Share News

ఆగని డిజిటల్‌ అరెస్టుల దందా

ABN , Publish Date - Oct 26 , 2026 | 04:58 AM

డిజిటల్‌ అరెస్టు పేరుతో ఓ రిటైర్డు ఉద్యోగి నుంచి సైబర్‌ కేటుగాళ్లు రూ.1.94 కోట్లు కొట్టేశారు. విశాఖ అక్కయ్యపాలేనికి చెందిన కారి గోపాలరామానుజం ఫోన్‌కు ఈ ఏడాది ఏప్రిల్‌లో వాట్సాప్‌ కాల్‌ వచ్చింది.

ఆగని డిజిటల్‌ అరెస్టుల దందా

  • విశాఖలో రిటైర్డు ఉద్యోగికి టోకరా

  • రూ.1.94 కోట్లు కొట్టేసిన నేరగాళ్లు

  • తెలంగాణలో మరొకరికి రూ.1.17 కోట్లకు బురిడీ

  • మరో రిటైర్డు ఉద్యోగినికి ఇంకో రూ.4 లక్షలకు..

ఎండాడ (విశాఖపట్నం), అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): డిజిటల్‌ అరెస్టు పేరుతో ఓ రిటైర్డు ఉద్యోగి నుంచి సైబర్‌ కేటుగాళ్లు రూ.1.94 కోట్లు కొట్టేశారు. విశాఖ అక్కయ్యపాలేనికి చెందిన కారి గోపాలరామానుజం ఫోన్‌కు ఈ ఏడాది ఏప్రిల్‌లో వాట్సాప్‌ కాల్‌ వచ్చింది. అక్రమ కార్యకలాపాలకు మీ సిమ్‌ వినియోగిస్తున్నారని, బెంగళూరులోని ఇందిరానగర్‌ పోలీసు స్టేషన్‌లో 16 ఫిర్యాదులు నమోదయ్యాయని చెప్పాడు. ఆ తరువాత పోలీసు డ్రెస్‌లో వాట్సాప్‌ వీడియో కాల్స్‌ చేసి ఇందిరానగర్‌ ఎస్‌ఐగా పరిచయం చేసుకున్నాడు.

ఆన్‌లైన్‌ అక్రమ కార్యకలాపాలు, మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్డారని సుప్రీంకోర్టులో కేసు ఉందని, సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసిందని బెదిరించాడు. అంతేకాక మరికొందరితో ఫోన్లు చేయించి, ఆర్‌బీఐ ఆడిటర్ల వెరిఫికేషన్‌ కోసం నగదు బదిలీ చేయాలని, అన్నీ పరిశీలించిన తరువాత తిరిగి ఇచ్చేస్తామని నమ్మ బలికారు. అరెస్టు భయంతో ఫిర్యాదుదారుడు ఏప్రిల్‌ నుంచి జూలైలోపు 13 బ్యాంకు లావాదేవీల ద్వారా రూ.1.94 కోట్లు బదిలీ చేశారు. అయితే ఆగస్టులో చెక్కుల ద్వారా నగదు తిరిగి ఇస్తామని ఇవ్వకపోవడంతో బాధితుడు నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విశాఖ నగర పోలీసులు కేసు నమోదు చేశారు.


తెలంగాణలో మరో రిటైర్డు ఉద్యోగికి రూ.1.17 కోట్లకు టోకరా

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): డిజిటల్‌ అరెస్టు పేరిట జరుగుతున్న మోసాలు కొనసాగుతూనే ఉన్నాయి. డిజిటల్‌ అరెస్టు అంటూ హైదరాబాద్‌కు చెందిన ఓ వృద్ధుడి(71) నుంచి రూ.1.17 కోట్లు కొట్టేసిన సైబర్‌ కేటుగాళ్లు, మరో వృద్ధురాలి(71) నుంచి రూ.4లక్షలు కాజేశారు. ఈ ఘటనలకు సంబంధించి సైబర్‌ క్రైమ్‌ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్‌లోని మారేడ్‌పల్లికి చెందిన ఓ ఈసీఐఎల్‌ రిటైర్డు ఉద్యోగి(71)కి నాసిక్‌ పోలీసులమంటూ సైబర్‌ నేరగాళ్లు వాట్సాప్‌ కాల్‌ చేశారు. మీ బ్యాంకు ఖాతా నుంచి రూ.2కోట్లు ఉగ్రవాదుల ఖాతాలకు బదిలీ అయ్యాయని డిజిటల్‌ అరెస్టు చేస్తున్నామని పేర్కొన్నారు.

ఈ విషయంలో ఎన్‌ఐఏ దర్యాప్తునకు సహకరించాలని కోరారు. వారిని నమ్మిన వృద్ధుడు.. నగదు బదిలీకి తనకి సంబంధం లేదని వివరణ ఇచ్చారు. సైబర్‌ నేరగాళ్ల అడిగిన మేరకు బ్యాంకు ఖాతా వివరాలు, అందులో ఉన్న డబ్బు కోసం కూడా చెప్పాడు. ఆ డబ్బు మనీ లాండరింగ్‌ ద్వారా సంపాదించలేదని నిర్ధారించడానికి తాము సూచించిన బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేయాలని సైబర్‌ నేరగాళ్లు సూచించారు. విచారణ పూర్తయిన తర్వాత డబ్బు వెనక్కి వస్తుందని చెప్పారు. వారిని నమ్మిన బాధితుడు సైబర్‌ నేరగాళ్లు సూచించిన ఖాతాలకు పలు దఫాలుగా రూ. 1.17 కోట్లు బదిలీ చేశాడు. ఆ తర్వాత కూడా డబ్బు డిమాండ్‌ చేయడం, బదిలీ చేసిన డబ్బు వెనక్కి రాకపోవడంతో మోసాన్ని గ్రహించిన వృద్ధుడు పోలీసులను ఆశ్రయించారు.


ఇక, హైదరాబాద్‌లోని భోలక్‌పూర్‌కి చెందిన ఓ రిటైర్డు ఉద్యోగిని (71)ని డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో బెదిరించిన సైబర్‌ నేరగాళ్లు ఆమె వద్ద రూ. 4 లక్షలు కాజేశారు. ముంబై పోలీసులమంటూ వృద్ధురాలిని సంప్రదించిన సైబర్‌ నేరగాళ్లు.. మీ బ్యాంకు ఖాతాల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు విదేశాలకు మళ్లిందని భయపెట్టారు. తాము సూచించిన ఖాతాలోకి రూ.4 లక్షలు జమ చేయకుంటే వెంటనే అరెస్ట్‌ చేస్తామని బెదిరించారు. దాంతో భయపడిన బాధితురాలు బ్యాంకుకు వెళ్లి ఆర్‌టీజీఎస్‌ ద్వారా సైబర్‌ నేరగాళ్లు సూచించిన ఖాతాకు రూ.4 లక్షలు బదిలీ చేశారు. అనంతరం మోసాన్ని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ వార్తలనూ చదవండి:

ఓటరు తీరుమారేనా?

అర్నాబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు హై అలర్ట్.. ముందస్తు చర్యలకు ఆదేశం

Updated Date - Oct 26 , 2026 | 04:59 AM