Share News

డ్రోన్ల ద్వారా 24 వేల మందికి వైద్యం

ABN , Publish Date - Aug 31 , 2026 | 06:39 AM

గిరిజన ప్రాంతాలకు వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన డ్రోన్‌ ఆధారిత వైద్య రవాణా వ్యవస్థ సత్ఫలితాలు ఇస్తోందని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

డ్రోన్ల ద్వారా 24 వేల మందికి వైద్యం
drone

  • గిరిజన ప్రాంతాల్లో సత్ఫలితాలిస్తున్న డ్రోన్‌ ఆధారిత వైద్య రవాణా వ్యవస్థ

  • ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ వెల్లడి

అమరావతి, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతాలకు వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన డ్రోన్‌ ఆధారిత వైద్య రవాణా వ్యవస్థ సత్ఫలితాలు ఇస్తోందని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. కొండలు, దట్టమైన అటవీ ప్రాంతాల్లో వైద్య పరీక్షలు, మందుల కోసం దూర ప్రాంతాలకు వెళ్తున్న గిరిజనుల ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం.. ఈ డ్రోన్‌ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిందని పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరిలో ప్రారంభించిన ఈ సేవల్లో నాలుగు డ్రోన్లను ఉపయోగించి 1800 మేర ట్రిప్పులు వేసినట్లు తెలిపారు. మొత్తంగా నాలుగు డ్రోన్లు కలిసి 71 వేల కిలోమీటర్లు ప్రయాణించాయని, ఇప్పటి వరకూ 24,500 మందికి వైద్య సేవలు అందించినట్లు మంత్రి వివరించారు. 2200 పైగా వైద్య పరీక్షల నమూనాలను డ్రోన్ల ద్వారా తరలించామన్నారు. ఈ నాలుగు డ్రోన్లు అరకు పరిధిలోని 8 ఆస్పత్రులతో అనుసంధానమై ఉన్నాయని తెలిపారు. పాడేరు ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రితో పాటు లొథుగెడ్డ, తాజంగి, సుంకరమెట్ట, భీమవరం, అనంతగిరి పీహెచ్‌సీలు, ముంచింగిపట్టు సీహెచ్‌సీ, చింతపల్లి, అరకు ఏరియా ఆసుపత్రులతో అనుసంధానం చేశారన్నారు. డ్రోన్‌ కార్యకలాపాలు, సహాయక సేవల్లో స్థానికుల భాగస్వామ్యాన్ని పెంచేందుకు 25 మంది స్థానిక గిరిజన యువతకు శిక్షణ ఇప్పించామని పేర్కొన్నారు. వైద్య పరీక్షల నమూనాలు, మందులు, అవసరమైన సామగ్రిని వేగంగా తరలించడం ద్వారా రోగులకు సకాలంలో చికిత్స అందించేందుకు వీలవుతోందన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

కర్మభూమి తర్వాతే జన్మభూమి

శ్రీశైలానికి పూర్తిగా నిలిచిన ఇన్‌ఫ్లో

Updated Date - Aug 31 , 2026 | 06:43 AM