ఆర్చరీలో చరిత్ర సృష్టించిన ధీరజ్.. మంత్రి నారా లోకేశ్ ప్రశంసలు
ABN , Publish Date - Sep 14 , 2026 | 06:15 PM
భారత క్రీడా రంగంలో ఒకే రోజు రెండు అద్భుత విజయాలు చోటుచేసుకున్నాయి. ఆర్చరీ ప్రపంచ కప్ ఫైనల్‌లో ధీరజ్ బొమ్మదేవర చరిత్ర సృష్టించగా.. ఆసియా కప్ టీ20లో భారత మహిళల జట్టు సత్తా చాటింది. ఈ విజయాలపై మంత్రి నారా లోకేశ్ అభినందనలు తెలిపారు.
అమరావతి, సెప్టెంబర్ 14: మెక్సికోలోని సాల్టిల్లో వేదికగా జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్ ఫైనల్ 2026లో చరిత్రాత్మక విజయం సాధించిన భారత ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవరను ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అభినందించారు. పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ ఆర్చర్‌గా ధీరజ్ రికార్డు సృష్టించడం దేశానికే గర్వకారణమని పేర్కొన్నారు. ముఖ్యంగా ధీరజ్ విజయంతో ఆంధ్రప్రదేశ్ క్రీడా కీర్తి మరింత ఇనుమడించిందని అన్నారు. అంకితభావం, పట్టుదల, క్రమశిక్షణతో పాటు కఠోర సాధన ఫలితంగానే ఈ అద్భుతమైన విజయం సాధ్యమైందని కొనియాడారు. భవిష్యత్తులో ధీరజ్ మరిన్ని అంతర్జాతీయ విజయాలు సాధించి దేశ కీర్తిని మరింత పెంచాలని నారా లోకేశ్ ఆకాంక్షించారు.
అదేవిధంగా 2026 వరల్డ్ ఉమెన్స్ ఆసియా కప్ (టీ20) టైటిల్‌ను కైవసం చేసుకున్న భారత మహిళల క్రికెట్ జట్టుకు నారా లోకేశ్ అభినందనలు తెలిపారు. ఫైనల్‌లో అద్భుతమైన ఆటతీరుతో విజయం సాధించి ఎనిమిదోసారి విజేతగా నిలవడం భారత మహిళల క్రికెట్ జట్టు ప్రతిభకు నిదర్శనమన్నారు. ఈ విజయానికి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీ చరణి కీలకంగా నిలిచారని, అద్భుతమైన బౌలింగ్‌తో నాలుగు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించారని ప్రశంసించారు. బృందస్ఫూర్తి, సమష్టి కృషితో భారత జట్టు సాధించిన ఈ విజయం దేశంలోని యువ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని నారా లోకేశ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
నల్లగొండలో కేటీఆర్ పాదయాత్ర చేస్తే.. నేనూ చేస్తా: మంత్రి కోమటిరెడ్డి
బీఆర్ఎస్‌కు దమ్ముంటే తలసానికి ప్రతిపక్ష నేతగా అవకాశం ఇవ్వాలి: మహేశ్ గౌడ్
Read Latest Telangana News And Telugu News