి.. వయసైపోయిన వ్యక్తి చనిపోతే నష్టమేంటని ఆయన ప్రశ్నిస్తున్నారని అన్నారు. మరి 54 ఏళ్ళు వచ్చిన గొడ్డలి పార్టీ అధినేతకు కూడా వయసై పోయినట్లే కదా? అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఖాకీ డ్రెస్ అన్నా.. మహిళలన్నా గొడ్డలి పార్టీ నాయకుడికి గౌరవం లేదని విమర్శించారు. ఆడవాళ్ళ జోలికొస్తే అదే ఆఖరి రోజు అని సీఎం చంద్రబాబ వ్యాఖ్యలు.. గొడ్డలి పార్టీకి కూడా వర్తింపచేయాలని ఆయన డిమాండ్ చేశారు.
చనిపోయిన వ్యక్తిని కాదని, చంపిన వ్యక్తిని పరామర్శించడం సరికాదని.. మాజీ మంత్రి బొత్స లాంటి వారు కూడా జగన్‌కు ఎందుకు చెప్పలేకపోయారంటూ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని పాటిస్తామని ప్రమాణం చేసిన వ్యక్తి.. హత్య చేసిన వ్యక్తిని ఓదార్చడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. ఎర్ర బస్సు రాని ఊరికి, ఎయిర్ బస్ ఎందుకని నాడు జగన్ ప్రశ్నించారని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేశారు. కోర్టులకు వెళ్లి మరీ భోగాపురం ఎయిర్ పోర్టు రాకుండా అడ్డుకుంటానని జగన్ చెప్పిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
జగన్‌కున్న క్రెడిట్ చోరీ జబ్బును అందరికీ అంటించాలని చూస్తున్నాడని ఆరోపించారు. పోలవరం నుంచి 3 వేల టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలసిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ధవళేశ్వరంకు ఎగువన నీటి నిల్వ కోసం, ఒక్క ప్రాజెక్టు కూడా లేకపోవడం చూసి సర్ ఆర్థర్ కాటన్ మనవరాలు ఆవేదన చెందారని చెప్పారు. నాడు చంద్రబాబు ప్రతి సోమవారాన్ని పోలవరంగా మార్చుకుని 72 శాతం ప్రాజెక్టు పనులు పూర్తి చేశారని వివరించారు. 2019లో ప్రభుత్వం మారకుండా ఉండి ఉంటే, 2024 నాటికి పోలవరం పూర్తయి అటు ఉత్తరాంధ్రకు, ఇటు రాయలసీమకు గోదావరి జలాలు వెళ్లి ఉండేవని అన్నారు.
ఒక్క ఛాన్స్ అంటూ గొడ్డలి పార్టీ అధికారంలోకి వచ్చి పోలవరాన్ని ధ్వంసం చేసి, డయాఫ్రం వాల్‌ను విధ్వంసం చేశారని మండిపడ్డారు. నాడు ఇరిగేషన్ మంత్రులు, సీఎం, పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమంటూ అసెంబ్లీలోనే చెప్పి, ఆ ప్రాజెక్టును ప్రశ్నార్థకం చేశారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు మొదటి పర్యటన పోలవరంకు వచ్చి 2027 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తయ్యేలా లక్ష్యంగా పెట్టారని వివరించారు. గత ప్రభుత్వంలో విధ్వంసం అయిన డయా ఫ్రం వాల్‌ను పూర్తి చేసి.. ఈసీఆర్ఎఫ్ డ్యాం పనులను వేగవంతం చేశామని అన్నారు. పోలవరం పూర్తయ్యేలోగా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు తీసుకెళ్లేలా నాడు చంద్రబాబు పురుషోత్తమపట్నం లిఫ్ట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారని పేర్కొన్నారు.
పురుషోత్తపట్నం లిప్ట్ ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంత సాగు, తాగునీటి అవసరాలతో పాటు పారిశ్రామిక అవసరాలకు నీరందిస్తున్నామని వివరించారు. 5 ఏళ్ళ గొడ్డలి పార్టీ పాలనలో పోలవరం ఎడమ కాలువ పనుల్లో తట్ట మట్టిగానీ, రూపాయి పని గానీ చేయలేదని వైసీపీని విమర్శించారు. తమ పాలనలో పోలవరం ఎడమ కాలువ పనుల వైపు కన్నెత్తి చూడని గొడ్డలి పార్టీకి ఉత్తరాంధ్ర గురించి మాట్లాడే నైతిక హక్కులేదన్నారు. జగన్ ఇరిగేషన్ శాఖలో రూ.18 వేల కోట్ల బకాయిలు వారసత్వంగా ఇచ్చి వెళ్లారంటూ వైఎస్ జగన్‌పై నిప్పులు చెరిగారు.
ఉత్తరాంధ్రకు న్యాయం చేయాలని రూ.1,800 కోట్లు ఖర్చు పెట్టి పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తి చేస్తున్నామని ఆయన వివరించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు పోలవరం ఎడమ కాలువలో ఉన్న క్లిష్టతరమైన పనులను రెండేళ్ళలోనే పూర్తి చేశామని ప్రకటించారు. ఆగస్టులోనే పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు తీసుకెళ్లాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని వివరించారు. పోలవరం ఎడమ కాలువ పనుల జాప్యం నేపథ్యంలో ఏజెన్సీలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా అయితే చర్యలు తప్పవని అధికారులను మంత్రి నిమ్మల రామానాయుడు హెచ్చరించారు.