Share News

బిగ్ అలర్ట్.. రేపటి నుంచి తీరప్రాంత రహదారులు బంద్..

ABN , Publish Date - Oct 26 , 2026 | 10:16 PM

అర్నబ్ తుఫాన్ మరింత బలపడే అవకాశం ఉండటంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం మధ్యాహ్నం నుంచి తీర ప్రాంత రహదారులను బంద్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

బిగ్ అలర్ట్.. రేపటి నుంచి తీరప్రాంత రహదారులు బంద్..

అమరావతి: అర్నబ్ తుఫాన్ మరింత బలపడే అవకాశం ఉండటంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం మధ్యాహ్నం నుంచి తీర ప్రాంత రహదారులను బంద్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ముందస్తు చర్యలలో భాగంగా మంగళవారం ఉదయం నుంచి బీచ్‌లను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రాణ నష్టం జరగకుండా చూడటమే లక్ష్యమని అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో వాయుగుండం కదలికలు.. ప్రభావంపై ఆర్జీజీఎస్ కార్యదర్శి కాంటనేని భాస్కర్, సీఈవో ప్రఖర్ జైన్ నిరంతర సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఆయా శాఖల అధికారులతో ముందస్తు సన్నద్ధతపై సమీక్షలు నిర్వహించారు.


తుఫాన్ సన్నద్ధత చర్యలపై ఎప్పటికప్పుడు సీఎంకు వివరిస్తున్నారు అధికారులు. 11 జిల్లాలకు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తరలించారు. ఇదే సమయంలో లోత‌ట్టు ప్రాంత ప్రజ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లిస్తున్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యా సంస్థల‌కు సెల‌వు ప్రకటించారు అధికారులు. 16 జిల్లాల్లో 2,460 రెవెన్యూ గ్రామాలు, 92 ప‌ట్టణ ప్రాంతాల్లో తుఫాన్ ప్రభావం ఎక్కువ‌గా ఉంటుంద‌ని అధికారులు అంచనా వేస్తున్నారు. 1,763 తుఫాన్ షెల్టర్లను ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయి, మండ‌ల స్థాయిలో 2,907 కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. తుఫాన్ స‌హాయక చ‌ర్యల కోసం 3,185 మంది నోడ‌ల్ ఆఫీస‌ర్లను ప్రభుత్వం నియమించింది.


2,107 స్వర్ణ గ్రామ‌, స్వర్ణ వార్డుల పరిధిలో బాధితుల త‌ర‌లింపునకు చర్యలు చేపట్టారు. చేప‌ల వేట‌కు వెళ్లిన మ‌త్స్యకారులంతా ఇళ్లకు చేరుకునేలా చర్యలు చేపట్టారు. మ‌త్స్యకారుల‌కు చెందిన 30,043 ప‌డ‌వ‌ల‌న్నీ రేవుల్లో నిలిపివేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వైద్య సేవ‌ల‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. నీటి స‌మ‌స్య త‌లెత్తకుండా 2,613 అత్యవ‌స‌ర నీళ్ల ట్యాంకులు సిద్ధం చేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో చెట్లు కూలితే వెంట‌నే తొల‌గించేలా అగ్నిమాప‌క ద‌ళాలను ప్రభుత్వం సిద్ధం చేసింది.


ఈ వార్తలూ చదవండి

ప్రయాణికులకు అలర్ట్.. తుఫాన్ వేళ ఈ రైళ్ల రద్దు

అర్నబ్ తుఫాన్ సహాయక చర్యల కోసం నిధులు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం

Updated Date - Oct 26 , 2026 | 10:16 PM