ఎల్‌నినోపై ‘డీప్’ అస్త్రం!
ABN , Publish Date - Sep 02 , 2026 | 05:01 AM
ఎల్‌నినోతో రాష్ట్ర విద్యుత్ సంస్థలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా ప్రధాన రిజర్వాయర్లలో నీటి నిల్వలు అడుగంటడంతో జలవిద్యుదుత్పత్తి దాదాపు నిలిచిపోయింది.
కేంద్ర పోర్టల్ ద్వారా విద్యుత్ కొనుగోలుకు టెండర్ల ఆహ్వానం
తక్కువ ధరకే కరెంటు లభించే అవకాశం
సమన్వయ కమిటీ భేటీలో విజయానంద్
అమరావతి, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినోతో రాష్ట్ర విద్యుత్ సంస్థలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా ప్రధాన రిజర్వాయర్లలో నీటి నిల్వలు అడుగంటడంతో జలవిద్యుదుత్పత్తి దాదాపు నిలిచిపోయింది. మరోవైపు విద్యుత్ డిమాండ్ గతేడాది ఇదే సమయానికంటే 20 శాతం పెరిగింది. ఈ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు విద్యుత్ శాఖ ప్రయత్నాలు ప్రారంభించింది. ఎల్‌నినో కష్టాలను డీఈఈపీ (డిస్కవరీ ఆఫ్ ఎఫిషియంట్ ఎలక్ట్రిసిటీ ప్రైస్-డీప్)తో ఎదుర్కోవాలని నిర్ణయించింది. రానున్న వేసవి డిమాండ్‌ను తీర్చేందుకు కావలసిన విద్యుత్‌ను అతితక్కువ ధరకే సమకూర్చుకునేందుకు రాష్ట్ర డిస్కంలు కేంద్ర విద్యుత్ శాఖ నిర్వహించే ‘డీప్’ పోర్టల్‌లో టెండర్లను ఆహ్వానించినట్లు ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ మంగళవారం వెల్లడించారు. విజయవాడ విద్యుత్ సౌధలో ఏపీ విద్యుత్ సమన్వయ కమిటీ (ఏపీపీసీసీ), రాష్ట్ర డిస్కంల అధికారులతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి, సెప్టెంబరు, అక్టోబరులో కరెంటు సరఫరా ప్రణాళికలపై చర్చించారు. సెప్టెంబరులో గరిష్ఠ విద్యుత్ డిమాండ్ సుమారు 13,500 మెగావాట్లు, అక్టోబరులో 12 వేల మెగావాట్లు ఉండే అవకాశం ఉందని.. దాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధమవ్వాలని అధికారులను ఆదేశించారు. రానున్న వేసవిలో డిమాండ్‌ను ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఇందులో భాగంగానే ‘డీప్’ టెండర్లను ఆహ్వానించామని, పునరుతుత్పాదక ఇందన ఉత్పత్తిపై కూడా దృష్టి సారించాలని స్పష్టంచేశారు.
డీప్‌తో ప్రయోజనమిదీ..
రాష్ట్రంలో డిమాండ్‌కు తగినట్లుగా ఉత్పత్తి లేని సమయంలో బహిరంగ మార్కెట్‌లో విద్యుత్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అప్పటికప్పుడు కొనాలంటే యూనిట్‌కు రూ.10వరకు వెచ్చించాల్సి ఉంటుంది. కొనుగోలు వ్యయాన్ని తగ్గించుకోవాలంటే ముందస్తు ప్రణాళిక ముఖ్యం. దీనికి ‘డీప్’ పోర్టల్ బాగా ఉపయోగపడుతుంది. ఈ పోర్టల్ ద్వారా టెండర్లను ఆహ్వానిస్తే అతి తక్కువ ధరకు.. యూనిట్ రూ.4లోపే విద్యుత్ లభ్యమయ్యే అవకాశం ఉంటుంది.
సోలార్ రూఫ్‌టాఫ్‌లో 4వ స్థానం
సోలార్ రూఫ్‌టాప్ కనెక్షన్లలో ఆగస్టు 30 వరకు 4.93 లక్షల కనెక్షన్లు ఏర్పాటు చేయడం ద్వారా ఏపీ జాతీయస్థాయిలో 4వ స్థానంలో నిలిచిందని విజయానంద్ తెలిపారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ వినియోగదారుల కోసం ప్రభుత్వం ఉచితంగా ఏర్పాటు చేసిన 3.01 లక్షల కనెక్షన్లు కూడా ఉన్నాయని చెప్పారు. వీరికి ఈనెలాఖరుకల్లా సోలార్ రూఫ్‌టాప్ ఇన్‌స్టాలేషన్లు పూర్తి చేయాలని డిస్కంలను ఆదేశించారు.
సవాళ్ల నడుమే సమర్థ సరఫరా
రాష్ట్ర థర్మల్ సామర్థ్యం 8902 మెగావాట్లు కాగా.. ఆగస్టులో సగటున 5904 మెగావాట్లు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. విద్యుత్ లభ్యత తగ్గడానికి.. ఎన్‌టీటీపీఎస్‌లో యూనిట్-3, 4.. ఆర్‌టీపీపీ యూనిట్-5, 6.. హిందూజా నేషనల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో యూనిట్-2.. ఎస్‌డీఎస్‌టీపీఎస్‌లో యూనిట్-3లో జరిగిన మరమ్మతులు, ఓవర్‌హాల్ పనులే ప్రధాన కారణం. ఇన్ని సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ ఆగస్టులో రాష్ట్ర గ్రిడ్ డిమాండ్‌ను సగటున రోజుకు 269 మిలియన్ యూనిట్ల మేర తీర్చామని చెప్పారు.
91.30 కోట్లు బకాయిలు విడుదల
వివిధ ప్రభుత్వ శాఖల విద్యుత్ బకాయిల కోసం రూ.91.30 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల విద్యుత్ వినియోగ చార్జీల చెల్లింపుల కోసం ఈ మొత్తాన్ని డిస్కంలకు చెల్లించనున్నారు. పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, సాగునీటి శాఖ మినహా మిగిలిన ప్రభుత్వ శాఖలకు సంబంధించి 2026-27 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం వరకు ఉన్న విద్యుత్ బిల్లుల చెల్లింపుల కోసం ఈ నిధులను కేటాయించారు.
రాజధాని విద్యుత్ ప్రణాళిక భేష్
రాజధాని అమరావతి ప్రాంతంలో అమలు చేయనున్న విద్యుత్ ప్రణాళికను డెన్మార్క్ బృందం ప్రశంసించింది. భారత్-డెన్మార్క్ ఇంధన భాగస్వామ్యంలో భాగంగా మంగళవారం డెన్మార్క్ ప్రతినిధులు సీపీడీసీఎల్ అధికారులతో సమావేశమయ్యారు. సీఎండీ పుల్లారావు అమరావతి విద్యుత్ ప్రణాళికను వివరించారు. సమావేశంలో సీపీడీసీఎల్ డైరెక్టర్లు ఆవుల మురళీకృష్ణ, టీవీఎ్‌సఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలను కూడా చదవండి
సమావేశాలు నిర్వహించి.. సమస్యలు తెలుసుకుని