Share News

ఎక్కడా రెబల్స్‌ పోటీలో ఉండొద్దు

ABN , Publish Date - Oct 29 , 2026 | 04:02 AM

ఎంపీటీసీ, జడ్పీటీసీల ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) సవరించింది. నవంబరు 3న జరగాల్సిన ఎన్నికలను నవంబరు 5వ తేదీకి మార్చింది. రీపోలింగ్‌ తేదీని నవంబరు 4 నుంచి 6వ తేదీకి, ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన తేదీని నవంబరు 5 నుంచి 7వ తేదీకి మార్చింది.

ఎక్కడా రెబల్స్‌ పోటీలో ఉండొద్దు

పరిషత్‌ ఎన్నికలు నవంబరు 5న

6న రీపోలింగ్‌, 7న ఓట్ల లెక్కింపు

ఎంపీటీసీ, జెడ్పీటీసీ షెడ్యూల్‌ మార్పు

అమరావతి, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): ఎంపీటీసీ, జడ్పీటీసీల ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) సవరించింది. నవంబరు 3న జరగాల్సిన ఎన్నికలను నవంబరు 5వ తేదీకి మార్చింది. రీపోలింగ్‌ తేదీని నవంబరు 4 నుంచి 6వ తేదీకి, ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన తేదీని నవంబరు 5 నుంచి 7వ తేదీకి మార్చింది. బుధవారం రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ మేరకు సవరించిన నోటిఫికేషన్‌ జారీ చేసింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తుఫాను ప్రభావిత పరిస్థితుల నేపథ్యంలో అంతకుముందు కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులతో చర్చించింది. పరిస్థితిని అంచనా వేసి, వారు ఇచ్చిన హామీలను పరిగణనలోకి తీసుకుంది.

పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌ను వాయిదా వేయాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌ నవంబరు 1న యథాతథంగా నిర్వహించనున్నారు. ఈ నెల 19న రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్‌ జారీచేసింది. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకారం పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాలను సంబంధిత రిటర్నింగ్‌ అధికారులు ఈ నెల 27న మధ్యాహ్నం 3 గంటల తర్వాత ప్రకటించారు. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు నవంబరు 3న జరగనుండగా, అదే రోజున ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ నిర్వహించాల్సి ఉంది.

ఈ రెండు కార్యక్రమాలను ఒకే రోజు సమర్థవంతంగా నిర్వహించడానికి అవసరమైన పోలీసు, పోలింగ్‌ సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఎన్నికల షెడ్యూల్‌ను సవరించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల తేదీలను మార్చింది.


88 పోలింగ్‌ కేంద్రాల్లో 3 గంటలకు ముగింపు

ఈ నెల 20న రాష్ట్ర ఎన్నికల సంఘం జారీచేసిన నోటిఫికేషన్ల ప్రకారం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 10 మండలాల్లో 44 పోలింగ్‌ కేంద్రాలకు, పోలవరం జిల్లాలోని 7 మండలాల్లో 44 పోలింగ్‌ కేంద్రాలకు పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌ ముగింపు సమయాన్ని సాయంత్రం 5 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలకు మార్చాలని ముందుగానే నిర్ణయించింది. ఈ 88 పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌, అవసరమైన చోట రీపోలింగ్‌ మధ్యాహ్నం 3 గంటలకే ముగుస్తాయి. సవరించిన ఎన్నికల షెడ్యూల్‌పై విస్తృత ప్రచారం కల్పించాలని అన్నీ జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది.

ఈ వార్తలనూ చదవండి:

పోటాపోటీ

ఆర్నబ్ తుఫాన్ బాధితులకు సీఎం చంద్రబాబు భారీ ఊరట

Updated Date - Oct 29 , 2026 | 04:02 AM