పెద్దపులి సంచారం.. ఏజెన్సీ ప్రాంతంలో హై అలర్ట్
ABN , Publish Date - Jul 30 , 2026 | 05:11 PM
తూర్పు గోదావరి జిల్లాలో పెద్దపులి సంచారం తీవ్ర కలకలం రేపింది. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. పెద్దపులి తూర్పు గోదావరి నుంచి ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతానికి చేరుకోవడంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు..
తూర్పు గోదావరి, జులై 30: జిల్లాలో పెద్దపులి సంచారం తీవ్ర కలకలం రేపింది. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో అటవీశాఖ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. పెద్దపులి తూర్పు గోదావరి నుంచి ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతానికి చేరుకోవడంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. గోపాలపురం మండలం నుంచి కొయ్యలగూడెం మండలం పరిధిలోని మంగపతిదేవిపేట, మెత్తప్పగూడెం అటవీ ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. రేడియో కాలర్ సిగ్నల్స్ ఆధారంగా పులి కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్న అధికారులు, దాని జాడ కోసం ప్రత్యేక బృందాలతో అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు.
రేడియో కాలర్ సిగ్నల్ ప్రకారం.. పులి కేవలం 100 మీటర్ల పరిధిలోనే ఉన్నట్లు గుర్తించినప్పటికీ, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. వర్షం తగ్గిన వెంటనే పులి సంచారాన్ని మరింత స్పష్టంగా ట్రాక్ చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. పులి సంచారం నేపథ్యంలో ఏజెన్సీ పరిసర గ్రామాల ప్రజలను అటవీ శాఖ అప్రమత్తం చేసింది. ప్రజలు ఒంటరిగా అటవీ ప్రాంతాల్లోకి వెళ్లవద్దని, ముఖ్యంగా రాత్రి వేళల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పొలాల్లో ఉన్న పశువులను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, పులి కనిపించినా లేదా దాని అడుగుజాడలు గుర్తించినా వెంటనే అధికారులకు సమాచారం అందించాలని కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
2034 వరకూ నేనే ముఖ్యమంత్రిగా ఉంటా: సీఎం రేవంత్‌రెడ్డి
భాగ్యనగరంలో భారీ వర్షాలు.. ట్రాఫిక్ పోలీసుల కీలక సూచనలు
Read Latest Telangana News And National News