ఉమ్మడి ప.గో.జిల్లాలో డీలిమిటేషన్.. నూతన నియోజకవర్గాలు ఎన్నంటే..
ABN , Publish Date - Mar 25 , 2026 | 10:41 AM
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటివరకు 1852, 1962, 1978, 2008 సంవత్సరాల్లో నాలుగుసార్లు నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. 1952లో మొదటిసారి ఉమ్మడి పశ్చిమలో 19 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి.
(ఏలూరు-ఆంధ్రజ్యోతి): దేశంలో పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు, ఏలూరు జిల్లాలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. 2029లో జరిగే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో సామాజిక సమీకరణల్లో భాగంగా తమకు టిక్కెట్లు లభించనున్నాయని పార్టీల్లోని ఆశావహులు అప్పుడే ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటి వరకు నాలుగుసార్లు
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటివరకు 1852, 1962, 1978, 2008 సంవత్సరాల్లో నాలుగుసార్లు నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. 1952లో మొదటిసారి ఉమ్మడి పశ్చిమలో 19 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. 1963 పునర్విభజనలో 17, 1873 పునర్విభజనలో 15 నియోజకవర్గాలు ఏర్పడ్డాయి. 2011 జనగణన ప్రకారం.. జనాభా 37.86 లక్షలు. 2022 ఏప్రిల్ 4న పార్లమెంట్ నియోజకవర్గాల ప్రాతిపదికన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మూడు ముక్కలైంది. నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం పశ్చిమ గోదావరి జిల్లాగాను, ఏలూరు నియోజకవర్గం ఏలూరు జిల్లాగాను మారడంతో వాటి పరిధిలో ఏడేసి అసెంబ్లీ నియోజకవర్గాలుగా విభజించారు. 2022 జిల్లాల విభజన తర్వాత పశ్చిమ జనాభా 17.80 లక్షలు. ఇందులో ఓటర్లు 14 లక్షలు. ఏలూరు జనాభా 30.06 లక్షలు కాగా, ఓటర్లు 16 లక్షలు. ఇప్పుడు ఈ లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి లక్షన్నర నుంచి లక్షా 60 వేల మంది ఓటర్లు ఉంటారని అంచనా.
ఏలూరులో పెరిగేవి రెండు..!
ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఏలూరు, దెందులూరు, ఉంగుటూరు, చింతలపూడి, పోలవరం, నూజివీడు కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో రెండు నియోజకవర్గాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఏలూరు- దెందులూరు మధ్య మరొకటి రావచ్చు. ఏలూరు నగరంలో ఇటీవల ఏడు పంచాయతీలు పెరిగాయి. ఏలూరు రూరల్ మండలంలోని 14 గ్రామాలతోపాటు, దెందులూరు నియోజకవర్గంలో దెందులూరు, పెదవేగి, పెదపాడు మండలాల పరిధిలోని కొన్ని గ్రామాలను కలిపి తీసుకుంటే అదనపు నియోజకవర్గం ఏర్పడనుంది. వాస్తవంగా దెందులూరు నియోజకవర్గం ఇప్పుడు నాలుగున్నర మండలాలతో భారీ విస్తీర్ణం ఉంది. దెందులూరులో 2.23 లక్షల మంది ఓటర్లులున్నారు. జనాభా కూడా దాదాపు 3 లక్షల పైమాటే. దీంతో ఇక్కడ కొత్త నియోజకవర్గం ఏర్పడనుంది. పోలవరం నియోజకవర్గంలోను ఏడు మండలాలున్నాయి. ఇక్కడ సమీప మండలాలను తీసేసి విడిగా జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ కేంద్రంగా జంగారెడ్డిగూడెం నియోజకవర్గంగా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే చింతలపూడి, లింగపాలెం, కామవరపుకోట, జంగారెడ్డిగూడెం రూరల్‌ను చింతలపూడిగా వదిలేసే అవకాశం ఉంది. అటు పోలవరం నియోజకవర్గంలో దాదాపు 3 లక్షలపైనే జనాభా ఉన్నారు. కొన్ని మండలాలను కలిపి జంగారెడ్డిగూడెంకు ఎటాచ్ చేసే అవకాశాలున్నాయి. అప్పుడు ఓటర్ల లెక్కలు సరిపోయే అవకాశం ఉంది. దీనిపై పూర్తి స్వరూపం, విధి విధానాలు వస్తే గానీ వాస్తవ రూపం కొత్త అసెంబ్లీ స్థానాలకు రానుంది.
ఉమ్మడి జిల్లాలో ఓటర్లు..
