Share News

అడుగుపెట్టొద్దంతే!

ABN , Publish Date - Nov 22 , 2026 | 02:35 AM

మరో నాలుగు రోజుల్లో తన మేనకోడలి వివాహం! పెళ్లి పనుల కోసం ఆదివారం నుంచి ఆ ఇంట్లో బస చేసేందుకు చెల్లి ఏర్పాట్లు! ఇంతలో అన్న ‘గన్‌’ ఎక్కుపెట్టారు. తన చెల్లి ఆ ఇంట్లోకి అడుగుపెట్టడానికి వీల్లేదంటూ కోర్టు నుంచి ...

అడుగుపెట్టొద్దంతే!

  • యలహంకలోకి షర్మిలకు ‘నో ఎంట్రీ’

  • కోర్టుకెక్కి ఉత్తర్వులు తెచ్చుకున్న జగన్‌

(అమరావతి - ఆంధ్రజ్యోతి): మరో నాలుగు రోజుల్లో తన మేనకోడలి వివాహం! పెళ్లి పనుల కోసం ఆదివారం నుంచి ఆ ఇంట్లో బస చేసేందుకు చెల్లి ఏర్పాట్లు! ఇంతలో అన్న ‘గన్‌’ ఎక్కుపెట్టారు. తన చెల్లి ఆ ఇంట్లోకి అడుగుపెట్టడానికి వీల్లేదంటూ కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ఆ అన్న... మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి. చెల్లెలు... వైఎస్‌ షర్మిల! తాజా పరిణామంతో... అన్నా చెల్లెళ్ల మధ్య వివాదం పతాక స్థాయికి చేరినట్లయింది. బెంగళూరులోని యలహంకలో ఉన్న సువిశాల ప్రాంగణంలో తండ్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి తనకు, తన సోదరుడికి వేర్వేరు భవనాలు నిర్మించి ఇచ్చారని షర్మిల చెబుతున్నారు.

యలహంక ఆస్తిలో షర్మిలకూ వాటా ఉందని తల్లి విజయలక్ష్మి గతంలో స్పష్టం చేశారు. అప్పట్లో ఈ ఆస్తిని వైఎస్‌ కొన్ని ప్రత్యేక కారణాలవల్ల జగన్‌ అత్త(భారతీ రెడ్డి తల్లి) సుగుణమ్మ పేరిట పెట్టినట్లు తెలుస్తోంది. బెంగళూరుకు వెళ్లినప్పుడు యలహంక గెస్ట్‌హౌస్‌లో షర్మిల బస చేసేవారు. ఈ క్రమంలో తన కుమార్తె అంజలి రెడ్డి వివాహాన్ని యలహంక నివాసంలో జరిపించాలనుకోవడం... ‘ఆ ఆస్తితో నీకు సంబంధంలేదు.


అదంతా మాదే. అక్కడ వేడుకలు జరిపితే నా భద్రతకు ప్రమాదం’ అని జగన్‌ సూటిగా చెప్పడం అందరికీ తెలిసిందే. ఈ వివాదం నేపథ్యంలో షర్మిల తన కుమార్తె వివాహ వేదికను కూడా మార్చుకున్నారు. ఈనెల 25వ తేదీనే పెళ్లి! దీనికి సంబంధించిన పనులకోసం ఆదివారం నుంచి యలహంక ప్యాలెస్‌లో కుటుం బ సభ్యులు, బంధువులతో బస చేయాలని షర్మిల భావించారు.

కానీ... అనూహ్యంగా జగన్‌ కోర్టును ఆశ్రయించి, ‘నో ఎంట్రీ’ ఆదేశాలు పొందారు. షర్మిల యలహంక నివాసంలోకి అడుగుపెట్టకుండా అడ్డుకోవాలంటూ 18న జగన్‌ తొలిసారి ప్రయత్నం చేశారు. బెంగళూరులోని దేవనహళ్లి సివిల్‌ జడ్జి కోర్టులో షర్మిలను ప్రతివాదిగా చేరుస్తూ... సిలికాన్‌ బిల్డర్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ తరఫున భీమిశెట్టి రమేశ్‌ బాబు ఈ కేసు దాఖలు చేశారు. అయితే... అనూహ్యంగా ఆ కేసును వెనక్కి తీసుకొన్నారు. ఆ తర్వాత శుక్రవారం దేవనహళ్లిలోనే ఉన్న సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో భీమిశెట్టి రమేశ్‌ బాబు మరో పిటిషన్‌ వేశారు.

‘‘షర్మిలతోపాటు ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు, అనుచరులెవరూ యలహంకలోని నివాసంలోకి అడుగుపెట్టనివ్వొదు’’ అని కోర్టు ను కోరారు. అయితే... షర్మిలను ప్రతివాదిగా చేర్చు తూ జగన్‌ కాకుండా భీమిశెట్టి రమేశ్‌ బాబు అనే మూడోవ్యక్తి కోర్టుకెక్కడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ‘ఈ ప్యాలెస్‌ మొత్తం నాది’ అని జగన్‌ చెబుతుండగా... ‘నాకూ వాటా ఉంది’ అని షర్మిల వాదిస్తున్నారు. మరి... మధ్యలో భీమిశెట్టి ఎందుకొచ్చారు? కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌, కోర్టు తీర్పు ప్రకారం... సిలికాన్‌ బిల్డర్స్‌కు చెందిన రమేశ్‌ బాబు 2007లోనే జగన్‌ అత్త సుగుణమ్మ దగ్గర ఈ ప్రాపర్టీని లీజుకు తీసుకున్నారట! ఈ లీజు కాలపరిమితి 2027 ఫిబ్రవరి 27 దాకా ఆయనకు ఉందని, ఆ ఇంట్లో తాను వ్యవసాయం, ఇతర మొక్కల పెంపకం వంటి పనులు చేస్తున్నట్లుగా ఆయన కోర్టుకు నివేదించారు. ‘‘అంతకుముందు ఇక్కడి గెస్ట్‌హౌస్‌లో షర్మిల తాత్కాలికంగా బస చేసేందుకు అనుమతించడం వాస్తవమే.


ఇప్పుడు అలంకరణ పేరిట తన మనుషులను పంపి ఆస్తిని తన ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే జరిగితే... అక్కడ ఉన్న వ్యవసాయం దెబ్బతింటుంది. మొక్కలు పాడైపోతాయి. అందువల్ల షర్మిలను, ఆమె తరఫు వారెవరినీ ఇంట్లోకి రాకుండా అత్యవసరంగా ఎక్స్‌పార్టీ ఉత్తర్వులు ఇవ్వండి’’ అని భీమిశెట్టి కోర్టును అభ్యర్థించారు. న్యాయస్థానం దీనికి అనుకూలంగా పర్మనెంట్‌ ఇంజక్షన్‌ ఆర్డర్స్‌ జారీ చేసింది.

ఎన్నెన్నో మలుపులు..

యలహంక ప్రాపర్టీని సుగుణమ్మ నుంచి భీమిశెట్టి రమేశ్‌ బాబు లీజుకు తీసుకున్నారనే విషయం ఇప్పటిదాకా రహస్యమే! ఇప్పుడు ఆయన కోర్టును ఆశ్రయించడంతో విషయం బయటపడింది. పిటిషన్‌లోనే మరో ఆసక్తికరమైన అంశమూ ఉంది. ‘‘2027 దాకా లీజు గడువు ఉన్నప్పటికీ... ఆ ఆస్తిని సుగుణమ్మ తన ఇంటిని ఆమె కూతురు, మనవరాళ్లకు గత ఏడాది ఆగస్టు 27న గిఫ్ట్‌ రిజిస్ట్రేషన్‌ చేశారు’’ అని పేర్కొన్నారు. అంటే... ఆ ఆస్తి జగన్‌ భార్య భారతీ రెడ్డి, కూతుళ్లకు బదిలీ అయ్యిందన్న మాట! ‘బెంగళూరులోని జగన్‌ భవనంలోకి, ఆ పరిసరాల్లోకి కూడా షర్మిల, ఆమె మనుషులు అడుగుపెట్టవద్దని కోర్టు ఆదేశాలు ఇచ్చింది’ అని జగన్‌ మీడియా పేర్కొనడం గమనార్హం.

ఎవరీ భీమిశెట్టి రమేశ్‌ బాబు?

షర్మిలను ప్రతివాదిగా చేర్చుతూ కోర్టులో కేసు వేసిన భీమిశెట్టి రమేశ్‌ బాబు పూర్తిగా జగన్‌ సొంత మనిషి. జగన్‌ కంపెనీ సండూర్‌ పవర్‌లో ఆయన డైరెక్టర్‌. ఇక... భీమిశెట్టి రమేశ్‌ బాబు డైరెక్టర్‌గా ఉన్న సిలికాన్‌ బిల్డర్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌లో జగన్‌ వాటాదారు. ఇందులో జగన్‌ సతీమణి భారతి కొంతకాలం డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. జగన్‌ ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ ఫౌండేషన్‌లోనూ రమేశ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. జగన్‌ సృష్టించిన కంపెనీల్లో సిలికాన్‌ బిల్డర్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కూడా ఉందని, రమేశ్‌బాబు జగన్‌కు బినామీ అని గతంలో, అనేక కంపెనీల్లో ఇద్దరూ ‘భాగస్వాములు’గా ఉన్నారని సీబీఐ వెల్లడించింది.


పూడ్చుకోలేని నష్టమట..

ప్రతివాది షర్మిలకు నోటీసు ఇవ్వకుండానే ఎక్స్‌పార్టీ ఆదేశం ఎందుకు ఇచ్చారో దేవనహళ్లి ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వైఎస్‌ షర్మిల యలహంక నివాసంలో అడుగుపెడితే... లీజుదారుడు భీమిశెట్టి రమేశ్‌బాబుకు పూడ్చుకోలేని నష్టాలు, కష్టాలు వస్తాయన్నారు. అందుకే ఆయన కోరినట్లుగా అత్యవసరంగా ఎక్స్‌పార్టీ ఉత్తర్వులు ఇస్తున్నట్లు తెలిపారు. ఏదైనా ఉంటే డిసెంబరు 19న కోర్టుకు వచ్చి పిటిషన్‌ వేసుకోవాలని షర్మిలకు సూచించారు.

ఈ వార్తలనూ చదవండి:

బెంగళూరుకు షర్మిల.. అడ్డుకునేందుకు జగన్ భారీ స్కెచ్..?

కేబీసీ సీజన్ 18 మొదటి కోటీశ్వరుడిగా యూపీఎస్సీ అభ్యర్థి

Updated Date - Nov 22 , 2026 | 02:41 AM