Share News

రోజుకో అడుగు తగ్గుతూ..!

ABN , Publish Date - Sep 04 , 2026 | 06:30 AM

శ్రీశైల జలాశయానికి ఇరవై రోజులుగా వరద ప్రవాహం పుర్తిగా నిలిచిపోయింది. ఎగువనుంచి అంతంతమాత్రంగా వస్తున్న నీటిని తెలంగాణ విద్యుదుత్పాదనకు వాడేస్తోంది.

రోజుకో అడుగు తగ్గుతూ..!

870 అడుగులకు చేరిన శ్రీశైలం నీటిమట్టం

శ్రీశైలం/విజయపురి సౌత్‌/అచ్చంపేట, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): శ్రీశైల జలాశయానికి ఇరవై రోజులుగా వరద ప్రవాహం పుర్తిగా నిలిచిపోయింది. ఎగువనుంచి అంతంతమాత్రంగా వస్తున్న నీటిని తెలంగాణ విద్యుదుత్పాదనకు వాడేస్తోంది. కుడి గట్టులో ఏపీ విద్యుదుత్పత్తి నిలిపివేసినా పొరుగు రాష్ట్రం ఎడమగట్టు విద్యుత్‌ కేంద్రంలో ఉత్పత్తి కొనసాగిస్తూ.. వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు వదులుతోంది. ఈ క్రమంలో రోజుకో అడుగు తగ్గుతూ ప్రస్తుతం 870 అడుగులకు పడిపోయింది. గురువారం జూరాల నుంచి 8,328 క్యూసెక్కులు విడుదలైనా.. సాయంత్రానికి శ్రీశైలానికి 6,522 క్యూసెక్కులే వచ్చాయి. ప్రతి రోజులాగే తెలంగాణ విద్యుదుత్పత్తి చేసి 28,252 క్యూసెక్కులను దిగువకు విడుదల చేసింది. హంద్రీ-నీవా నుంచి 2,711 క్యూసెక్కులు, కల్వకుర్తి నుంచి 2,400 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు నుంచి 8,000 క్యూసెక్కులు, వెలిగొండ ప్రాజెక్టుకు 3,500 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 166 క్యూసెక్కులు విడుదలై మొత్తంగా 45,029 క్యూసెక్కులు అవుట్‌ఫ్లోగా నమోదైంది. శ్రీశైలం గరిష్ఠ సామర్ధ్యం 215.80 టీఎంసీలకుగాను ప్రస్తుతం 144.80 టీఎంసీలే ఉన్నాయి. మరోవైపు.. గురువారం నాగార్జున సాగర్‌ కుడికాలువ ద్వారా 6553 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 6870 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2000 క్యూసెక్కులు.. మొత్తం 24,339 క్యూసెక్కులు విడుదల చేశారు. సాగర్‌ గరిష్ఠ సామర్థ్యం 312.050 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 179.28 టీఎంసీలున్నాయి. దిగువన పులిచింతల ప్రాజెక్టుకు ప్రవాహమూ రావడంలేదు.

ఇవి కూడా చదవండి

తిలక్‌ అదిరెన్‌!

కేరళ సీఎంతో రొనాల్డ్ సోదరి భేటీ.. వీడియో వైరల్

Updated Date - Sep 04 , 2026 | 06:31 AM