ఉంగుటూరు నియోజకవర్గంలో 2,06,487మంది ఓటర్ల ఉండగా దెందులూరు 2,24,013, ఏలూరు 2,35,345, నూజివీడు 2,38,081, పోలవరం 2,53,981, చింతలపూడి 2,75,069, కైకలూరు 2,05,804 మంది ఓటర్లు ఉన్నారు. అన్నీ నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 16,37,430 మంది ఓటర్లున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో..
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో భీమవరం, ఉండి, నరసాపురం, పాలకొల్లు, ఆచంట, తణుకు, తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. జిల్లాలో పది నియోజకవర్గాలకు పెరిగే అవకాశం ఉంది. ఆచంట, పాలకొల్లు, నరసాపురం మినహా మిగిలిన నాలుగు నియోజకవర్గాల్లోను రెండు లక్షలకు పైగానే ఓటర్లున్నారు. ఏ మండలం ఏ నియోజకవర్గంలోకి వెళుతుందనే చర్చ మొదలైంది.
భీమవరం రెండు కానుందా...
జిల్లా కేంద్రం భీమవరాన్ని రెండు నియోజకవర్గాలు కానున్నాయి. వన్ టౌన్‌లో కొన్ని గ్రామాలను కలిపి ఒకటి, టూ టౌన్‌లో మరికొన్ని కలిపి మరో నియోజకవర్గం ఏర్పాటు కానుందనే అంచనాలు ఉన్నాయి. ఉండి నియోజకవర్గంలో మండలం భీమవరం-2లో కలవనుంది. ఎప్పటిలాగే వన్ టౌన్‌లో వీరవాసరం మండలాన్ని ఉంచి మరో నియోజకవర్గం ఏర్పాటయ్యే అయ్యే అవకాశం ఉంది. గతంలో వీరవాసరం పాలకొల్లు నియోజకవర్గంలో, పాలకోడేరు భీమవరంలో ఉండేది. భీమవరంలో వీడవాసరాన్ని కలిపారు. పాలకోడేరును ఉండి నియోజకవర్గంలో విలీనం చేశారు. సామాజిక వర్గాల సమీకరణాల్లోను మార్పు చోటు చేసుకుంది. గతంలో క్షత్రియ సామాజికవర్గానికి మూడు నియోజకవర్గాలు ఉండేవి. అక్కడ అదే సామాజిక వర్గానికి ఇవ్వాలన్న తలంపు పార్టీలకు ఉండేది. గత పునర్విభజనలో ఉండి ఒక్కటే ఆ సామాజికవర్గానికి మిగిలింది. ఆశావహులు ఎక్కువ మంది ఉన్నారు. నియోజకవర్గాలు తక్కువయ్యాయి. మరోవైపు నేతల ఆశలు తల్లకిందులయ్యాయి. ఇప్పుడు కొత్త తరం వచ్చింది. టిక్కెట్లను ఆశించే వారి సంఖ్య పెరిగింది. పునర్విభవజనలో నియోజకవర్గాలు పెరిగితే తమకు అవకాశాలు వస్తాయన్న జోష్ నేతల్లో నెలకొంది.
పెరిగే మూడు నియోజకవర్గాలు ఏవి..?
గత పునర్విభజనలో మండలం ఒక్కటైతే, గ్రామాలు మరో నియోజకవర్గంలో ఉండేవి. వీటిని చాలా వరకు సరిదిద్దారు. పోడూరు మండలంలో కొన్ని ఆచంటలో, ఇంకొన్ని పాలకొల్లులో కలిపారు. ఒక మండలంలో గ్రామాలు మరో నియోజకవర్గంలో కలిపితే హద్దులు మారిపోయే అవకాశం ఉంటుంది. ఫలితంగా మూడు నియోజకవర్గాల పెంపుపై పెద్ద కసరత్తే చేయాలి. ఒక లెక్క ప్రకారం... నరసాపురం, పాంకొల్లు, ఆచంట నియోజకవర్గాలు నాలుగు గాను, తణుకు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాలతో పాటు గణపవరం మండలం కలిపి మూడు నియోజకవర్గాలుగాను అయ్యే ఛాన్స్ ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
డీలిమిటేషన్‌పై సీఎం చర్చ
'2029 నాటికి రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్ సభ స్థానాలు పెరనున్నాయి. డీ లిమిటేషన్, మహిళా రిజర్వేషన్లకు పార్టీ పరంగా సిద్ధంగా ఉండాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు వీటిపై అవగాహన పెంచుకోవాలి' అని ఏలూరు జిల్లా ఎమ్మెల్యేల సమావేశంలో సీఎం చంద్రబాబు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి
హైవేపై ట్రావెల్స్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం