ఫీజుల ఖరారుకు ఇంకెన్నాళ్లు?
ABN , Publish Date - Nov 23 , 2026 | 04:27 AM
ఉన్నత విద్య ఫీజుల ఖరారుపై అసలు ఉన్నతాధికారులకు ఎందుకంత నిర్లక్ష్యమో అంతుబట్టడంలేదు!
ఉన్నత విద్య కోర్సుల్లో జాప్యం
తాత్కాలిక ఫీజులతో విద్యా సంవత్సరం ప్రారంభం
2 నెలల్లో ఖరారవుతాయని మొదట్లో అంచనా
ఇప్పటికీ రాని నోటిఫికేషన్
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ఉన్నత విద్య ఫీజుల ఖరారుపై అసలు ఉన్నతాధికారులకు ఎందుకంత నిర్లక్ష్యమో అంతుబట్టడంలేదు! తాత్కాలిక ఫీజులతో విద్యా సంవత్సరాన్ని ప్రారంభించగా... ఫీజుల ఖరారు ప్రక్రియ చూస్తుంటే మళ్లీ విద్యా సంవత్సరానికి గానీ పూర్తిస్థాయిలో ఫీజులు ఖరారు కావేమోనన్న సందేహం కలుగుతోంది. ఉన్నత విద్య ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ను.. ఉన్నత విద్య ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణ కమిటీగా మార్చడం ఈ జాప్యానికి ఒక కారణంగా కనిపిస్తున్నా, ఉన్నతాధికారుల అలక్ష్యమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. కమిషన్‌ను కమిటీగా మార్చిన ప్రభుత్వం కొత్త కమిటీకి చైర్మన్, సభ్యులను నియమించింది. అయితే కమిటీ నిబంధనలు, అధికారాలపై ఇవ్వాల్సిన ఉత్తర్వులు ఇంకా విడుదల కాలేదు. ఉన్నత విద్యలో ప్రతి మూడేళ్లకోసారి ఫీజులు ఖరారు చేస్తారు. దానిని బ్లాక్ పీరియడ్ అంటారు. గతేడాదితో బ్లాక్ పీరియడ్ ముగిసింది. ఇప్పుడు 2026-27 విద్యా సంవత్సరం నుంచి మూడేళ్ల కాలానికి ఫీజులు నిర్ణయించాలి. కానీ ఇప్పటివరకూ ఉన్న ఫీజుల కమిషన్‌ను కమిటీగా మార్చేందుకే ప్రభుత్వం చాలా సమయం తీసుకుంది. ఆ తర్వాత చైర్మన్, సభ్యుల నియామకానికి కొంత సమయం పట్టింది. ఇంత చేసినా ఇప్పటికీ రూల్స్ విడుదల చేయలేకపోయింది. ఉన్నత విద్యాశాఖ అధికారుల వద్దే ఈ నిర్ణయం పెండింగ్‌లో ఉండిపోయింది.
కోర్సులు ఎప్పుడో ప్రారంభం
ఈ విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్, డిగ్రీ సహా అన్ని ఉన్నత విద్య కోర్సుల తరగతులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. డిగ్రీ, బీటెక్, పీజీ, మెసిడిన్, ఫార్మసీ కోర్సులకు సంబంధించి రాష్ట్రంలో ఉన్న సుమారు 3వేల విద్యా సంస్థలకు ఫీజులు నిర్ణయించాలి. గతంలో ఈ ప్రక్రియకు దాదాపు ఆరు నెలల సమయం పట్టేది. తొలుత కమిటీ నోటిఫికేషన్ జారీచేస్తుంది. విద్యా సంస్థలు వారి ప్రమాణాలు, మౌలికసదుపాయాలు, ఖర్చుల వివరాలను కమిటీకి సమర్పిస్తాయి. వాటిని కమిటీ ఆడిట్ చేసి విద్యా సంస్థలతో చర్చిస్తుంది. అనంతరం తుది ఫీజులు ఖరారు చేస్తుంది. వేల సంఖ్యలో ఉన్న విద్యాసంస్థలతో చర్చలకు ఎక్కువ సమయం పడుతుంది. ఆ వివరాల ఆడిట్‌కు కూడా చాలా సమయం తీసుకుంటుంది. అయితే ఈ మొత్తం ప్రక్రియ రెండు నెలల్లో పూర్తిచేయొచ్చని విద్యాశాఖలో కొందరు గతంలో అధికారులు ప్రభుత్వానికి తెలిపారు. ఆ సూచనల మేరకే ప్రభుత్వం తాత్కాలిక ఫీజులతో ముందుకెళ్లింది. అయితే అసలు ఇప్పటికీ ఫీజుల ఖరారుకు నోటిఫికేషన్ జాడే లేకపోవడంతో ఇది ఎప్పటికి అవుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది.
మధ్యలో ఖరారుపై అభ్యంతరాలు
ఇలా తాత్కాలిక ఫీజులతో విద్యా సంవత్సరాన్ని ప్రారంభించడం ఇదే తొలిసారి. గతేడాది ఫీజులనే ఈ ఏడాదికి కూడా పొడిగించాలని తొలుత భావించారు. కానీ ఫీజులు త్వరగా ఖరారు చేయొచ్చని కొందరు అధికారులు ప్రభుత్వానికి అనాలోచిత సలహా ఇవ్వడంతో తాత్కాలిక ఫీజులతో విద్యా సంవత్సరాన్ని ప్రారంభించారు. కమిటీ నియామకానికి, రూల్స్ విడుదలకే దాదాపు ఆరు నెలల సమయం పట్టింది. అయినా ఇప్పటికీ పూర్తిస్థాయిలో రూల్స్ విడుదల కాలేదు. అయితే మధ్యలో ఫీజులు ఖరారు చేయడంపై తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం వర్తించని విద్యార్థులపై భారం పెరుగుతుంది. గతేడాది ఫీజులపై 17.5శాతం పెంచి వాటిని తాత్కాలిక ఫీజులుగా నిర్ణయించారు. తుది ఖరారులో ఈ ఫీజులు ఇంకా పెరిగే అవకాశం ఉంది. గతంలో ఎప్పుడూ ఇలా మధ్యలో ఫీజులు పెంచలేదు. దీంతో మధ్యలో ఫీజులు పెంచే ప్రక్రియను ఏపీ పేరెంట్స్ అసోసియేషన్ కూడా తప్పుబట్టింది.
ఈ వార్తలు కూడా చదవండి...
ఇండియన్ రోడ్ నెట్‌వర్క్ ప్రపంచంలోనే నంబర్‌వన్: నితిన్ గడ్కరీ
బీఆర్ఎస్ నేతలను అకారణంగా అరెస్ట్ చేస్తున్నారు.. సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు ధ్వజం